సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష…

0
305

వివక్షకు తావులేకుండా అర్హులకు పథకాలు అందాలి…
ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్.

నవతరం- రాజమహేంద్రవరం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కే.ఎస్.జవహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయడమే లక్ష్యంగా బాధ్యతతో పనిచేశామని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా 20 శాతం ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత వహించాల్సి ఉందని, నిబంధనల మేరకు 15 శాతం షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా అసమానతలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, రెండు గ్లాసులు విధానం కాకుండా నేటి సమాజంలో రెండు బెంచీలు విధానం కొనసాగుతోందన్న వాస్తవాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అధికారులు పనిచేస్తూ అర్హత కలిగిన పేద షెడ్యూల్డ్ కుల కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలవాలని సూచించారు. పేదల కోసం పనిచేసే సేవాభావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, “మనమే ఆ స్థితిలో ఉంటే?” అనే ఆలోచనతో విధులు నిర్వర్తించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో వివక్ష, సంఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, కమిషన్ నిర్దేశించిన అధికారాలకు విశేష అధికారాలు ఉన్నప్పటికీ అవి హోదా ప్రదర్శన కోసం కాదని, అర్హులకు న్యాయం చేయడానికేనని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహించి దళిత వర్గాల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సమాన అవకాశాలు, సమాన భావన కల్పించడమే కమిషన్ బాధ్యతగా తీసుకుంటుందని చెప్పారు. కులరహిత సమాజ నిర్మాణం, అందరూ సమానం అనే భావనను పెంపొందించేందుకే కమిషన్ విస్తృత పర్యటనలు చేస్తోందని వివరించారు. అర్హులకు పథకాలు అందించే ప్రక్రియలో వివక్ష చోటుచేసుకుంటోందని పేర్కొంటూ, ఈ పర్యటన అధికార ప్రదర్శన కోసం కాదని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన తన వర్గ ప్రజలకు చేరేలా చూడడమే లక్ష్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నామని, ఇందుకు అందరి సహకారం అవసరమని కోరారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్లు ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయని, తాను కూడా ఒకప్పుడు అలా అనుకున్నానని, కానీ క్షేత్రస్థాయి పర్యటనల్లో ఇంకా వివక్ష వాస్తవంగా ఉందని గ్రహించానన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంత మేర వివక్ష తగ్గినా, గ్రామీణ ప్రాంతాల్లో అది ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. తనకు హోదా ఉన్నందున గౌరవం లభిస్తోందని, కానీ తన సామాజిక వర్గంలో పుట్టిన సాధారణ ప్రజలకు ఇంకా తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శాఖ తమ శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వాస్తవ సమాచారాన్ని తెలియజేయాలని, తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు అందని పథకాలను క్యారీ ఫార్వర్డ్ చేయాలని, వెనరబుల్ ఏరియాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రెవెన్యూ పరంగా 32, పోలీసు పరంగా 9 అర్జీలు పరిష్కరించాల్సి ఉండగా, వాటిని సంబంధిత అధికారులకు అందజేసి తగిన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైన అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కూడా సమాచారం ఇచ్చి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎన్. చిన్న రాముడు మాట్లాడుతూ, కమిషన్‌కు అందిన అర్జీలను శాఖల వారీగా వర్గీకరించి, పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. అర్హులకు న్యాయం జరిగే వరకు కమిషన్ స్థాయిలో ఫాలోఅప్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సూచించిన మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖల ద్వారా తగిన చర్యలు తీసుకుని, షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ఎస్సీ కమిషన్ సూచనల మేరకు పోలీస్ శాఖకు సంబంధించిన అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి, వివక్ష, అన్యాయాలకు తావు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాల భద్రత, హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

ఈ సమావేశంలో కార్యదర్శి ఎన్. చిన్న రాముడు, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, డీఆర్‌వో టి. సీతా రామమూర్తి, ఎస్డీసీ కె. భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.డి. ఘయాజుద్దిన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.