మూగ‌జీవాలంటే పంచ‌ప్రాణాలు

మూగ‌జీవాలు కూడా బిష్ణోయ్‌తెగ‌కు క‌న్న‌బిడ్డ‌లే

0
665

బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేశారు. స‌ల్మాన్‌కి ఐదేళ్ల జైలుశిక్ష‌తో త‌మ ఇర‌వై ఏళ్ల పోరాటానికి ఫ‌లితం ద‌క్కింద‌ని సంతృప్తి చెందారు. డ‌బ్బుతో ఎవ‌రినైనా మేనేజ్ చేయ‌గ‌ల‌రేమోగానీ ప్ర‌కృతితో, మూగ‌జీవాల‌తో జీవితాలు పెన‌వేసుకున్న వారిని మాత్రం కాదు. స‌ల్మాన్‌కి జైలు శిక్ష‌తో ఇప్పుడంతా బిష్ణోయ్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. బిష్ణోయ్ జాతికి చెందిన వారు అహింసావాదులు. అడవి జంతువులను వేటాడటం, చంపటం వారి మత విశ్వాసాలకు వ్యతిరేకం. వీరు స్వతహాగా ప్రకృతి ప్రేమికులు. జంతువులను చంపడం, చెట్లను నరకడాన్ని వీరు ఏమాత్రం సహించరు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బిష్ణోయ్‌ వర్గాలు ఎక్కువగా కనిపిస్తారు.

బిష్ణోయ్‌ల‌ది ప్ర‌త్యేక మ‌తం కాదు. హిందూ మతంలోనే వీరూ ఓ భాగం. వీరి నియమాల ప్రకారం జంతు హింస జరుగుతుంటే ప్రాణాల‌కు తెగించ‌యినా అడ్డుకోవాలి. జంతువుల్ని కాపాడటం బిష్ణోయ్‌ వర్గాల ఆచారం. పక్షుల్ని, ఇతర జీవరాశుల్ని జాగ్ర‌త్త‌గా చూసుకుంటేనే పర్యావరణం బాగుంటుందని బిష్ణోయ్ వ‌ర్గం విశ్వాసం. ఇక కృష్ణజింకలైతే వారికి దైవ సమానం. త‌మ‌ ఆరాధ్యదైవానికి కృష్ణ‌జింక‌ల్ని ప్ర‌తిరూపాలుగా భావిస్తారు. జోధ్‌పూర్‌లో వీటికి ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసి వాటి బాగోగులను చూసుకుంటారు.

బిష్ణోయ్ వ‌ర్ణానికున్న 29నియమాల్లో దాదాపు అన్నీ జంతు సంరక్షణతో ముడిప‌డిన‌వే. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం భుజించరు. జీవితాంతం శాకాహారులుగానే ఉండాల‌న్న‌ది వీరి క‌ట్టుబాటు. పొరపాటున ఎవరైనా మాంసం తింటే బిష్ణోయ్‌ వర్గం నుంచి బహిష్కరిస్తారు. నియ‌మాల్ని ఎంత కఠినంగా పాటిస్తే బిష్ణోయ్‌ వర్గంపై వారికంత భక్తి ఉన్నట్లు లెక్క. ఇన్ని నియ‌మాలు, క‌ట్టుబాట్ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తారు కాబ‌ట్టే స‌ల్మాన్ విష‌యంలో రాజీప‌డ‌లేదు. కృష్ణ‌జింక‌ల ర‌క్తం క‌ళ్ల‌జూసిన స‌ల్మాన్‌కి శిక్ష ప‌డాల్సిందేన‌ని పంతంప‌ట్టారు. చివ‌రికి త‌మ న‌మ్మ‌కం ముందు వేట‌గాడు ఎంత పోటుగాడైనా నేల‌కూలాల్సిందేన‌ని నిరూపించారు.