సూపర్ ఎల్ నినోతో మాయం కానున్న “శీతాకాలం”
ఇటీవల వచ్చిన “సింగ్ గీతం” సినిమా కథ, కథా గమనం బాగుంది. పర్యావరణ హితంగా చెట్లు పెంచాలనే ఇతివృత్తం తో తీసిన చలన చిత్రం. చెట్లు నరికితే జరిగే విధ్వంసం కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన రెండో చిత్రం “జమిందారు గారి అమ్మాయి”తో ప్రారంభించి పౌరాణిక, చారిత్రక చిత్రాల దర్శకత్వంలో రాటుతేలిన సింగీతం ముదిమి వయసులో ఇలాంటి సినిమా అందులో చిన్న నటీనటులతో తీసి విజయం సాధించడం గొప్ప విషయం. చివరిలో విజయ్ దేవరకొండ ను గెస్ట్ యాక్టర్ గా పెట్టడం క్రేజీ లుక్ వచ్చింది. గతంలో “ఖలేజా” సినిమా కూడా పర్యావరణ హితంగా తీసారు. ఇప్పుడు వచ్చే సినిమాలు భాషలు వేరైనా హింస,శృతిమించిన శృంగారం తప్ప ప్రేక్షకులకు ఇచ్చే సందేశం అనేది మృగ్యం. నిర్మాతలు, దర్శకులు ప్రకృతి మీద సందేశం ఇచ్చే చిత్రాలు తీయాల్సిన తక్షణ అవసరం ఉంది. పచ్చదనం పెరిగితేనే మనుగడ ఉందని లేకపోతే భవిష్యత్లో భారీ విపత్తులు తప్పవని ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలతో పాటు సినిమా పరిశ్రమకు ఉంది. ఈ విషయం దర్శకనిర్మాతలు గ్రహించాలి.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్ నినో ఏర్పడింది. దీని ప్రభావం మన దేశంతో పాటు పలు దేశాలపై ఉంది. దీని వల్ల మన దేశంలో నైరుతీ రుతుపవనాలు బలహీనపడి వర్షాలు లేక కొన్ని ప్రదేశాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రాబోయే రోజుల్లో భారతదేశం మరింత తీవ్రంగా సూపర్ ఎల్ నినో నుంచి ఎదుర్కొనాల్సి ఉందని వాతావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే కొత్త వాతావరణాన్ని చూస్తామని చెబుతున్నారు. ఇది శీతాకాల మా,ఎండాకాలమా అని ఆశ్చర్యపడే స్థితి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ను నాశనం చేసిన ఈ ఎల్ నినో రాబోయే రబీ పంటలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. త్రాగునీటికి కటకట ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వీటన్నింటికీ కారణం మానవుడు పర్యావరణాన్ని నాశనం చేయడమే. చెట్లను,పచ్చని పోలాలను,అడవులను నరికి కాంక్రీటు జంగిల్స్ నిర్మిస్తున్నారు. చెట్లను నరకటమే కాని కొత్తగా మొక్కలను నాటాలనే సృహ కోల్పోతున్నారు. రహదారులు విస్తరణ పేరుతో పెద్దపెద్దవృక్షాలను కూల్చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో అమీర్ పేట,నిజాంపేట్,హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు ఉండేవి. అలాగే విజయవాడ లో బందర్ రోడ్డులో భారీ మర్రి వృక్షాలు ఉండేవి. రోడ్ల విస్తరణ లో అవి కాలం గర్భం లో కలిసిపోయాయి. గోదావరి జిల్లాలకు వెళ్లే హైవే మీద మామిడి,చింతచెట్లు బారులుతీరి రహదారులు ఇరువైపులా ఉండేవి. నేడు అన్నీ కనుమరుగై నాయి. అనంతపురంజిల్లాలో ఒకప్పుడు బోరు వేస్తే 10 మీటర్ల లోతులో నీరు పడేది. నేడు చెట్లు, పచ్చదనం కనుమరుగవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేయి అడుగులు లోతు బోర్లు వేసినా నీరు పడడంలేదు. ఎండాకాలం వచ్చిందంటే ఎండమావులు గుర్తుకువస్తాయి. కొండలు బోడి కొండలవుతున్నాయి. ఎల్ నినోలు,ప్రకృతి వైపరీత్యాలు, ఎడారిగా మారడం,భూగర్భ జలాలు క్షీణించడం, రుతువులు మారిపోవడం వంటి తరచూ కరువు ఛాయలు ప్రస్ఫుటించడం సాధారణంగా మారే ప్రమాదం ఉంది.
సాంకేతికంగా మానవుడు మారినా ప్రకృతి వినాశక చర్యలు మానుకోకపోతే ఇలాంటి దుష్పరిణామాలు తప్పవు. ప్రకృతిని రక్షిస్తే నే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువు అందే పరిస్థితి. ఇలాగే ప్రకృతి విధ్వంసం కొనసాగితే ఆక్సిజన్ మాస్క్ లతో గాజు భవనాల్లో బందీగా బ్రతికే బ్రతుకులు రాబోయే తరాలకు తప్పవు.ఇటీవలవచ్చిన” కల్కి” సినిమాలో చూపించినట్లు పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.
యం.వి.రామారావు

