వైసీపీది సెల్ఫ్‌గోలే..

0
675

చేత‌నైతే సాయంచేయాలి. లేదంటే మౌనంగానైనా ఉండాలి. ఎంతోకొంత ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారికి అడ్డంప‌డితే చూసేవాళ్ల‌కి చిర్రెత్తుకొస్తుంది. లాగిపెట్టి ఒక్క‌టి పీకాలనిపిస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి బడ్జెట్‌లో అన్యాయం జ‌రిగింద‌నీ…విభ‌జ‌న హామీల సంగ‌తేమ‌య్యింద‌నీ పార్ల‌మెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు చేప‌ట్టిన నిర‌స‌న‌ల విష‌యంలో వైసీపీ పాత్ర ఇప్పుడు విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. రాష్ట్రంలో రాజ‌కీయంగా రెండు పార్టీల మ‌ధ్య స‌వాల‌క్ష గొడ‌వ‌లుండొచ్చు. కానీ చ‌ట్ట‌స‌భ సాక్షిగా జ‌రుగుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల కోసం పోరాటం. ఈ లాజిక్‌ని ఎక్క‌డ మిస్స‌య్యిందోగానీ విప‌క్ష‌పార్టీ త‌ప్పుట‌డుగులు వేసిన‌ట్లే క‌నిపిస్తోంది.
బీజేపీతో పొత్తుపెట్టుకోవ‌డం, నాలుగేళ్ల‌పాటు గ‌ట్టిగా గొంతెత్త‌లేక‌పోవ‌డం టీడీపీ వైపునుంచి జ‌రిగిన పొర‌పాటే కావ‌చ్చు. కానీ ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని గుర్తించి…ఇంకా వేచిచూస్తే రాష్ట్ర న‌ష్ట‌పోతుంద‌ని గ్ర‌హించి స‌మ‌స్య తీవ్ర‌త‌ని కేంద్ర‌పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వైసీపీ కూడా మ‌ద్ద‌తిచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ప్ర‌తిప‌క్ష ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది కూడా ఆ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుంచే. లేదూ..ఏదో మైలేజి కోసం టీడీపీ ఇదంతా చేస్తుంద‌నుకున్న‌ప్పుడు త‌మ మానాన తాము మౌనంగా ఉన్నా స‌రిపోయేది. ఏపీకి అసలు ఏ అన్యాయ‌మూ జ‌ర‌గ‌నట్లు, టీడీపీ ఎంపీల వాద‌న‌లో న్యాయం లేన‌ట్లుగా మాట్లాడి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు వైసీపీ ఎంపీలు.
పార్ల‌మెంట్‌లో మాట్లాడే అవ‌కాశ‌మిచ్చిన‌ప్పుడు ఏపీ అవ‌స‌రాల్ని, ఆకాంక్ష‌ల్ని దేశ‌ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్లాల్సిన వైసీపీ ఎంపీలు..టీడీపీని దుమ్మెత్తి పోసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రం పోల‌వ‌రం క‌డ‌తాన‌ని చెప్పాక రాష్ట్రం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌న్న‌ట్లు మాట్లాడారు. టీడీపీ ఎంపీల వాద‌న‌ని తిప్పికొట్టేందుకు తామే కాసేపు బీజేపీ ఎంపీల్లా వ్య‌వ‌హ‌రించారు. ఇక రాజ్య‌స‌భ‌లో అయితే ఘ‌న‌త వ‌హించిన విజ‌య‌సాయిరెడ్డి వాద‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కేంద్ర‌మంత్రిగా ఉండి సుజ‌నాచౌద‌రి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎలా మాట్లాడతార‌న్న‌ది పొలిటిక‌ల్ ఆడిట‌ర్‌గారి లాజిక్‌. పైగా సుజ‌నాచౌద‌రిపై రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేస్తామనే హెచ్చ‌రిక‌లు.
రాజ‌కీయం ఏద‌న్నా ఉంటే రాష్ట్రంలో చూసుకోవాలేగానీ…ఏపీ ప‌రువుని పార్ల‌మెంట్ సాక్షిగా బ‌జారుకీడ్చిన‌ట్లు మాట్లాడి సాధించేదేంటి? రేప్పొద్దున బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంటే…ఆ స్థానాన్ని భ‌ర్తీచేయాల‌ని అంత కుతూహ‌లంగా ఉంటే దానికి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని ఫ‌ణంగా పెట్టాలా? అయినా ఇంత జ‌రిగాక బీజేపీతో అంట‌కాగితే జ‌నం తీర్పు ఎలా ఉంటుందో ఆ మాత్రం ఊహించ‌లేరా?