చ‌ర్చదాకా వ‌స్తే ర‌చ్చ‌ర‌చ్చే!

0
661

మొద‌ట్లో టీడీపీ, వైసీపీనే. కానీ తర్వాత కాంగ్రెస్, సీపీఎం అవిశ్వాస తీర్మాన నోటీసులివ్వ‌టంతో చ‌ర్చ అనివార్య‌మ‌య్యేలా ఉంది. ఒక‌వేళ అదే జ‌రిగితే కొంప మునుగుతుంద‌ని భ‌య‌ప‌డుతోంది. అవిశ్వాసం నుంచి అల‌వోక‌గా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగేంత సంఖ్యాబ‌లం బీజేపీకున్నా చ‌ర్చ జ‌రిగితే ర‌చ్చ‌ర‌చ్చ‌వుతుంద‌ని కేంద్ర‌పెద్ద‌లు భ‌య‌ప‌డుతున్నారు. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చంటూ జరిగితే ఎన్నో స‌మ‌స్య‌ల్ని, అంశాల్ని ప్రధాన పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ని ముంచి, దావోస్‌లో ప్ర‌ధానితో ద‌ర్జాగా గ్రూప్ ఫొటో దిగిన నీర‌వ్‌మోడీ స్కామ్ క‌చ్చితంగా చ‌ర్చ‌కొస్తుంది. ఇప్ప‌టికీ వెంటాడుతున్న నోట్ల ర‌ద్దు క‌ష్టాల‌పై విప‌క్షాలు కేంద్రాన్ని నిల‌దీస్తాయి. తాజాగా సీబీఎస్‌ఈ పేపర్ల లీకేజీతో ల‌క్ష‌ల‌మంది విద్యార్థులు రోడ్డెక్కిన ప‌రిస్థితి ఎందుకొచ్చిందో కేంద్రం జ‌వాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవికాకుండా సొంత‌పార్టీలోనే కొంద‌రు నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్రిపుర‌లో అగ్ర‌నేత అద్వానీకి జ‌రిగిన అవ‌మానంతో పార్టీనేత‌లే మోడీపై ర‌గిలిపోతున్నారు. వీట‌న్నిటినీ మించి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో దీని ప్ర‌భావం ప‌డుతుంద‌నే టెన్ష‌న్ వెంటాడుతోంది.

లోక్‌సభలో ఎన్డీఏకి దాదాపు 300 మంది సభ్యుల మద్దతు ఉంది. ఓటింగ్ జ‌రిగినా ప్ర‌భుత్వం కుప్ప‌కూలుతుంద‌ని భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు. కానీ మోడీషాల ఒంటెద్దు పోక‌డ‌ల‌పై పార్టీ ఎంపీలే ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే ఏద‌యితే అద‌య్యింద‌ని ఎవ‌ర‌యినా తెగ‌బ‌డితే అడ్డంగా దొరికిపోతామ‌ని కేంద్ర పెద్ద‌లు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. మోడీ తీరుపై ఆగ్రహంతో ఉన్న పార్టీ సీనియర్ నేతలు శతృఘ్నసిన్హా, అరుణ్‌శౌరి, జశ్వంత్ సింగ్‌లాంటి నేతలు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపారు. అందుకే చ‌ర్చ పెట్టి ర‌చ్చ చేసుకునేకంటే…వీలైనంత‌వ‌ర‌కు స‌భ ఆర్డ‌ర్‌లో లేకుండా చూసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించే అవ‌కాశాలే ఎక్కువ క‌నిపిస్తున్నాయి.