
అధికారులు తక్షణం అడ్డుకోవాలి…
టిడిపి రాష్ట్ర రైతు కార్యదర్శి ఆకుల రామకృష్ణ…
నవతరం, రావులపాలెం; జిల్లాలో గడువు ముగిసినా కొన్ని ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, అధికారులు తక్షణమే అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆకుల రామకృష్ణ విలేకరుల ఏర్పాటు చేసి ఈ మేరకు డిమాండ్ చేశారు. గడువు ముగిసిన ఇసుక ర్యాంపులలో అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని, అనధికారికంగా జరిపిన తవ్వకాల కారణంగా ఇసుక కాంటాక్ట్ దారుల ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక కు నేడు అధిక ధరకు అమ్ముకుని ప్రజలను పేదరికంలో కి నెట్టు తున్నారన్నారు. గృహ నిర్మాణాలు చేసుకోలేక ప్రజలు అవస్థలకు గురి కావలసి వస్తుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ యంత్రాంగం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లు, మైనింగ్ అధికారులు, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు. గడువు ముగిసిన ఇసుక ర్యాంపుల్లో అవధులు మించి పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో అక్రమంగా ఇసుక తవ్వకాలను చేస్తున్నా చోద్యం చూస్తున్నారని ఆయన ఆరోపించారు.అధికారులు తక్షణం స్పందించి దాదాపుగా గత 28 రోజుల నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను స్వాధీనం చేసుకోవాలని వారిని న్యాయస్థానంలో నిలబెట్టాలని భారీ పెనాల్టీలు వేసి ఇసుక అక్రమ తవ్వకాలు మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేవలం రెండు టన్నులు అధికంగా ఉండడం వల్ల ఓవర్ లోడ్ కారణంగా లారీ యజమానులను భారీ జరిమానాలు విధించే అధికారులు, ఇసుక రీచ్ల నందు వెబ్రిడ్జ్ పెట్టకుండా, సీసీ కెమెరాలు అమర్చి కుండా, జీయో కోఆర్డినేట్ దగ్గర జెండాలు పాత కుండా మూడు మీటర్లు దాటి ఆరు నుంచి పది మీటర్ల లోతు తవ్వుతున్న రీచ్ నిర్వాహకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై లారీ యజమానుల సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై కోర్టు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపేట నియోజక వర్గం తెలుగు రైతు అధ్యక్షులు జక్కంపూడి వెంకటస్వామి, రావులపాలెం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గుత్తుల రాంబాబు, నియోజకవర్గ వాణిజ్య సెల్ ప్రెసిడెంట్ వెలగల శ్రీనివాస్ రెడ్డి, రావులపాలెం టిడిపి టౌన్ ప్రెసిడెంట్ పడాల కొండారెడ్డి, పెద్దిరెడ్డి శ్రీను,సాధనాలు సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

