పదేపదే అడిగితే రేపుమాపంటూ వాయిదాలు వేసి అప్పాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని మోడీకి హఠాత్తుగా ఏపీమీద ప్రేమ పుట్టుకొచ్చింది. అడక్కుండానే ఆంధ్రాకొస్తా…రిబ్బన్ కత్తిరిస్తానంటున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీల నిరససలు పార్లమెంట్‌ని కుదిపేశాయి. నిర్దిష్టమైన హామీలిచ్చి సాయం చేయకపోతే మార్చి 5నుంచి తాడోపేడో అంటోంది టీడీపీ. కాకిలెక్కలు చెబుతూ పుండుమీద కారంచల్లుతున్న కేంద్రంనుంచి ఏపీ సర్కారుకు అనుకోని వర్తమానం అందింది. ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కి రావాలనుకుంటున్నారని పీఎంవో చెప్పటంతో అందరికీ అమరావతి శంకుస్థాపన రోజున మట్టిముంత, నీళ్లబాటిల్ గుర్తుకొస్తున్నాయి.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పెరుగుతోందనుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తుండటం ఊహించని పరిణామమే. అది కూడా పీఎంవో వైపునుంచే ఈ ప్రతిపాదన రావటంతో తెగేదాకా లాగొద్దనే అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ప్రధాని వస్తే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే మార్చి 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశముందని ఓ అంచనా.

ప్రధాని వస్తాననగానే రండిరండి దయచేయండంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనతో ఉంది టీడీపీ. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారో, ఆర్థికలోటును ఎలా భర్తీచేస్తారో, ప్రత్యేకప్యాకేజీ, రైల్వేజోన్‌పై కేంద్రంమదిలో ఏముందో స్పష్టత రాకుండా ప్రధాని వచ్చిపోతే లాభాలకంటే అనర్ధాలే ఎక్కువన్న అంచనాతో ఉంది చంద్రబాబు సర్కారు. అందుకే ముందే అన్ని అంశాలపై స్పష్టత తీసుకున్నాకే అధికారికంగా ఆహ్వానం పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ నెల 21న కీలక సమావేశం జరగబోతోందని సమాచారం. ఈ భేటీకి అన్ని వివరాలతో హాజరుకావాలని రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులకు పీఎంవో కబురంపింది. అదేరోజున రాష్ట్ర విభజన చట్టం అమలుపై షీలా బిడే కమిటీతో చర్చలకోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపింది.

