అబ్బా…వీళ్ల‌కూ ఆవేశ‌మొస్తోందే!

0
585

కేంద్రంసాయం దేవ‌తావ‌స్త్రం. నాలుగేళ్ల‌పాటు టీడీపీ మౌనం. పార్ల‌మెంట్ సాక్షిగా జ‌రిగిన ర‌చ్చ త‌ర్వాత టీడీపీ-బీజేపీ బంధం ఉంటుందో ఊడుతుందో తెలీదుగానీ ఉత్త‌రకుమార ప్ర‌గ‌ల్భాలు, భీష్మ ప్ర‌తిజ్ఙ‌లు చూస్తున్న‌వారికి మాత్రం బుర్ర గిర్రున తిరుగుతోంది. త‌మ్ముళ్లు ఆవేశ‌ప‌డుతుంటారు. చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డొద్దంటారు. అప్పుడ‌ప్పుడూ ఆయ‌నే కీ ఇచ్చి వ‌దులుతుంటారు. అన్యాయం జ‌రిగిందంటారు. ఆదుకోవాల‌ని అభ్య‌ర్థిస్తారు. ఫ్రెండ్‌షిప్ వద్ద‌నుకుంటే దండం పెట్టేయండంటారు. అదేదో త‌నే పెట్టేయొచ్చుగా….అంటే మ‌ళ్లా అదో మొగిలిరేకులు సీరియ‌ల్ అంత మ్యాట‌ర్ వినాల్సి ఉంటుంది.

దూకుడు పెంచాల్సిందే..
వీర్రాజు, విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి

మార్చి 5 త‌ర్వాత ఏం జ‌రుగబోతోందో…టీడీపీ ఎంపీలు చివ‌రికి ఏ నిర్ణ‌యం తీసుకుంటారోగానీ ఈ మొత్తం వ్య‌వ‌హారంతో ఏపీలో బీజేపీ మాత్రం కుత‌కుత‌లాడిపోతోంది. కేంద్రం ఎంతో చేసింద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నా…అన్యాయం జ‌రిగిపోయింద‌న్న మాటే జ‌నంలోకి వెళ్లిపోయింది. కేంద్రం ద‌గా చేసింద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డిపోయింది. దీంతో ఏం..మ‌న‌కు మాత్రం ఆవేశంరాదా? వాళ్లు పార్ల‌మెంట్‌లో గొడ‌వ‌చేస్తే మ‌నం అసెంబ్లీలో తాడోపేడో తేల్చుకునేందుకు అసెంబ్లీ లేదా అంటూ ఎగిరెగిరి తొడ‌లు కొడుతున్నారు ఏపీ బీజేపీలో కొంద‌రు నేత‌లు.

కేంద్రంనుంచి టీడీపీ మంత్రులు త‌ప్పుకునేదేంటి? ఆ లోగా ఏపీలో మ‌న‌మే ఆ ప‌నిచేస్తే కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ‌లా ఉంటుంద‌న్న‌ది ఏపీ బీజేపీలో కొంద‌రు ప్ర‌ముఖుల ఆలోచ‌న‌. టీడీపీ విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టేందుకు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బీజేపీ ప‌దాధికారుల మీటింగ్‌లో నాయ‌కులు విప‌రీతంగా ఆవేశ‌ప‌డిపోయారు. మంత్రుల‌తో రాజీనామా చేయించాల‌న్న బీజేపీ యువమోర్చా నేత విష్ణువర్థన్‌రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు నేత‌లు సానుకూలంగా స్పందించారు.

రాజకీయాల విష‌యం కేంద్ర నాయ‌క‌త్వం చూసుకుంటుంద‌నీ..రాష్ట్రానికి కేంద్రం అందించిన సహకారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెడ‌దామ‌ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు అంద‌రికీ స‌ర్దిచెప్పారు.సంయమనం పాటించాలని చెప్పిన హ‌రిబాబుతోనూ ఒక‌రిద్ద‌రు నేత‌లు వాగ్వావాదానికి దిగారు. ఓ ద‌శ‌లో ఆయ‌న వారించినా మంత్రి మాణిక్యాలరావు వినలేదు. బ‌స్సుయాత్ర‌తో జ‌నంలోకి వెళ్లి బీజేపీ ఏం చేసిందో చెబుదామ‌న్న పార్టీ కార్యదర్శి లక్ష్మీపతిరాజా వారించిన హ‌రిబాబుతో వాగ్వాదానికి దిగారు.

వీళ్లు ఆవేశ‌ప‌డుతున్నారు స‌రే..హైక‌మాండ్ మ‌దిలో ఏముందో?

మిస్ట‌ర్ ప్రైమ్‌మినిస్ట‌ర్ అంటూ పార్ల‌మెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏపీ బీజేపీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. మిస్ట‌ర్ చంద్ర‌బాబూ అని మేం అన‌లేమా అన్న‌ది వారి పాయింట్. నిక్షేపంగా అనొచ్చు. అంతా డ్రామా అని జ‌నం అనుకోకుండా ఎవ‌రిదారి వారు చూసుకుంటే ఎన్న‌యినా అనుకోవ‌చ్చు.