కామ్రేడ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌!

0
723

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు. మొన్న‌టిదాకా బీజేపీమీద అప్పుడ‌ప్పుడూ నాలుగు అక్షింత‌లేస్తూ టీడీపికి న‌మ్మ‌క‌స్తుడైన మిత్రుడిగా గుర్తింపు. కానీ జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సు త‌ర్వాత సీన్ మారిపోయింది. టీడీపీని ఉతికారేసి ఆ పార్టీకిక ఒక్క‌సారిగా బ‌ద్ద‌విరోధిగా మారిపోయారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ఇంకేముందీ…జ‌న‌సేనాని బీజేపీ రిమోట్ కంట్రోల్‌గా మారిపోయాడ‌నీ…వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌ల ఎజెండా ఒక్క‌టేన‌ని ప‌చ్చ‌దండు దండెత్తింది. పెద‌బాబునీ, చిన‌బాబునీ ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎత్తిపోసిన బుర‌ద ఎంత రుద్దినా వ‌ద‌ల‌డంలేదు. ఇదే టైంలో త‌న‌కో లెక్కుంద‌నీ…తిక్క ఉంద‌ని అనుకున్నా ఫ‌ర్లేద‌న్న‌ట్లే ఉంది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం.

బీజేపీతో బంధంలేదు. వైసీపీతో క‌లిసే ఆలోచ‌న లేద‌న్న‌ట్లు…ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయానికి స్టేజీ రెడీ చేస్తున్నారు ప‌వ‌న్‌. 2019ఎన్నికలో ఏపీ రాజకీయాల్లో కొత్తపొత్తులు ఖాయ‌మ‌నే సంకేతాలిస్తున్నాయి జ‌న‌సేనాని స‌మాలోచ‌న‌లు. 2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేనతో కలిసి వెళ్ళడానికి ఇప్పటికే వామపక్షాలు సిద్ధంగా ఉండ‌గా..పవన్ క‌ళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇటీవల అమరావతిలో లెఫ్ట్‌పార్టీలతో కలిసి పనిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం…ఆ తర్వాత లెఫ్ట్ పార్టీల నేతలతో మాటామంతీ జరిగిపోయాయ్. తాజాగా సీపీఎం, సీపీఐ ముఖ్య‌నేత‌ల‌తో జ‌న‌సేన అధ్య‌క్షుడి భేటీతో డీల్ దాదాపుగా ఓకే అయిన‌ట్లే ఉంది.

ఎన్నికల్లో పొత్తు అన్న అంశం త‌ప్ప మిగిలిన అన్ని విష‌యాలూ మాట్లాడుకున్నామంటున్నారు వామ‌ప‌క్షాల నేత‌లు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదాతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లుకు జ‌న‌సేన‌, సీపీఎం, సీపీఐ ఐక్య‌పోరాటానికి న‌డుంబిగించ‌బోతున్నాయి. పోరాటాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అంతా కలిసి పనిచేస్తామ‌ని సీపీఐ క్లారిటీ ఇచ్చింది. పోరాటాల విషయంలో క్లారిటీ వచ్చిందని, ఎన్నికల్లో పొత్తు గురించి స‌మ‌య‌మొచ్చిన‌ప్పుడు మాట్లాడతామంటోంది సీపీఎం. మరోవైపు లోక్‌సత్తా పార్టీ అధినేత జేపీని కూడా క‌లుపుకుని వెళ్లాల‌నేది ప్లాన్‌తో ఉన్నారు పవన్ క‌ళ్యాణ్‌. వామపక్షాలు, జనసేన, లోక్ సత్తా పార్టీలు కూట‌మిగా తెర‌పైకి వ‌స్తే…ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు ఖాయ‌మ‌నే చెప్పాలి.