- డీఎంహెచ్ఓ మేడ్చల్ జిల్లా
మేడ్చల్ జిల్లా బ్యూరో, అక్టోబర్ 17 (నవతరం): భద్రత విషయంలో తాను ఎప్పుడు అండగా ఉంటానని మేడ్చల్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని జర్నలిస్టులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని డాక్టర్ పుట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా వైద్య ఖర్చులలో రాయితీలను కూడా ఇచ్చేలా చూస్తానని హామీని ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న 63 రకాల వైద్య పరీక్షలను నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండలాల వారిగా ఈ శిబిరాల ఏర్పాటుకు జర్నలిస్ట్ యూనియన్ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ తమ విన్నపాన్ని మన్నించి జర్నలిస్ట్ల ఆరోగ్య భద్రతకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా వైద్య అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టుల వైద్య సేవలను అందించేందుకు ఎక్కడికక్కడ అస్పత్రుల యాజమాన్యాలను కూడా కలుస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి. మల్కయ్య, ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్, రవీందర్, ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, జిల్లా స్టాఫ్ సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు బాల్ రెడ్డి, జగదీశ్, శ్రీధర్, శేషారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


