అడుగడుగునా అడ్డుపడితే అభివృద్ధి చేసేదెలా…?

0
192

సర్పంచ్ పై వార్డు సభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు…

నవతరం, రావులపాలెం: ఆత్రేయపురం సర్పంచ్, సభ్యుల పంచాయతీ ఇప్పుడు కలెక్టర్ ముందుకు వచ్చింది.ఆధిపత్యం కోసం ఇరువర్గాలు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మొన్న సర్పంచ్ గెడ్డం సుధ స్వయంగా కలెక్టర్ ను కలిసి సభ్యులు తమని ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేయగా మెజార్టీ సభ్యులు, ఉప సర్పంచ్ కలెక్టర్ ను కలిసి తమల్ని ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తూ బ్లాక్ మెల్ చేస్తున్నారో అంటూ పంచాయతీ సర్పంచ్ పై కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. మేము ప్రజలతో ఎన్నిక కాబడిన వార్డు సభ్యులం కదా! మాకు కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మా వార్డుల్లోనూ మేం అభివృద్ధి పనులు చేయించాలి కదా! ఆమె రాజకీయాలు చేస్తున్నారు. వంగి వంగి నమస్కారాలు పెట్టడం లేదని మమ్మల్ని సంప్రదించకుండా.. సర్పంచ్ గెడ్డం సుధ తన ఇష్ట ప్రకారం పాలన చేస్తూ.. మొత్తం పంచాయతీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇదేంటి అని అడిగితే.. నా ఇష్టం.. నేను సర్పంచ్ ని.. మీకు అడిగే హక్కు లేదు, పైగా నేను ఎస్సీ మహిళను.. అంటూ బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఆమె నుంచి మమ్మల్ని రక్షించి, ఆత్రేయ పురం పంచాయతీ అభివృద్ధికి సహకరించండి. అంటూ కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. శనివారం ఆత్రేయ పురం ఎంపీటీసీ సరెళ్ల ధనలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ ముదునూరి విష్ణు మూర్తి రాజు, అధికార పార్టీ వార్డు సభ్యులు పది మంది మూకుమ్మడిగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదు చేశారు. వాడపల్లి బ్రహ్మోత్సవాలకు వచ్చిన కలెక్టరును కలిసిన ఆత్రేయపురం వార్డు సభ్యులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. పంచాయతీ అంటే కేవలం సర్పంచ్ మాత్రమే కాదని, వార్డు సభ్యులు అంతా కలిస్తేనే పంచాయతీ అని, అయితే సర్పంచ్ గెడ్డం సుధ మాత్రం అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టరుకు వివరించారు. గత నెల 29 న జరిగిన పంచాయతీ సాధారణ సమావేశంలో కూడా మినిట్స్ బుక్ లో ఆమెకు నచ్చినట్టు రాసుకున్నారని కలెక్టరుకు తెలిపారు. తాను దళిత మహిళా సర్పంచ్ అని, అందరూ గెడ్డం సుధను ఇబ్బంది పెడుతున్నారని, లేని పోని ఆరోపణలు తమపై చేస్తున్నారని కలెక్టరుకు చెప్పారు. ప్రతి పనిలో ఆమెదే పై చేయిగా ఉండాలని, నిబంధనలు పాటించకుండా ఆమెకు నచ్చినట్టు పనులు చేయాలని కార్యాలయ సిబ్బందిని కూడా హెచ్చరిస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు కలెక్టరు వద్ద వాపోయారు. చట్ట ప్రకారంగా ఆమెపై చర్యలు తీసుకుని, తాము ప్రజలకు మంచిని చేసేలా సహకరించాలని వార్డు సభ్యులు కలెక్టర్ శుక్లా ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శుక్లా ఇటీవల ఈ విషయంపై సర్పంచ్ గెడ్డం సుధ తమను కలిసి ఫిర్యాదు చేశారని, అయితే వార్డు సభ్యులు పంచాయతీ అభివృద్ధి పనులకు సహకరించడం లేదా…? అని తాను సర్పంచ్ ను ప్రశ్నించామని దానికి సర్పంచ్ సరైన సమాధానం ఇవ్వలేదని కలెక్టర్ శుక్లా తెలిపారు. కాగా ఆ ఫిర్యాదులో వాస్తవం లేదని గ్రహించానన్నారు. మళ్ళీ ఇప్పుడు వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తప్పు ఎవరిది ఉన్నా తగు చర్యలు తీసుకుంటామని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గి రెడ్డి, కొత్తపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముదునూరి రామరాజు ఉన్నారు.