అందాలభామ శ్రీదేవి పోయిపోయి పెళ్లయి పిల్లలున్నవాడి భార్య కావడమేంటని తెగ బాధపడిపోయినవారున్నారు. కానీ ఆ దేవతనెంతో అపురూపంగా చూసుకున్నాడు బోనీకపూర్. వారి దాంపత్య జీవితానికి జ్ఙాపకంగా ఇద్దరు అందమైన ఆడపిల్లలు అతిలోకసుందరి వారసులుగా కళ్లెదుట కనిపిస్తున్నారు. కానీ శ్రీదేవి జీవితాన్ని రివైండ్ చేసి చూస్తే…తను కూడా వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కంది. తను ప్రేమించింది. ఆమెని ఆరాధించి జీవిత భాగస్వామిని చేసుకోవాలని కొందరు తపించారు.

30 ఏళ్ల వెనక్కి వెళ్తే మిథున్ చక్రవర్తితో శ్రీదేవి రిలేషన్ ఓ సంచలనం. కేవలం ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందనే ప్రచారమే కాదు…వాళ్లిద్దరికీ పెళ్లికూడా అయిపోయిందనే వదంతులు అప్పట్లో బాలీవుడ్‌ని కుదిపేశాయి. 1980ల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చే! అనేక సిన్మాల్లో కలిసి నటించిన శ్రీదేవి, మిథున్‌చక్రవర్తి ఇద్దరూ సెట్స్‌లో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆన్ స్క్రీనేకాదు బయటకూడా వీరి కెమిస్ట్రీ బాగుండేదంటారు.

శ్రీదేవి, మిధున్‌చక్రవర్తి 1985లో రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారని, అయితే మూడేళ్లకే ఆ బంధం తెగిపోయిందనే ప్రచారం కూడా ఉంది. మిథున్ తన మ్యారేజ్ సర్టిఫికెట్‌ని కొందరు సన్నిహితులకు చూపించాడని చెబుతారు. వీరిద్దరి పెళ్లి వార్త తెలియడంవల్లే మిథున్ భార్య యోగిత ఆత్మహత్యకు ప్రయత్నించిందనే ప్రచారమూ ఉంది. శ్రీదేవిని మిథున్ రెండో భార్యగా తెచ్చుకుంటే తనకు అభ్యంతరం లేదని యోగితాబాలి ప్రకటించడం అప్పట్లో ఓ సంచలనం.
అయితే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి శ్రీదేవికానీ, మిధున్‌చక్రవర్తిగానీ ఎప్పుడూ పెదవి విప్పింది లేదు. మొదట్లో భార్య యోగితకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పిన మిథున్ ఆ తర్వాత వెనక్కి తగ్గటంతో…శ్రీదేవి అతనితో తెగదెంపులు చేసుకుందని అంటారు.


