కళింగల ఆగ్రహం – వెలమ ద్వయం ఆట కట్టిస్తాం! శ్రీకాకుళంలో కుల సమీకరణాల కొత్త యుద్ధం!

0
82

జిల్లా పరిషత్ లో కూన రవికుమార్ పై దాడి, తమ్మినేనిపై విమర్శలు – ఒకే కోణంలో కుట్ర!

బొడ్డేపల్లి, కణితి, శారద, సాయిరాజ్ వరకు అందరూ బలే – వెనుక ఆ ఇద్దరు నేతల హస్తం!

పోలాకి పీఠం నుంచి మేయర్ పీఠం వరకు కళింగ జెండా ఎగురవేస్తాం – 2029కి పావులు కదుపుతున్న పెద్దలు!


నవతరం, శ్రీకాకుళం: ఒకప్పుడు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాబడ్డ కళింగ సామాజిక వర్గానికి శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోవడమే కాక, రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యానికి దూరంగా ఉంటూ, అనేక అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ, అందుకు వెలమ సామాజిక వర్గానికి చెందిన రెండు రాజకీయ కుటుంబాలు వేరు వేరు రాజకీయ పార్టీలలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా, లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల, కొన్ని దశాబ్దాల నుంచి ఆ రెండు రాజకీయ కుటుంబాలే ఆదిపత్యం చూపిస్తున్న తీరుపై కళింగ సామాజిక వర్గ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు ఒక పథకం ప్రకారం మరొక సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యే చేత చేయించి, వచ్చే ఎన్నికల్లో తమ్మినేని కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు జరిగిన కుట్ర పై ఆ సామాజిక వర్గం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా వెలమ సామాజిక వర్గాన్ని చెందిన ఆ రెండు కుటుంబాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కళింగ సామాజిక వర్గానికి చెందిన పెద్ద నేతలను వ్యూహాత్మకంగా రాజకీయాల నుంచి తప్పించేందుకు కొనసాగిస్తున్న కుట్రలు చూస్తుంటే వాళ్లంతా మండిపడుతున్నారు.
అలాగే జిల్లా పరిషత్ సమావేశాలలో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ కూర్చున్న కుర్చీ వద్దకు వచ్చి ఒక జడ్పిటిసి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తీరు పట్ల కళింగ సామాజిక వర్గం తమ నాయకుడిపై ఒక పథకం ప్రకారం మాటల దాడి చేసినప్పటికీ, రానున్న ఎన్నికల్లో కూడా భయపెట్టే పరిస్థితి కల్పించేందుకు తగ్గ వ్యూహరచన ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
గతంలో బొడ్డేపల్లి రాజగోపాల్ రావు సుదీర్ఘకాలం శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నప్పటికీ, ఒక దశలో ఆముదాలవలస శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆయన శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు, ఒక వెలమ సామాజిక వర్గ రాజకీయ పెద్ద నేత నాటి ఎన్నికల్లో బొడ్డేపల్లి రాజగోపాల్ రావుకు వెన్నుపోటు పొడిచి.. ఓటమికి కారకుడు అయినాడంటూ కొందరు ఇప్పుడు చెబుతుంటారు. అదేవిధంగా బొడ్డేపల్లి సత్యవతికి కూడా రాజకీయంగా మరింత ఎదగనివ్వకుండా అణిచివేసే ధోరణి ఈ వెలమ సామాజిక వర్గ నేత కంకణం కట్టుకున్నాడు అన్న ప్రచారం లేకపోలేదు. పలాస కు చెందిన డాక్టర్ కణితి విశ్వనాథం రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికైతే… ఆయన్ని రాజకీయంగా ఎదగనివ్వకుండా పివి ప్రోగ్రెసివ్ ఫోరం పేరిట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి.. రాజకీయంగా ఆయన్ని దెబ్బతీసే కుట్ర పన్నిన ఆ వెలమ నాయకుడే నంటూ కళింగ సామాజిక వర్గం పెద్దలు ఆరోపిస్తుంటారు.
అదేవిధంగా మజ్జి శారదకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రాకుండా వేరే సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించడంలో ఈ వెలమనేత ప్రమేయం ఉందంటూ కళింగ సామాజిక వర్గం పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా హనుమంతు అప్పయ్య దొర, ఆమధ్య దువ్వాడ శ్రీనివాస్, పిరియ సాయిరాజ్ కూడా ఈ వెలమ నాయకుడు బాధితులే .. నంటూ విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అనూహ్యంగా తాడేపల్లిలో కలవడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓటు బ్యాంకు పరంగా కళింగ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, కనీసం ఐదో స్థానంలో లేని వెలమ సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు వేరు వేరు రాజకీయ పార్టీలలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం కొనసాగడంతో కొన్ని దశాబ్దాల నుంచి రాజ్యాధికారానికి న్యాయపరంగా అవకాశాలు ఉన్నప్పటికీ, దూరం కావడానికి ఈ రెండు కుటుంబాలు చేసిన కుట్రలేనని కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు.
గత ఏడాది నిర్వహించిన కళింగ సామాజిక వర్గ వన మహోత్సవం కార్యక్రమంలో తమ సామాజిక వర్గం ఎలా మోసగించబడిందో.. అక్కడ పెద్దలు వివరించిన తర్వాత, వచ్చే ఎన్నికల్లో ఆ రాజకీయాలకు అతీతంగా తమకు ఏ రాజకీయ పార్టీ గుర్తిస్తుందో.. వారికి మద్దతునిస్తూ మళ్లీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడానికి తగ్గ పూర్వ వైభవం సంపాదించుకోవడానికి కార్యాచరణకు సిద్ధమంటూ తీర్మానం చేసుకున్నారు. 2029 ఎన్నికలలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించే రాజకీయ శక్తులతో కలిసి తమకు ఇంతకాలం రాజ్యాధికారంలోకి రానివ్వకుండా అడ్డుకొనే ఆ రెండు కుటుంబాల ఆధిపత్యాన్ని నిలువరించేందుకు తగ్గ వ్యూహరచనలలో ఉన్నామని కళింగ పెద్దలు చాప కింద నీరులా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇటీవల జిల్లా తో పాటు ఇతర జిల్లాలో ఉన్న కళింగ సామాజిక వర్గంలో ఉన్న ఉన్నత స్థాయి పెద్దలతో అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ తాము అనుకున్న ఎజెండా అమలు చేసే ప్రయత్నంగా సామాజిక వర్గాన్ని ఐక్యమత్యం చేసేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గాని, నరసన్నపేట నియోజకవర్గం లో పోలాకి మండలం జడ్పిటిసి స్థానం లేక ఎంపీపీ పీఠం అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
అదేవిధంగా పలాస మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం విషయానికి వస్తే ఇక్కడ కింతలి కళింగ సామాజిక వర్గం ఓటు బ్యాంకు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, మూడుసార్లు కనీసం 500 ఓట్లు కూడా లేని బూరగాన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ అభ్యర్థిగా పట్టం కట్టడంలో ఆ రెండు వెలమ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల ప్రమేయం ఉందంటూ కళింగ సామాజిక వర్గ పెద్దలు విస్మయం చెందుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సామాజిక వర్గమైన కళింగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, వచ్చే 2029 ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని, అందుకు 3వ రాజకీయ ప్రత్యామ్నయం ద్వారా రాజ్యాధికారంలోకి రావడం ఖాయమని కళింగ సామాజిక వర్గం పెద్దలు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా ప్రస్తుతం ప్రతిపక్ష జిల్లా నేతలుగా వ్యవహరిస్తున్న ఈ వెలమ సామాజిక వర్గ సోదరులు ఇద్దరు ఆముదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజక వర్గాలలో కళింగ సామాజిక వర్గ నేతలతో పాటు మరికొన్ని సామాజిక వర్గాల నేతలు మధ్య విభేదాలు సృష్టిస్తూ పాపం కడుక్కుంటున్నారని కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు బహిరంగంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
పలాస నియోజకవర్గానికి విషయానికి వస్తే రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బల్ల గిరిబాబుకు మధ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన క్రియాశీలక రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు జిల్లా పార్టీ అధిష్టానానికి పలువురు నేతలు, కార్యకర్తలు విన్నవించిన కూడా ఇంతవరకు సమన్వయం చేయడంలో జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు లేకపోలేదు. స్వయంగా బల్ల గిరిబాబు జిల్లా అధిష్టానం ముందు తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక, పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా, కొన్ని రాజ్యాంగేతర శక్తులు తన ఆత్మ గౌరవంపై దెబ్బతీసిన కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం దెబ్బ తినకుండా పార్టీపై విశ్వాసంతో కొనసాగుతున్నప్పటికీ, ఇంతవరకు అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 ఎన్నికల్లో అక్కడ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు అంటూ సీనియర్లు జిల్లా అధిష్టానానికి విన్నవించుకున్న, ఈరోజు వరకు కూడా జిల్లా నాయకత్వం మీన మేషాలు లెక్కించుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి లేకపోలేదు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కింతలి కళింగ సామాజిక వర్గం ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నప్పటికీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏమాత్రం ఓటు బ్యాంకు లేని సామాజిక వర్గాలకు చెందిన వారిని రాజకీయంగా డ్రాప్ చేస్తున్న తీరుపై కళింగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అలాగే ఇచ్చాపురంలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి ని నియమించినప్పటికీ, ఆయనకు మిగతా సామాజిక వర్గాలకు చెందిన వైఎస్ఆర్సిపి నేతలు తూతూ మంత్రంగా కార్యక్రమాలకు హాజరవుతూ వెళ్లిపోవడం వంటే అంశాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అయితే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉలాల బాలయ్య యాదవ్ కుటుంబం నుంచి చైర్ పర్సన్ పీఠం ఆశిస్తూ నేపథ్యంలో, నేతల మధ్య సమన్వయం చేస్తూ, ఒక ఏకాభిప్రాయానికి తీసుకురావడంలో వైఎస్ఆర్సిపి జిల్లా నాయకత్వం ఇక్కడ కూడా మీనమేషాలు వేస్తున్న పరిస్థితి లేకపోలేదు.
ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త సాయిరాజు గతంలో శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు కూడా. అంతేగాక ఎమ్మెల్సీ నర్తు రామారావు యాదవ్ ఈ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. పార్టీ ఆవిర్భావం నుంచి ఇచ్చాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిలో సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ చాలాకాలం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశావాహలలో ఆయన ఒకరు ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పీఠం ఇస్తామంటూ ఒక దశలో ఆయన పేరు తెరమీదకు వచ్చినప్పటికీ, ఎంపీపీగానే ఆయన సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పోతే వైయస్సార్సీపీలో వర్గాల పోరు కొనసాగుతున్న కూడా, పార్టీ బలోపేతం చేయడానికి ఇంతవరకు అసమ్మతి వాదులతో గాని, ఇతర కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారితో కానీ చర్చించి వారందరినీ, మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా వివరించేందుకు తగ్గ కార్యాచరణ చేయకపోవడం పట్ల పార్టీలో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరి వైయస్సార్సీపి రాష్ట్ర నాయకత్వం గాని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కొన్ని సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై కూడా ఆరా తీసి న్యాయం చేయాలంటూ ఆ పార్టీలో తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here