అన్నెంపున్నెం ఎరుగని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నూరేళ్లు బతకాల్సిన పాప నిండు జీవితాన్ని చిదిమేశాడు. కడుపున పుట్టిన పాపానికి లక్షలు పోసి కన్నవారు బెయిల్‌పై బయటికి తెస్తే చివరికి పదివేలకోసం సొంత తల్లినే కడతేర్చాడు. ఇలాంటి నరరూపరాక్షసుడికి ఈ భూమ్మీద బతికే అర్హత లేదని భావించిన న్యాయస్థానం మరణశిక్ష విధించింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన కేసులో పాతికేళ్లు కూడా నిండని నిందితుడు ఉరికంబం ఎక్కబోతున్నాడు.

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హతమార్చిన కిరాతకుడు దశ్వంత్‌కు (24) తమిళనాడు చెంగల్పట్టు మహిళాకోర్టు ఉరిశిక్ష విధించింది. మానవత్వానికే మచ్చ తెచ్చాడని నతన తీర్పులో న్యాయమూర్తి వేల్‌మురుగన్ ఆగ్రహించారు. దశ్వంత్‌ను కోర్టులో హాజరు పరచడానికి తీసుకొచ్చినప్పుడు అక్కడున్న మహిళలు ఆగ్రహం పట్టలేక అతనిపై దాడికి దిగారు.
పోరూరు సమీపంలోని ముగిలివాక్కం రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో ఉండే దశ్వంత్.. గత ఏడాది ఫిబ్రవరి 8న పక్కింట్లోని హాసిని (7) అనే బాలికపై అత్యాచారం జరిపి, అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించాడు. బాలిక శవాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్లు అందరితోపాటు వెదికాడు. అయితే, అతడు గోనెసంచిలో బాలిక శవాన్ని మూటగట్టి తీసుకెళ్తున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వటంతో దొరికిపోయాడు.
బాలికపై అత్యాచారం, హత్యకేసులో పోలీసులకు చిక్కిన దశ్వంత్‌ని బయటికి తెచ్చేందుకు తల్లిదండ్రులు ఎంతో ఖర్చుపెట్టారు. మొత్తానికి బెయిల్‌పై విడిపించారు. అయితే, తన విలాసాలకు రూ.10వేలు ఇవ్వలేదని సొంత తల్లినే దారుణంగా చంపేశాడా దుర్మార్గుడు. ముంబైకి పరారైన అతన్ని పట్టుకున్నారు. చివరికి ఈ దుర్మార్గుడు ఉరికంబం ఎక్కబోతున్నాడు.

