పోలవరంను సందర్శించిన కేంద్ర జలశక్తి మంత్రి….

0
339

దేవీపట్నం, మార్చి4, నవతరం: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవీపట్నం మండల పరిధిలోని ఇందుకూరులోని ఇందుకూరు -1 పునరావాసకాలనీని ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రివర్యులు గజేంద్రసింగ్ షెకావత్ తో కలిసి కాలనీ గృహాలను పునరావాస కాలనీ వాసులు, సామాజిక అవసరాల నిమిత్తం నెలకొల్పిన అంగన్ వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామసచివాలయం. పాఠశాల పనితీరు గూర్చి, కల్పించిన మౌళిక సదుపాయాలు వారు పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. అదేవిధంగా పునరావాస కాలనీలో నివాసముంటున్న నిర్వాసిత కుటుంబాలవారితో ముచ్చటించి ప్యాకేజ్ పూర్తిస్థాయిలో అందిందా? అలాగే భూమికి భూమి క్రింద భూములు అధికారులు ఏమేరకు ఇచ్చారు? అవి వ్యవసాయయోగ్యం, ఫలదాయకంగా వుండి సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతున్నది, పునరావాస కాలనీ ఆధునికంగా కల్పించిన వసతులు ఎలా వున్నాయని వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పునరావాస కాలనీలలోని నిర్వాసిత కుటుంబాల వారికి కల్పిస్తున్న వసతులు, సదుపాయాలను పరిశీలించేందుకు కేంద్రమంత్రి వర్యులతో కలసి పర్యటనకు రావడం జరిగిందన్నారు. అధికారులు కూడా నిర్వాసిత కుటుంబాల పట్ల అత్యంత శ్రద్ధ కనబర్చి మెరుగైన ఆధునిక వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో నిర్వాసిత కుటుంబాల పట్ల మరింత ధ్యాస పెట్టాలని ఆయన అధికార యంత్రాంగానికి సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ లో ఏర్పడినపుడు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదా కల్పించిందని ఆ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకారం అందించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంచి ఊతమిచ్చే ప్రాజెక్టు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అన్నారు. సాగు, త్రాగునీటి సరఫరాలకు కూడా మరింతగా ఊతమివ్వగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పునరావాస ప్యాకేజ్ క్రింద కేంద్ర ప్రభుత్వం 6,86,000 ఇస్తోందని దానికి తోడుగా నిర్వాసితుల త్యాగాలకు ప్రతిఫలంగా మరో 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వెరసి ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన ఈ మాటను నెరవేర్చడం జరుగుతుందన్నారు. 2006 సంవత్సరంలో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిర్వాసితులు ముంపులో కోల్పోయిన భూములకు ఆనాటి చట్ట ప్రకారం లక్షన్నర రూపాయలు మాత్రమే ఎకరాకు నష్టపరిహారంగా ఇచ్చారని మరలా ఇప్పుడు మరో మూడున్నర లక్షల వరకు పెంచి ఇస్తామని అందరికి మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి సంబందించి కేంద్రమంత్రి వర్యులు ఒక మంచి ప్రాజెక్టుకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అందుకు పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. ఆమేరకు రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకొని నైపుణ్యాభివృద్ధి ద్వారా నిర్వాసిత కుటుంబాల వారి జీవనోపాధి మెరుగుదలకు పాటుపడటం జరుగుతుందన్నారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ పునరావాస కాలనీ నిర్మాణాలలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. నిర్వాసిత కుటుంబాల వారి ఆకాంక్షకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంటు మరియు ఇతరత్రా కార్యక్రమాల ద్వారా జీవనోపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన సహకారం అందిస్తామన్నారు. పునరావాస కాలనీ నిర్వాసిత కుటుంబాల వారితో ముచ్చటించడం ఆనందంగా ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఎటువంటి అవసరం ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా తగిన సహకారం అందిస్తానన్నారు. అందరూ భారతీయుల అభ్యున్నతికై పాటుపడాలని ఆయన సూచించారు. ముంపు ప్రాంత నిర్వాసితులు జాతీయ ప్రాజెక్టు అవసరాలను గుర్తించి చేసిన త్యాగాలను ప్రతిఒక్కరూ దృష్టిలో వుంచుకొని వారి అభ్యున్నతికై మరింతగా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.

జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఒక బెస్టు ఐడియల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చర్యలు చేపడతామన్నారు.

జిల్లా కలెక్టరు సి . హరికిరణ్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇందుకూరు -1 లో ఏనుగులగూడెం -107, మంటూరు -172, అగ్రహారం-70 మంది నిర్వాసిత కుటుంబాలకు చెందిన వారి కొరకు నిర్మించారని మొత్తం 350 గృహాలు నిర్మించగా వాటిలో 306 కుటుంబాల వారునివాసాలుంటున్నారన్నారు. భూమికి భూమి క్రింద 87 మంది నిర్వాసితులుకు 161 ఎకరాలు అందించడం జరిగిందన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని 79 శాతము మందికి ఇప్పటివరకు అందించడం జరిగిందన్నారు. ఇందుకూరు -1 లో 40 గ్రీవెన్సులున్నాయన్నారు. పునరావాస కాలనీలలో నిర్వాసితులు మూడు రకాలు సమస్యలు తమ దృష్టికి తెచ్చారని వాటిలో మొదటిది ఉపాధి పనిదినాలు 100 నుంచి 200 కు పెంచాలని, రెండవది పశువుల కొరకు షెడ్లు నిర్మించాలని, మూడవది అసైన్డ్ భూములకు బి పారం పట్టాలు ఇప్పించాలని కోరారన్నారు. గుడి నిర్మాణానికి కమిటీ సభ్యులకు రూ. 61 లక్షలు నిధులు రావాల్సి వుంద న్నారు. మంటూరు గ్రామానికి చెంది ఈ పునరావాస కాలనీలో నివాసముంటున్న నిర్వాసితుడు కోళ్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్యాకేజ్ అందిందని, నవరత్నాలులో బాగంగా అమ్మఒడి, రైతుభరోసా వంటి పలు సంక్షేమపధకాల లబ్దిని తమ కుటుంబ సభ్యులం పొందామన్నారు. మాకు కాలనీలో ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్ వాడీ, గ్రామపచివాలయం ద్వారా అన్నిరకాల సేవలు వాలంటీర్లు అందించడం జరుగుతోందని, ఏఎన్ఎం, ఆశాలు కరోనా కట్టడి చర్యలలో నిమగ్నమై నిర్వాసిత కుటుంబాలకు వైద్యసేవలందించి ఆరోగ్య భద్రతకు పాటుపడ్డారన్నారు. ఉపాధి హామీ పధకంలో 100 రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచాలని కోరారు. బినామీ భూసమస్యలు పరిష్కరించి తాము పంటల సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏనుగులగూడెంకు చెంది ఇందుకూరు -1 పునరావాస కాలనీలో నివాసముంటున్న మడకం పోశమ్మ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిర్దేశించిన కటాప్ తేదీ ఆధారంగా అప్పట్లో 18 సంవత్సరాలు నిండిన ప్యాకేజీకి ఆడపిల్లలను అర్హులుగా ప్రకటించారే తప్ప ప్యాకేజి ఇవ్వలేదని, ప్రస్తుతం పెళ్ళిళ్లు అయ్యాయని భర్తతో నివశించడం వల్ల ప్యాకేజీని ఇవ్వడం లేదని ఆసమస్యకు పరిష్కారమార్గం యోచించాలని ఆమె కోరారు. పునరావాస కాలనీలలో జీవనశైలి మెరుగుపడింది తప్ప జీవనోపాధులు దొరకడంలేదని గతంలో తమ ముంపు గ్రామాలలో ఉపాధికి కొదవ ఉండేది కాదని ఏదోకటి చేసుకొని జీవనాన్ని వెలిబుచ్చేవారమని ఆ రకంగా స్థానిక ఉపాధి మార్గాలు లేవని స్కిల్ డెవలప్మెంటు ద్వారా శిక్షణలు ఇప్పించి కుటీర మరియు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మానకృష్ణదాస్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బి.సి సంక్షేమశాఖ మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, జలవనరుశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ డి.దొరబాబు, అరకు ఎంపి జి.మాధవి, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్, బిజెపి అధ్యక్షులు ఎస్. వీర్రాజు, ఎమ్మెల్సీలు అనంత ఉదయ భాస్కర్, తోట త్రిమూర్తులు, శాసనసభ్యులు ధనలక్ష్మీ, జె.రాజా. ఎస్. సూర్యనారాయణరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, కె చిట్టిబాబు, జెసి భార్గవ్ తేజ, పిఓ సీవీ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్లు కట్టా సింహాచలం, ఇలాక్కియా తదితరులు పాల్గొన్నారు.