ఆయనో బడా పారిశ్రామికవేత్త. ఎన్ని కోట్లు సంపాదించినా పార్లమెంట్ సభ్యుడిగా పెద్దల సభలోకి అడుగుపెట్టాలన్నది ఆయన చిరకాలవాంఛ. దానికోసం ఐదేళ్లు ఎదురుచూశారు. వైసీపీలో ఉన్నారు. తర్వాత టీడీపీ వైపు చూశారు. చివరికి విపక్షపార్టీ నుంచే ఆయన కల నెరవేరింది. రాజ్యసభకు ఎన్నికయ్యారు. అది కూడా ఏకగ్రీవంగా. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
ఊహించని రీతిలో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో మూడోస్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. వైఎస్ అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వీపీఆర్ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేవారు.
తర్వాత వైసీపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపటంతో కినుక వహించిన వేమిరెడ్డి కొన్నాళ్లు ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీకి దగ్గరయ్యారు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని ఆఫర్ ఇచ్చారు. అవసరమైతే మూడో స్థానానికి పోటీ చేస్తానని, ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తాననని చెప్పినా చంద్రబాబు భరోసా ఇవ్వలేదు. ముందు పార్టీలో చేరండి, తర్వాత చూద్దామని టీడీపీ అధినేత చెప్పటంతో మళ్లీ వైసీపీవైపు మొగ్గారు వేమిరెడ్డి.
టీడీపీలోకి ఎమ్మెల్యేల వలసలతో ఎలాంటి ప్రయోగాలకు ఆస్కారమివ్వకుండా, ఆర్థికంగా బలవంతుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవకాశమిచ్చింది వైసీపీ. ఎలాంటి సవాళ్లననైనా తట్టుకుని నిలబడతారన్న నమ్మకంతో వీపీఆర్‌ని పోటీకి నిలిపింది. అటు టీడీపీ మొదట మూడో అభ్యర్థి ఆలోచన చేసినా…మళ్లీ వెనక్కి తగ్గటంతో వేమిరెడ్డి లక్ష్యం నెరవేరింది. రాజ్యసభలో అడుగుపెట్టాలనే కోరిక చివరికి విపక్షపార్టీ ద్వారా నెరవేర్చుకున్నారాయన.

