

వృత్తి వైద్యం.. ప్రవృత్తి ప్రజాసేవ.. ఇచ్చాపురం గడ్డపై చెరగని ముద్ర..
- తండ్రి బాలయ్య బాటలోనే తనయుడి సేవా ప్రస్థానం.. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉలాల ఫ్యామిలీ
- ఉద్దానం కిడ్నీ వ్యాధి నుంచి వంశధార జలాల వరకు.. జగన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన డాక్టర్
- పారిశ్రామికీకరణతోనే ఇచ్చాపురం అభివృద్ధి.. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహం
- గుప్తదానాలతో దేవాలయాల అభివృద్ధి.. పర్వదినాల్లో అన్నదానాలతో అందరివాడిగా
నవతరం, ఇచ్చాపురం: రాజకీయ విలువలకు కట్టుబడిన కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ ఉలాల కోదండరామ్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురంలో ఆయన నివాసానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కార్మిక, కర్షక, పలు యువజన సంఘాల ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ వద్ద, ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి వైద్యం.. ప్రవృత్తి ప్రజాసేవ అన్న నానుడికి నిదర్శనంగా నిలుస్తూ ఇచ్చాపురం గడ్డపై తనదైన ముద్ర వేస్తున్న ఆయన ప్రస్థానం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు కొనియాడారు.
ఇచ్చాపురం రాజకీయ చరిత్రలో ఉలాల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇచ్చాపురం ప్రాంత యాదవ సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పలుమార్లు బాధ్యతలు నిర్వహించి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల మనిషిగా, పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న ఉలాల బాలయ్య యాదవ్ పెద్ద కుమారుడే డాక్టర్ ఉలాల కోదండరామ్. సేవా గుణం, రాజకీయ విలువలు, ప్రజల పట్ల నిబద్ధత ఆయనకు తండ్రి నుంచే వారసత్వంగా అబ్బాయి. బాలయ్య యాదవ్ కు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే ఎనలేని అభిమానం, అనుబంధం, విధేయత. ఆ అభిమానంతోనే తన పెద్ద కుమారుడిని వైద్య విద్య వైపు ప్రోత్సహించి, డాక్టర్ చదివించేందుకు ఎంతో చేయూతనందించారు. వైద్య వృత్తిలో ఉంటూనే స్థానిక ప్రజలకు సామాజిక సేవ చేయాలన్న గొప్ప ఆశయాన్ని బాలయ్య కలిగి ఉన్నారు. తండ్రి ఆ ఆశయాన్ని నెరవేరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా డాక్టర్ కోదండరామ్ ముందుకు సాగుతున్నారు. తండ్రి చూపిన బాటలోనే ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ఆయన అందరి మన్ననలు పొందుతున్నారు.
విశాఖపట్నం కింగ్ జార్జి హాస్పిటల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలు అందించిన అనుభవం ఉన్న డాక్టర్ కోదండరామ్, తండ్రి మాట జవ దాటకుండా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఇచ్చాపురంలో మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ ద్వారా నిత్యం వైద్య సేవలు అందిస్తూ ఉద్దానం ప్రాంత ప్రజలతో మమేకమయ్యారు. ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆయన అందిస్తున్న సేవలు, అవగాహన కార్యక్రమాలు, ఉచిత మందుల పంపిణీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని సేవలను సైతం తన నర్సింగ్ హోమ్ లో తక్కువ ఖర్చుతో, నిరుపేదలకు ఉచితంగా అందిస్తూ ప్రజా వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకపక్క నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూనే, మరోపక్క వినాయక చవితి, విజయదశమి, ఉగాది, సంక్రాంతి వంటి పర్వదినాలతో పాటు ముఖ్యమైన రోజుల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు భారీ మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి వాడిగా రాణిస్తున్నారు. అంతేకాకుండా పలు దేవాలయాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రచారం లేకుండా గుప్తదానాలు చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తండ్రి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వివిధ ప్రజా సమస్యల పట్ల సామాజిక స్పృహ కలిగి, ఆ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ఆయనకు పరిపాటి. ఇచ్చాపురంలో ఎక్కడ సమస్య ఉన్నా ముందుగా స్పందించే వ్యక్తిగా ఆయనకు పేరుంది.
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందుగా ఇచ్చాపురం కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే స్పష్టమైన విజన్ తో డాక్టర్ కోదండరామ్ ముందుకు వెళ్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే సాగునీటి వనరులు సమకూర్చుకోవడం కీలకమని, అందుకోసం వంశధార జలాలను ఇచ్చాపురం చివరి ప్రాంతానికి తరలించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, అలాగే మహేంద్రతనయ, బహుదా నదీ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు నిర్మించాలని, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తేనే వలసలు ఆగుతాయని, స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని ఆయన నమ్మకం. రైతులు, కార్మికులు, యువత అందరి అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా ఆయనకు విశేష ఆదరణ ఉంది.
నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర సమయంలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య అయిన ఉద్దానం కిడ్నీ వ్యాధి మహమ్మారి గురించి, సాగునీటి కొరత గురించి జగన్ దృష్టికి తీసుకువెళ్లి, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ కోదండరామ్ కావడం గమనార్హం. అందుకే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఆయనను ప్రత్యేకంగా గుర్తిస్తోంది. వైఎస్ కుటుంబం పట్ల ఆయనకున్న విధేయత, నిబద్ధతకు నిదర్శనం ఇది.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా తన సతీమణిని ఎన్నికల బరిలోకి దించే ఆలోచనలో ఉలాల కుటుంబం ఉంది. ఇచ్చాపురం మున్సిపాలిటీని పారిశ్రామికీకరణ దిశగా తీసుకువెళ్లి, వలసలను నిరోధించి, స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తూ, మండలాల వారీగా ప్రజల్లోకి వెళ్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎంతో సామాజిక స్పృహ కలిగిన డాక్టర్ కోదండరామ్ కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఆశీస్సులు ఉండటంతో పాటు స్థానిక ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి, వైద్యుడిగా చేస్తున్న విశేష సేవలు, యాదవ సామాజిక వర్గంలో ఉన్న బలమైన పట్టు, యువజన, కార్మిక, కర్షక సంఘాల మద్దతు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉలాల కుటుంబానికి కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైద్యుడిగా, సేవకుడిగా, రాజకీయ వారసుడిగా ఆయన సాగిస్తున్న ఈ త్రిముఖ ప్రస్థానానికి నేటి పుట్టినరోజు వేడుకలు మరో మైలురాయిగా నిలవనున్నాయి.

