గ్లామర్ ఉండగానే బ్యాలెన్స్ చక్కబెట్టుకోవాలి. క్రేజ్ ఉండగానే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. నాటోన్లీ టాలీవుడ్..కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఏ సెలబ్రిటీకయినా గ్లామరే పెట్టుబడి. ఏదన్నా షాప్ రిబ్బన్ కటింగ్‌కి వచ్చి అందరికీ చేతులూపి నాలుగు చిలకపలుకులు పలికేందుకే ఓ అగ్రిమెంట్..కథా కమామీషు చాలా ఉంటుంది. అలాంటిది ఏ ప్రయోజనం లేకుండా…రూపాయి కూడా ఆశించకుండా ఈ కాలపు తారలు ప్రజాసేవకు ముందుకొస్తే…ముందుకొచ్చారని చెబితే నమ్మేందుకు కాస్త అసహజంగానే ఉంటుంది.
మొన్న ఏపీ…నేడు తెలంగాణ. సబ్జెక్ట్ ఒకటే..రాష్ట్రాలు వేరు. హీరోయిన్లు వేరు. ఈమధ్యకాలంలో తెలంగాణ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్‌లా మురిపిస్తున్న కుందనపుబొమ్మ విషయంలో నమ్మలేని నిజమొకటి బయటికొచ్చింది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరోయిన్ సమంతాకు ప్రభుత్వం ఏమీ చెల్లించడంలేదు. మరేమీ ఇవ్వకుండానే చేనేతని ఫ్రీగా ఎందుకు ప్రమోట్ చేస్తోందంటే…కేవలం సేవాభావంతోనేనట. ఎవరో చెబితే అబద్ధమని కొట్టిపారేయొచ్చు. కానీ ఈ పచ్చి నిజాన్ని చెప్పింది స్వయానా మంత్రి కేటీఆర్.
మరి ఇదే సమంతా తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ కాదని జరిగిన ప్రచారంపై టెస్కో డైరెక్టర్‌ని మంత్రి క్లాస్ పీకినట్లు కూడా వార్తలొచ్చాయి. దీంతో సమన్వయలోపంతోనే అలాంటి వార్తలొచ్చినట్లు మీడియాకు వివరణ ఇచ్చారు రాష్ట్ర చేనేత సహకార సంస్థ ఎండీ శైలజారామయ్యర్. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత పేరుని స్వయంగా కేటీఆరే అప్పట్లో ప్రకటించారు. స్వయంగా తానే ఆమెకో చీరను బహుకరించారు. మొత్తానికి మంత్రితో పాటు ఆ డిపార్ట్‌మెంట్ చెబుతోంది ఏంటంటే అందాల హీరోయిన్ చేనేత బ్రాండ్ అంబాసిడరేగానీ అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందుకోసం ఆమెకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడంలేదు. ఈ నిజం తెలిశాక సమంతా సమాజసేవని పొగడకుండా ఉండటం సాధ్యమేనా?
ఇక ఏపీలో పూనంకౌర్‌ది కుడెడంగా ఇలాంటి కథే. ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా బాగానే హడావుడిచేసింది హీరోయిన్ పూనం కౌర్. ఆ హోదాతోనే ప్రచారం జరుగుతున్నా, ప్రసారమాధ్యమాల్లో కవరేజీ వచ్చినా కాదని చెప్పని ప్రభుత్వం…ఓ ఇబ్బంది వచ్చేసరికి ఏపీ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరూ లేరని చెప్పేసింది. చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనం కౌర్‌ని ఎలా నియమించారని, ఎవరు చెబితే నియమించారని కత్తి మహేశ్ కొంటెప్రశ్నలు వేయటంతో అసలు ఆమె మొహమే చూడనట్లు స్పందించింది ప్రభుత్వం. తను కూడా సమాజసేవకోసమే వెళ్లిందో..టచ్‌లో ఉంటే మంచీచెడ్డా చూసుకుంటారనుకుందో..మొత్తానికి ఆ అనధికార అంబాసిడర్ కూడా సైడైపోయింది పాపం.

