ఒక్క సీన్‌తో కోట్ల మంది హృదయాల్ని కొల్లగొట్టేసింది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. రాత్రికి రాత్రి ఎంత పేరొచ్చి పడిందో…కష్టాలు కూడా అదే రేంజ్‌లో వెంటాడుతున్నాయి. దీంతో కాలేజీకెళ్తున్న వయసులోనే కోర్టుకెక్కింది 18 ఏళ్ల కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.
సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ ‘ఒరు ఆదార్ లవ్’ లోని ఓ పాటలోని వీడియో సీన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్ కేసు నమోదైంది. దీంతో తమ మూవీ యూనిట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని ప్రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియాతో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ‘ఒరు ఆదార్ లవ్’ సిన్మాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలోని సన్నివేశాలపై ఇప్పడు వివాదం నడుస్తోంది.
హీరోయిన్ కనుబొమ్మలు ఎగరేస్తూ, కన్ను కొడుతూ హీరోకు బదులిస్తున్న వీడియో సంచలనంగా మారింది. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుండగా.. కేసుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని ప్రియా ప్రకాష్ వారియర్ భావిస్తోంది. కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తోంది.


