సేమ్‌..షేమ్‌..సీబీఎస్ఈ స్కామ్‌!

0
565

మాట‌లు చెప్ప‌డం ఎంత తేలికో మోడీని చూస్తేనే తెలుస్తుంది. బీజేపీ అధికారంలోకి రాక‌ముందు, తాను ప్ర‌ధాని కాక‌ముందే ఎన్ని మాట‌లు చెప్ప‌లేదాయ‌న‌. ఆయ‌న మాట‌లు విని ఎలా ఉండాల్సిన దేశం ఇలా ఉండిపోయిందేంట‌ని కోట్ల గుండెలు బాధ‌ప‌డ్డాయి. మోడీలాంటి దార్శ‌నికుడికి, మ‌హానుభావుడికి అవకాశ‌మిస్తే ఐదేళ్లు తిరిగేస‌రికి ఇండియా కూడా అగ్ర‌రాజ్యం స‌ర‌స‌న చేరుతుంద‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాయి. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న న‌ల్ల‌డ‌బ్బుని మోడీ విమానాల్లో వేసుకొచ్చి త‌లాకొంత పంచేస్తార‌ని ఈ దేశం ఊహాల్లో తేలిపోయింది. నాలుగేళ్ల త‌ర్వాత చూసుకుంటే న‌ల్ల‌ధ‌నం మూట‌లురాలేదు…నీటిమూట‌ల్లాంటి మాట‌లు త‌ప్ప‌.

విదేశాల‌నుంచి న‌ల్ల‌ధ‌నం తీసుకురావ‌డం ఎలాగూ చేత‌కాలేదు. ఎన్నో ద‌శాబ్ధాలుగా సాఫీగా జ‌రుగుతున్న ప‌రీక్ష‌ల‌నైనా స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంలో విఫ‌ల‌మైంది మోడీ స‌ర్కారు. సీబీఎస్ఈ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీకేజీల‌తో మోడీ ప‌లుకుబ‌డి ఇంకాస్త ప‌ల‌చ‌బ‌డిపోయింది. దేశ‌వ్యాప్తంగా విద్యార్థిలోకం రోడ్డెక్కింది. మ‌ళ్లీ రెండు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణ‌యంపైనా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. పేప‌ర్ లీక‌యినాట్లు ముంద‌స్తు స‌మాచార‌మున్న దాన్ని దాచిపెట్టి మ‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, పిల్ల‌లు క‌ష్ట‌ప‌డి రాశాక ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎగ్జామ్ త‌ప్ప‌ద‌న‌డం…మోడీ పాల‌నా వైఫ‌ల్యాల‌కు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంలా నిలిచాయి.

పేపర్‌ లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. లీక్ అయిన పేప‌ర్ ఎవ‌రెవ‌రికి ఎలా అందిందో ఆరాతీస్తోంది. దోషుల్ని వ‌దిలిపెట్టేది లేదంటోంది కేంద్రం. ఎలాంటి లొసుగుల‌కూ తావులేకుండా ప‌క‌డ్బందీగా జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ను గాలికొదిలేసి ఇప్పుడేదో చేస్తామంటున్నారు. పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి జవదేకర్‌తో పాటు సీబీఎస్‌ఈ ఛైర్‌ పర్సన్ అనితా కర్వాల్‌ని పదవుల నుంచి తప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జోన్ల‌వారిగా ఉన్న ప‌రీక్ష‌ప‌త్రాల విధానాన్ని ఎందుకు మార్చాల్సి వ‌చ్చింద‌ని నిల‌దీస్తున్నారు ఒక‌ప్పుడు మాన‌వ వ‌న‌రుల శాఖ‌ను చూసిన క‌పిల్‌సిబాల్‌.

ఇంత జ‌రుగుతున్నా మోడీ నోట మాట‌లేదు. ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయంటే క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారిదాకా ఎక్క‌డైనా వాలిపోయి లోక‌ల్ గెట‌ప్‌లో ప్ర‌జ‌ల్ని మంత్రిముగ్ధుల్ని చేసేలా ప్ర‌సంగ‌పాటవాన్ని చాటుకునే ఘ‌న‌త వ‌హించిన ప్ర‌ధాని..ష‌రామామూలుగానే ఇలాంటి విష‌యాల్లో మౌన‌వ్ర‌తం పాటిస్తున్నారు. ఆయ‌నేదో ఆగ్ర‌హించార‌నీ, ఆవేద‌న చెందారంటూ నేత‌లు చెప్పుకొస్తున్నా..ల‌క్ష‌ల‌మంది విద్యార్థుల భ‌విష్య‌త్తుని గంద‌ర‌గోళంలో ప‌డేసిన పేప‌ర్ లీకేజీల‌కు నైతికంగా ప్ర‌ధాని కూడా బాధ్యుడే.