సర్పంచులకు దక్కకుండా చేసిందే టీడీపీ….
జిల్లా వైసిపి సీనియర్ నేత రొక్కం
శ్రీకాకుళం/15.8.21.
ఆగస్టు 15న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ చైర్మన్లతో జాతీయ పతాకావిష్కరణ ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల పై టిడిపి నాయకులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలు ఖండిస్తున్నామని జిల్లా వైసిపి సీనియర్ నేత రొక్కం సూర్యప్రకాశరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 73 ,74 రాజ్యాంగ సవరణలు ఇప్పుడు మీకు గుర్తుకురావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత మీ ప్రభుత్వం లోనే కదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పంచాయితీ సర్పంచులను కాదని ఎంపీటీసీల ద్వారా ఆవిష్కరణ చేయించింది మీరు కాదా అని దుయ్యబట్టారు. అడ్డు గోల జీవోలు మీ ప్రభుత్వం లోనే విడుదల చేసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది మీరు కాదా అన్నారు.
రాజ్యాంగం సర్పంచుల కిచ్చే గౌరవాన్ని, సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది టిడిపి ప్రభుత్వమే గాని వైసిపి ప్రభుత్వం కానే కాదని తెలుసుకోవాలన్నారు. ఈ సంగతి టిడిపి నాయకులకు తెలిసి కూడా వారి ఉనికిని కాపాడటం కోసమే ఇలా తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం లోనే పంచాయతీలను నిర్వీర్యం చేసేసి, జన్మభూమి కమిటీలకు అధికారం ఇచ్చేసి, సర్పంచుల అధికారాలకు కత్తెర వేసింది, సర్పంచులకు పంచాయతీ నిధులు అందకుండా, పంచాయతీని అభివృద్ధి చేయకుండా, నెలల కొలది ట్రెజరీ లో వారి ఖాతాలను పెండింగ్లో పెట్టింది మీ ప్రభుత్వమే కదా అని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం అడ్డుగోల జీవోలు జారీ చేసినప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల వలె మిగిలిపోతారని అప్పుడు మీకు తెలియదా అని ప్రశ్నించారు. వైయస్సార్సీపి కి చెందిన సర్పంచుల అందరి చెక్పవర్లను అన్యాయంగా తొలగించి మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చి లక్షల్లో లూటీ చేసుకున్న సంగతి బహుశా మర్చిపోయారేమో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇకనైనా గతాన్ని గుర్తు చేసుకొని మాట్లాడితే ప్రజలు క్షమిస్తారన్నారు.

