ఖాజీపల్లిలో కబ్జాల జోరు…

0
296

వెన్నంటి ప్రోత్సాహిస్తున్న సత్యనారాయణ..

కొందరు వార్డు మెంబర్లూ ఇందులో సూత్రదారులు…

రెండు కోట్ల రూపాయలు దండుకున్న కబ్జాదారులు…

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న జిన్నారం ఎమ్మార్వో…

తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్..

ఈ భూకబ్జాల్లో ఎమ్మార్వో కూ వాటా వుందంటున్న స్థానికులు…

వాటా లేకపోతే మౌనంగా ఎందుకుంటున్నట్టు…

• సర్వే నంబర్ 181 లో ఏం జరుగుతుంది..?
• పట్టపగలే నిర్మాణాలు చేపడుతుంటే అధికారులకు పట్టడం లేదా?

• పాక్షిక కూల్చివేతలేనా కేసులేమైనా నమోదు చేశారా? • 515 పట్టాలుంటే 1500 ఇండ్లు ఎట్లా వెలిశాయి? • అందినకాడికి దండుకుంటున్న ఖాజీపల్లి సర్పంచ్..? • ఆర్డీవో కల్పించుకుని, ప్రభుత్వ భూమిని కాపాడాలి… • లేదంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామంటున్న …సామాజిక కార్యకర్తలు…


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో రోజు రోజుకూ ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. ఓ వైపు తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములు మాయం చేస్తుంటే.. మరోవైపు నకిలీ పట్టాలు సృష్టించి పట్టపగలే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. జిన్నారం మండల పరిధిలోని ఖాజీపల్లి సర్వే నంబర్ 181 లో వెలసిన ఓ బస్తీలో పట్టపగలే అక్రమనిర్మాణాలు చేపట్టి కొన్ని కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. సుమారు అయిదు వందల పట్టాలతో ప్రారంభమైన నిర్మాణాల వ్యవహారం ఏకంగా పదిహేను వందల ప్లాట్లు, అందులో నిర్మాణాలు జరిగేలా తయారయ్యిందిఇక్కడి కబ్జాల విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గతంలో ఖాళీ స్థలాల్లో రెవెన్యూ సూచిక బోర్డులు పాతారు. కానీ అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇక్కడి ఆక్రమణల్లో ఎవరి పాత్ర వుంది, వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారు, ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు, కరెంటు మీటర్లు ఎలా వస్తున్నాయి, స్థానిక సర్పంచ్ ఏం చేస్తున్నారు. అనే అంశాలతో ‘నవతరం’ ప్రత్యేక కథనం..

జిన్నారం / సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఖాజీపల్లి సర్వే నంబర్ 181 లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి, ఆ ఖాళీ ప్లాట్ లకు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని అమ్ముకుంటూ, ఆ నకిలీ పట్టాలకు తోడుగా మూడు, నాలుగు లింకు డాకుమెంట్లు తయారు చేసి, లక్షల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కబ్జాదారులు. గతంలో ఈ కాలనీకి సుమారు అయిదు వందల పట్టాలు మంజూరయ్యాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ పట్టాలు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని అమాయక ప్రజలకు కట్టబెడుతూ.. ఒక్కో ప్లాట్ ను లక్షల్లో అమ్ముకుంటూ లక్షలు దండుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాట్ ను నలుగురికి అమ్ముకుంటూ, వివాదాలు సృష్టిస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ కూడా లక్షల్లో డబ్బులు దండుకుంటూ ఎంతో మందికి సున్నం పూశారు. కొందరు అవినీతి అధికారులను అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారు కొందరు స్థానికంగా ఉండే ఛోటా, గల్లీ లీడర్లు. గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి భూకబ్జా కథలపై స్పందించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అక్రమ నిర్మాణాలను నిలువరించలేకపోయారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, ప్రభుత్వ భూములలో అక్రమంగా ప్లాట్ లు తయారు చేస్తూ ఒక్కో ప్లాట్ ను ఎనిమిది లక్షల నుండి పదమూడు లక్షల రూపాయలకు అమ్ముకుంటూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిన్నారం మండల రెవెన్యూ అధికారులకు మాత్రం చలనం రావటం లేదు. యాదేచ్చగా ప్రభుత్వ భూములు ఆక్రమించి, నకిలీ పట్టాలతో ఆక్రమణలకు పాల్పడుతున్నా తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తూ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటూ మండిపడుతున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. మండల పరిధిలో కొన్ని ఎకరాల్లో ప్రభుత్వ భూములు మాయమౌతున్నా ఏమీ తెలియనట్టు, తమకేమీ సంబంధం లేనట్టు, ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించని రెవెన్యూ అధికారులు ఉన్నా లేనికిందికే అంటున్నారు మండల ప్రజలు. ఖాజీ పల్లి లోని సర్వే నెంబర్ 181 భూములు అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా, గ్రేటర్ హైదరాబాద్ కు దగ్గరలో ఉండటంతో ఇక్కడి కొందరు దళారులకు అవకాశంగా మారింది. దీనికి తోడు ఎలాంటి చలనం లేని రెవెన్యూ అధికారులు.. అడ్డుకునేవారు లేక తమ సొంత భూములుగా భావిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే వున్న ఈ కాలనీలో అక్రమంగా వెలసిన నిర్మాణాలకు వత్తాసు పలుకుతూ ఇష్టానుసారంగా ఇంటి నెంబర్, నల్లా కనెక్షన్, కరెంటు కనెక్షన్లు ఇస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా కబ్జాదారులకు సహకరిస్తున్నారు ఇక్కడి రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, కార్యదర్శులు. వీరికి తోడు అవినీతి అంధకారంలో కూరుకుపోయిన అధికారుల సహకారం. ఇప్పటికే సుమారు వెయ్యి ప్లాట్ లు కబ్జా చేసిన కబ్జాకోరులు కోట్లల్లో దండుకున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, అందులో ప్లాట్లు చేసి, అనధికారికంగా లక్షలు, కోట్లు దండుకుంటున్న ఈ ముఠాపై కేసులు ల్యాండ్ గ్రాబ్బింగ్ కేసులు నమోదు చేసి, ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



అన్నీ తానై నడిపిస్తున్న సత్యనారాయణ
ఖాజీపల్లి సర్వే నంబర్ 181 లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు అన్నింటినీ వెనుకుండి, అన్నీ తానై నడిపిస్తున్నారు ఇక్కడి గల్లీ లీడర్ సత్యనారాయణ. 181 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూముల ఆక్రమనల్లో, అమ్మకాల్లో ఆయన హస్తముందనే విమర్శలు చాలానే ఉన్నాయి. ఎవరైనా ఈ కబ్జాలపై ప్రశ్నిస్తే.. నేను వేరేవారి వద్ద ఈ ప్లాట్ కొనుక్కున్నాను, నాకు సంబందించిన మిత్రులు కూడా వేరేవారి వద్ద ప్లాట్ లు కొనుక్కున్నారంటూ నకిలీ పట్టాలు, నోటరీ పత్రాలు చూపిస్తూ, ఇంకా కావాలంటే లింకు డాక్యుమెంట్లు సైతం రెడీ గా ఉంచుకుని మరీ చూపిస్తారు. ఎవరైనా ఈ భూకబ్జాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తే.. వీలైతే బెదిరింపులకు పాల్పడతారు లేకుంటే డబ్బుల ఆశ చూపిస్తారంటూ స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా కొందరు వార్డు మెంబర్లు, అవినీతి అధికారులను అడ్డం పెట్టుకుని, ఆక్రమణలు చేయటంలో ఆరితేరారు. తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తూ పరోక్షంగా భూకబ్జాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులకు వీరికి చాలా బాగానే దోస్తానా కుదిరిందంటూ సెటైర్లేసుకుంటున్నారు ఇక్కడి జనం. వేచి చూడాలి ఈ భూకబ్జాలపై ఎలాంటి చర్యలుంటాయో..

వాస్తవాలేమన్నా ఉంటే చర్యలు తీసుకోండి: సత్యనారాయణ, ఖాజీపల్లి గ్రామ సర్పంచ్
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఖాజీపల్లి సర్వే 181 లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై స్థానిక సర్పంచ్ సత్యనారాయణ స్పందించారు. ‘నవతరం’ విలేకరితో ఆయన మాట్లాడుతూ నేను ఒకటి, రెండు ప్లాట్ లు మాత్రమే కొనుక్కున్నాను. కానీ ఇక్కడి కబ్జాలు, నకిలీ పట్టాలతో నాకు సంబంధం లేదు. నేను సర్పంచ్ కాకముందే కొన్ని ఆక్రమణలు జరిగాయి. గత నాలుగు సంవత్సరాలుగా మాత్రం ఇక్కడ నా తరపు నుండి ఏ రకమైన ఆక్రమణలు గానీ, అక్రమ నిర్మాణాలు గానీ జరగలేదు. వార్తలు రాసుకోండి కానీ, నిజాలు వెలికి తీయండి. నా తరపు నుండి ఏమైనా తప్పులుంటే నేను బాద్యత వహిస్తానంటూ సమాధానమిచ్చారు. వేచి చూడాలి, గతంలో ఏం జరిగింది, ఎవరెవరు ఇక్కడి ఆక్రమనల్లో భాగస్వాములుగా ఉన్నారనే విషయంపై ‘నవతరం నిఘా టీం’ మరిన్ని ఆధారాల కోసం అన్వేషణలో నిమగ్నమై వున్నది.