

న
నా కోసం జైలుకు వచ్చిన జగనన్న – ఆ రుణం జీవితాంతం మర్చిపోలేను: డా. సీదిరి అప్పలరాజు
పలాస వైసీపీ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు – బెదిరింపులకు భయపడని పోరాటమే మన బలం…
ఇది ప్రమాదం కాదు, రాజకీయ కుట్ర – రెడ్ బుక్ పాలనకు ఇదే సాక్ష్యం..
జగనన్న ఇచ్చిన ఈ పెద్ద కుటుంబమే నాకు కొండంత అండ..
నిరూపించలేని ఆరోపణలు – అధికారంతో చేయించిన అక్రమ అరెస్ట్..
నవతరం, పలాస: తనపై నమోదైన అక్రమ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కుట్ర అని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను అణచివేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. శనివారం పలాసలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ, తన కుటుంబానికి అత్యంత కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
గత నెలలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కావాలనే హత్య కేసుగా మార్చి, లేని సెక్షన్లు జోడించి తనను, తన కుమారుడిని అక్రమంగా నిర్బంధించడం కూటమి ప్రభుత్వ కక్షపూరిత పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి ప్రత్యక్ష నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత హామీలను నిలదీస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి బలమైన గొంతుకగా ఉంటున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, కానీ ఇలాంటి కుట్రలకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అందుకే తనపై ఎలాంటి ఆధారాలు చూపలేక చివరకు ఇలాంటి తప్పుడు కేసులో ఇరికించారని, ఇలాంటి అక్రమ కేసులతో తన మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరని తేల్చి చెప్పారు. అధికారం అడ్డుపెట్టుకుని కేసులు పెట్టగలరు, అరెస్టులు చేయగలరు కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఫలానా తప్పు చేశానని మాత్రం ఎలాంటి ఆధారాలు చూపలేరని సవాల్ విసిరారు. తాను ఏ తప్పు చేయలేదని, భవిష్యత్తులో కూడా ఏ తప్పు చేయబోనని, ప్రజా సేవలోనే కొనసాగుతానని ప్రకటించారు.
తన అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే స్వయంగా జైలుకు వచ్చి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని కృతజ్ఞతతో అన్నారు. జగనన్న జైలుకు వచ్చి తన భుజం తట్టిన ఆ క్షణం తనకు, తన కుటుంబానికి కొండంత ధైర్యాన్నిచ్చిందని, ఆ ఒక్క పర్యటనతో ఉత్తరాంధ్ర మొత్తం తుఫాన్ లా కదిలిందని, ప్రజల్లో వైసీపీ పట్ల ఉన్న అభిమానం ఏంటో కూటమి ప్రభుత్వానికి తెలిసి వచ్చిందని అన్నారు. తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని, అండను ఇచ్చిన జగనన్నకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంగా చెప్పారు.
తాను జైల్లో ఉన్న సమయంలో కూడా బెదిరింపులకు, భయాలకు లొంగకుండా పార్టీ జెండాను భుజాన మోసిన పలాస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానుల ధైర్యం, తెగువ అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా తన కుటుంబానికి మానసికంగా అండగా నిలిచి, ప్రతి రోజు పరామర్శించిన మహిళా నాయకురాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిరసనలు చేపట్టిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి, జిల్లా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించిన జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారికి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలకు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో ప్రజా సమస్యలపై పోరాడుదామని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, వైఎస్ఆర్సీపీ నేత హనుమంతు వెంకట్రావు దొర, జడ్పీ వైస్ చైర్ పర్సన్ ప్రతినిధి పాలిన శ్రావణి శ్రీనివాస్ యాదవ్, పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగసాయి కృష్ణ యాదవ్, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు పైల చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి, వజ్రపుకొత్తూరు ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ మందస మండల నేతలు అందాల శేషగిరిరావు, సొర్ర ఢిల్లేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మడియ రామకృష్ణ, మందస మండల యువజన అధ్యక్షులు సేనాపతి కిషోర్, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్లు బల్ల లీల కుమారి, సుజాత పండా, చింతల సరస్వతి, పొల్లాడ లక్ష్మి, వైఎస్ఆర్సీపీ నేతలు కంచరాన చినబాబు, సీర ప్రసాద్, పులారి తవిటయ్య యాదవ్, కె. గోపి యాదవ్, మాజీ కౌన్సిలర్లు బోర చంద్రకళ, సవర సోమేష్, పీనకన ముకుంద, గొర్ల వేణు, దువ్వాడ రవి, తిర్రి రాజారావు తదితరులతో పాటు పలాస నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

