
నవతరం, న్యుఢిల్లీ; ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో నిబంధలనలు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు.
కొవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉంచాలని ఆ లేఖలో సూచించారు. కొవిడ్-19 కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను భల్లా కోరారు. కొవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని లేదని లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 28న కొవిడ్ మార్గదర్శకాలను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. గడువు ముగుస్తుండటంతో మరో నెలరోజుల పాటు పొడిగించింది. దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో దీపావళి సహా పలు పండుగలు ఉన్నాయి. దీంతో పండుగ వేళల్లో గుంపులుగుంపులుగా ఉండరాదని, కరోనా నియమాలను పాటించాలని సూచించింది హోంశాఖ. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మూడో వేవ్‌కు స్వాగతం పలికినవాళ్లమవుతామని హెచ్చరించింది. గత కొన్నిరోజులుగా దేశంలో రోజువారి కరోనా కేసులు 10-20 వేల లోపే నమోదవుతున్నాయి. అయితే గురువారం మాత్రం 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. 733 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 34,321,809కి చేరింది. మరణాల సంఖ్య 456,386గా ఉంది. గత వారం వ్యాక్సినేషన్‌లో భారత్ అరుదైన మైలురాయిని చేరుకుంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది.

