పార్టీని నిలబెట్టడానికి, ఎన్నికల్లో గెలిపించడానికి రాజకీయం అవసరమే. కానీ అందులోనూ కొన్ని పట్టువిడుపులు ఉండాలి. సంస్కారవంతంగా వ్యవహరించాలి. బట్టకాల్చి మొహాన్నేస్తే వాళ్లు వెళ్లి కడుక్కొచ్చేలోపు మన పని చక్కబెట్టుకోవచ్చనుకుంటే అంతకంటే అనైతికం మరోటుండదు. మోడీ ఏ ముహూర్తాన ప్రధాని అయ్యారోగానీ బీజేపీలో ఏ టూ జడ్ అంతా ఆయనే. సీనియర్లంతా సైడైపోయారు. కాస్త గౌరవంగా రాజకీయం చేసేవారు మౌనం వహించారు. కశ్మీర్‌నుంచి కన్యాకుమారిదాకా కాషాయపతాకాన్ని రెపరెపలాడించే బాధ్యతని సింగిల్‌హ్యాండ్‌తో భుజానికెత్తుకున్నారు శ్రీమాన్ మోడీ.

అవసరమైననప్పుడు కొన్ని పరిమితులకు లోబడి రాజకీయం చేస్తే ఏ ఇబ్బందీలేదు. కానీ ప్రతీదీ రాజకీయమైతేనే కష్టం. మోడీ ఇప్పుడు చేస్తోందదే. రాజకీయ ప్రయోజనాలకోసం ఆయన ఎంతదూరమన్నా వెళ్తున్నారు. ట్రక్కులకొద్దీ దుమ్ముని ప్రత్యర్థుల నెత్తిన గుమ్మరిస్తున్నారు. రెండుసార్లు ప్రధాని అయినా ఏనాడూ ఎవర్నీ పల్లెత్తు మాటనని మన్మోహన్‌సింగ్‌ని ఆ మధ్య దేశమంతా అనుమానించేలా ఆరోపణలుచేశారు మోడీ. ఎన్నికల అవసరం తీరగానే మెమరీ చిప్‌నుంచి ఆ ఆరోపణని డెలిట్ చేసిపారేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లోనూ తన మార్క్ చూపించేందుకు జనం నేతగా పేరున్న మాణిక్ సర్కార్‌పైనా మోడీ నిందలేయడమే కొందరిని బాధిస్తోంది. నిరాడంబర జీవితం గడిపే ఏ మచ్చాలేని సీపీఎం నేతకీ బురదంటించేందుకు ప్రయత్నించారు మోడీ. ఈకాలంలో అలాంటి నాయకులు ఉండటమే అరుదు. అనవసర ఆరోపణలు చేయకుండా మన ప్రచారమేదో మనం చేసుకుందామనుకుని ఉంటే మోడీకి కాస్త గౌరవం దక్కేది. కానీ రాజకీయ యావలో ఆ విచక్షణ లేకుండా పోయింది మోడీగారికి. అందరి దృష్టిలో త్రిపుర ఎన్నిక అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఒకవేళ మోడీ గెలిచినా నైతికంగా ఓడిపోయినట్లే.

