మాట్లాడితే నిప్పు అంటారు. ఏ తప్పూ చేయలేదంటారు. తేడావస్తే ముక్కు నేలకు రాస్తానంటారు. మాట తేడావస్తే మెడ నరుక్కుంటారు. చట్టసభని అపహాస్యం చేశారంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని సభనుంచి గెంటేస్తారు. ఎన్ని చేసినా బంగారు తెలంగాణ కోసమేననీ..ఈ గడ్డ రూపురేఖలు మార్చేందుకే తానీ అవతారమెత్తాననీ మాటలతో ఎవరినైనా నమ్మించగల ఘటనాఘట సమర్ధుడు కేసీఆర్. విపక్షాల విమర్శల్లో నిజముందేమోనని ఎవరయినా ఆలోచనలో పడేలోపే తన ప్రసంగ ప్రవాహంలో అవన్నీ కొట్టుకుపోయేలా చేయగల సమర్ధుడు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.
పారదర్శక పాలన అందిస్తున్నామనీ, గత ప్రభుత్వాల పాలనలా దళారులు లేరనీ, ప్రతీ రూపాయి ఖర్చులో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నామనేది కదిలిస్తే కేసీఆర్ చెప్పేమాట. కానీ కాగ్ కక్షకట్టిందో, లేకపోతే విపక్షం దాన్ని ఆవహించిందోగానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసింది. నిలబెట్టి కడిగేసింది. పనులు పూర్తి చేయకుండానే యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు. ద్రవ్యలోటుని తక్కువ చూపించేందుకు కేంద్ర నిధుల్ని దారి మళ్లించారు. మిషన్ కాకతీయ లక్ష్యాలు వాస్తవదూరంగా ఉన్నాయి. రాష్ట్రంలో 75శాతం స్కూళ్లలో సరైన సదుపాయాలు లేవంటూ కేసీఆర్‌కి కంటగింపులాంటి నివేదిక ఇచ్చింది కాగ్.

ప్రభుత్వ మాటలకు.. ఆచరణకు పొంతనేలేదని ఎండగట్టింది కాగ్ నివేదిక. 2016- 17లో తెలంగాణ సర్కారు 42,852 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. వ్యవసాయరంగానికిచ్చింది 5,775 కోట్లే. ఐటీ రంగానికి ఇచ్చిన భూముల్లో కనీస వసతుల్లేవు. గత ఐదేళ్లలో అసలు భూ కేటాయింపులే జరగలేదనేది కాగ్ ఆక్షేపణ. రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏఐబీపీ కింద చేర్చిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవటంతో ఆర్థిక భారం పెరిగింది. మిషన్ కాకతీయ రెండో దశ పనుల్లో 14 శాతం పురోగతి ఉంటే మూడో దశ పనుల్లో పురోగతే లేదని తేల్చిచెప్పేసింది కాగ్ నివేదిక. ప్రాధాన్యాంశాలు పక్కనపెట్టి అనవసర విషయాలకు తెలంగాణ సర్కారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని కాగ్ తప్పుపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, సర్కారు దవాఖానాల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పింది. చెప్పుకుంటూ పోతే ఏ రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వంపై కాగ్ సంతృప్తి వ్యక్తంచేయలేదు. మరి ఆల్ ఈజ్ వెల్ అంటున్న టీఆర్ఎస్ సర్కారు కాగ్ నివేదిక తప్పంటుందా? తప్పులు సరిదిద్దుకుంటుందా?

