భోగాపురం విమానాశ్రయానికి ‘దారేది’?…

0
15


ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక పరుగులు పెడుతుందని, దానికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా నిలువబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢంకా బజాయించి చెప్పారు.. ఆగస్టు నెలలో ఎంతో అట్టహాసంగా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చి వేయబోతోందని విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నొక్కి వక్కాణించారు.. ప్రధాని నరేంద్ర మోదీని ఏకంగా అల్లూరి సీతారామరాజు తో పోల్చి మరో అడుగు ముందుకు వేశారు. ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. దార్శనికత ఉన్న నేత చంద్రబాబు నాయుడూ జీ నేత్రుత్వంలో రాష్ట్రం అభివృద్ధి తో పరుగులు పెడుతుందని, డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే ఇది సాధ్యమవుతున్నదని ప్రధాని కితాబిచ్చారు.. ఆగస్టు పదహారు నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం అవుతాయని, వాణిజ్య సర్వీసులు మొదలయ్యాక ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుందని అందరూ భావించారు.. ఇదే అదనుగా ఇప్పటి దాకా సేవలు అందించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సేవల్ని నిలిపివేశారు.. ఇక్కడే అసలు సమస్యలు మొదలయ్యాయి.. ఒక పక్క ఇక్కడి సేవలు బందు అయిపోయి, మరోవైపు భోగాపురం విమానాశ్రయం చేరేందుకు వ్యయ ప్రయాసలు మొదలయ్యాయి.. కనీసం కొన్నాళ్లయినా విశాఖపట్నం విమానాశ్రయం సేవలు కొనసాగించాలని రాజకీయ నాయకులు మొదలు సామాన్య ప్రయాణీకుల వరకు మొరపెట్టుకున్నారు.. కనీసం డొమెస్టిక్ సర్వీసులు అయినా కొనసాగించాలని వేడుకున్నారు.. అవి ఫలించలేదు.. విమానాశ్రయం తూర్పు నానికాదళం ఆధీనంలోకి వెళ్ళిపోయింది.. అంతటితో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర విమాన ప్రయాణీకులకు సేవలు అందించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం శకం ముగిసినట్టయింది.. దీంతో విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల విమాన ప్రయాణీకులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే తప్పనిసరిగా ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకోవడానికి మరీ అంత ఇబ్బందులు లేకపోవచ్చు.. ఎటొచ్చీ విశాఖపట్నం, గాజువాక ప్రాంతాల ప్రయాణీకులకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి..

దూరాభారం తడిసి మోపెడు ..

గాజువాక నుంచి దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటలు పడుతుంది.. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ.. పైగా అనేక కూడళ్లలో సిగ్నల్స్ కూడా ఎక్కువే.. గాజువాక నుంచి విశాఖపట్నం సిటీ చేరుకోవడానికే గంటకు పైగా సమయం పడుతుంది.. ఇక విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం చేసుకోవడాని ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా వున్న సమయంలో అయితే చుక్కలు కనిపిస్తాయి. ఈ అవరోధాలన్నీ దాటుకుని గమ్యం చేరేటప్పటికి తాము ప్రయాణించాల్సిన విమానాలు కొన్నిసార్లు మిస్ అయిపోతున్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు.. జాతీయ రహదారిపై కాకుండా, జ్ఞానాపురం మీదుగా బీచ్ గుండా ప్రయాణం చేస్తే ట్రాఫిక్ సమస్యలు తక్కువగా వుంటున్నాయంటున్నారు.. అటువైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వ్యయప్రయాసల కోర్చి చచ్చీ చెడీ విమానాశ్రయం చేరకున్నప్పటికీ, చాలా సందర్భాల్లో ఎక్కాల్సిన విమానాలు టేకాఫ్ అవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.. ఉద్యోగాల్లో చేరడానికో, పెళ్లిళ్ల వంటి శుభముహూర్తాలకు హాజరు కావడానికో వెళ్తున్న వాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు.. ఇక విదేశాలకు వెళ్ళేవాళ్ళ పరిస్థితి మరింత దారుణం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం విమానయాన సర్వీసుల వాళ్ళు కనీస ప్రయత్నాలు చేయడం లేదని ప్రయాణీకులు వాపోతున్నారు.. ఇదంతా ఒక ఎత్తయితే, విశాఖపట్నం, గాజువాక ప్రాంతాల నుంచి క్యాబులు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించాలంటే రెండువేల నుంచి మూడు వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు.. ప్రైవేటు వాహనాలు, ఆటోలు భోగాపురం విమానాశ్రయం లోపలికి వెళ్లాలంటే 250 రూపాయల కనీస పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు.. మొన్నామధ్య ఒక ప్రైవేటు ట్యాక్సీ డ్రైవర్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను దించి, తిరుగు ప్రయాణం ప్రయాణీకుల కోసం కొంత సేపు వేచివున్నందుకు 650 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేశారట.. తనకు బాడుగ రూపేణా వచ్చిందే ఎనిమిది వందలు అయితే అంతా మీకే ఇస్తే ఎలాగని వాదనకు దిగడం, సెక్యూరిటీ సిబ్బంది ముక్కుపిండి వసూలు చేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది..

మెట్రోరైలు వస్తేనే కాస్తంత ఊరట !

ఎంతో అట్టహాసంగా, ఎన్నో ఆశలతో ప్రారంభించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నెలలు తిరక్కముందే ఒక వైపు ప్రయాణీకులకు, మరోవైపు ప్రైవేటు వాహనాలు నడిపేవారికి చుక్కలు చూపిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. విమానాశ్రయం నిర్వహణ బాధ్యత మొత్తం జీఎమ్మార్ సంస్థకే అప్పగించడం వల్ల వాళ్ళు చెప్పిందే శాసనం, చేసిందే వాస్తవం అన్నట్టు ఉంది వ్యవహారం.. విమాన ప్రయాణీకుల కష్టాలు తీర్చడానికి అన్నట్టు, ఆర్టీసీ 20 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టింది.. కొన్ని ఎంపిక చేసిన చోట్ల ప్రయాణీకులకు లాంజ్ లు ఏర్పాటు చేసింది.. నిర్ణీత సమయాల్లో నడిచే ఈ బస్సులు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి..కొన్ని సర్వీసులు జాతీయ రహదారిపై ప్రయాణం సాగిస్తుండగా, మరికొన్ని సర్వీసులు బీచ్ గుండా రామానాయుడు స్టూడియో మార్గంలో నడుపుతున్నారు.. కానీ ట్రాఫిక్ సమస్యలకు ఈ బస్సులు కూడా అతీతమేమీ కావు.. దీంతో కొన్నిసార్లు విమాన సమయాలకు ప్రయాణీకులను గమ్య స్థానం చేర్చడం వీరికి సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.. అందుకే ఎక్కువ మంది ప్రయివేటు వాహనాలనే ఎంచుకోవాల్సి వస్తోంది.. కనుక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెట్రోరైలు పధకం పూర్తి అయితేనే కష్టాలు గట్టెక్కే అవకాశం ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.. ఇదే విషయాన్ని భీమునిపట్నం శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లారు.. ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైన మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.. మొదట రెండు దశల్లో మెట్రోరైలు పనులు పూర్తి చేయాలని నివేదిక లో పేర్కొన్నారు.. దానిప్రకారం స్టీలు ప్లాంటు గేటునుంచి గాజువాక మీదుగా గురుద్వారా వరకు ఒక దశ, అక్కడ నుంచి మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది వరకు రెండో దశ గా నిర్ణయించారు.. అయితే ఇప్పుడు దీని నిడివిని తగ్గించి నట్లు తెలుస్తోంది.. అదే జరిగితే కనీసం కొమ్మాది వరకైనా మెట్రోరైలు వచ్చే వీలుండదు.. హనుమంతవాక నుంచి కొమ్మాది వరకు పైవంతెన (ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి) నిర్మిస్తే సరిపోతుందని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇదే జరిగితే ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ మార్గంలో పైవంతెన పనులు జరిగినంత కాలం ప్రయాణీకులు నరకం అనుభవించాల్సిందే..

హైకోర్టు మొట్టికాయలు వేసే దాకా..

గాజువాక, విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఒకటి నమోదు అయింది.. దీనికి సంబంధించిన వాదనల సందర్భoగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ముందస్తు ప్రణాళిక లేకుండా విమానాశ్రయం ఎలా ప్రారంభించారు? విమాన ప్రయాణీకులకు సరిపడా రవాణా సౌకర్యాలు కల్పించాలని తెలీదా? దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ని ఆదేశించింది ధర్మాసనం.. ప్రస్తుతం 20 విద్యుత్ బస్సులను నడుపుతున్నామని, త్వరలో మరికొన్ని బస్సులను ప్రవేశ పెడతామని శ్రీనివాస్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.. విమాన ప్రయాణీకుల ఇక్కట్ల గురించి మాజీ ఐఆర్ఎస్ అధికారి ఎం. రామారావు హైకోర్టులో పిల్ వేశారు.. దానిపైన విచారణ జరుతున్న సందర్భాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే రహదారుల నిర్మాణం పూర్తి కాలేదని, ఫలితంగా ప్రైవేటు టాక్సీ లు,క్యాబులు ప్రయాణీకుల నుంచి డబ్బు దోచేస్తున్నాయాని పిటీషనర్ తన పిల్ లో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఏ జీ శ్రీనివాస్ కలుగ చేసుకుని, ఆర్టీసీ20 విద్యుత్ బస్సులు నడుపుతోందని తెలిపారు.. రోజుకి వేలల్లో ప్రయాణీకులను విమానాశ్రయానికి చేర్చడానికి 20 బస్సులు ఏమాత్రం సరిపోతాయని న్యాయ మూర్తి ప్రశ్నించారు.. అంతకు ముందు విశాఖపట్నం పాత విమానాశ్రయం వాణిజ్య విమానాల నిలిపి వేతను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు లో మరో కేసు నమోదు అయింది.. కొసరాజు కృష్ణంరాజు అనే వ్యాపార వేత్త ఈ కేసు నమోదు చేశారు.. దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కనీసం వాణిజ్య విమాన సర్వీసులు నడపాలని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సేవలు ప్రారంభించే దాకా పాత విమానాశ్రయాన్ని కొనసాగించాలని రాజు తన నివేదికలో అభ్యర్ధించారు..కేసులో సహేతుకత ఉన్నప్పటికీ, ఈ విషయం తమ పరిధి (జ్యూరీడిక్షన్)లో లేదని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో తేల్చుకోవాలని ఢిల్లీ హైకోర్టు పిటీషనర్ కృష్ణంరాజుకు సూచించింది.. విమాన ప్రయాణీకుల కష్టాలు, ముఖ్యంగా రవాణాకు సంబంధించి ఇంకెన్ని కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి..!

కొసమెరుపు : కొండ నాలుక్కి మందేస్తే ఉండ నాలుక పోయిందనేది పాత సామెత.. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయక ముందే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం హడావుడిగా ప్రారంభించేశారు..పోనీ ప్రధాని ఒప్పుకున్నారు కనుక చేసేసారు అనుకుందాం.. కొత్త విమానాశ్రయానికి అన్ని మౌలిక వసతులు కల్పించేదాకా విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొనసాగిస్తే బావుండేది కదా !అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ..ఈ రచ్చ మరింత ముదరక ముందే మేల్కొంటే సరిపోతుంది అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here