సిన్మా ఇండస్ట్రీలో మిస్టర్‌కూల్ అనే పేరుంది రాజమౌళికి. దర్శక బాహుబలి అయినా అందరి విషయంలో ఆయన మర్యాదరామన్న. తనకు నచ్చినట్లు సీన్ చేయించుకోవడమే తప్ప ఎవరిమీదన్నా కేకలేశారని గానీ, కన్నెర్రచేశారని గానీ ఎప్పుడూ విన్నది లేదు. ఎవరూ చూసింది లేదు. కానీ అతిలోకసుందరి శ్రీదేవితో మాత్రం జక్కన్నకి గ్యాప్ వచ్చింది. ఒకర్నొకరు తప్పుపట్టుకునేదాకా వచ్చింది.
వెయ్యికోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టిన బాహుబలి సిన్మాలో ప్రభాస్, రాణాల పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఉందో శివగామి కేరక్టర్‌దీ అంతే ప్రయారిటీ. ఆ కేరక్టర్‌లో రమ్యకృష్ణ జీవించేసింది. అయితే రాజమాత శివగామిదేవి పాత్రకోసం మొదట శ్రీదేవిని సంప్రదించాడు జక్కన్న. కానీ శ్రీదేవి డిమాండ్ భారీగా ఉండటంతో చివరికి రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తనే స్వయంగా వెల్లడించారీ విషయాన్ని.
రాజమౌళి కామెంట్స్‌ని శ్రీదేవి సీరియస్‌గా తీసుకోవటంతో అది చివరికి ఇష్యూగా మారింది. రాజమౌళి తీరుని తప్పుపట్టారు శ్రీదేవి. అయితే వివాదాన్ని సాగదీయకుండా తనే తగ్గారు రాజమౌళి. శ్రీదేవి నో చెప్పిన విషయాన్ని, ఆమె డిమాండ్లని బయటపెట్టకుండా ఉండాల్సిందని అన్నారు. శ్రీదేవి అంటే తనకెంతో గౌరవం ఉందంటూ…ఆమె మనస్తాపానికి గురైనందుకు చింతిస్తున్నానని చెప్పారు.
హఠాన్మరణంతో ఆమె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్న టాలీవుడ్‌కి..శ్రీదేవితో జక్కన్నకు జరిగిన వివాదం కూడా ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఇంకొన్నాళ్లు బతికుంటే శివగామిదేవి కాకపోయినా తన సిన్మాలో మరో కేరక్టర్‌గానైనా శ్రీదేవికి ఛాన్సిచ్చి ఆమెని కూల్ చేసి ఉండేవారేమో రాజమౌళి.

