క‌ర్ణాట‌క‌లో కుట్ర జ‌ర‌గ‌బోతోందా?

0
683

భావోద్వేగాలున్న చోట ఓట్ల‌కోసం బ్రహ్మాస్త్రంగా ప్ర‌యోగించేందుకు బీజేపీకి మ‌తం కార్డు ఉండ‌నే ఉంది. విభ‌జించు-పాలించు అనే తెల్లోడి సూత్రాన్ని బాగా ఒంట‌బ‌ట్టించుకున్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నించీ ఈదేశంలో చేస్తున్న‌ద‌దే. ఏడాదిలో మ‌ళ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌లున్నాయి. దేశంలో క‌మ‌ల‌వికాసం జ‌రిగిన‌ట్లే క‌నిపిస్తోందిగానీ అది బ‌లం కాదు వాపేన‌న్న అభిప్రాయం ఉంది. ద‌క్షిణాదిలోనూ తన‌దైన ముద్ర వేయాల‌నుకుంటున్న క‌మ‌లం పార్టీ క‌ర్ణాట‌క‌మీదే అన్ని ఆశ‌లూ పెట్టుకుంది. ఎందుకంటే ఒక‌ప్పుడు ఆ పార్టీకి ద‌క్షిణాన అధికారం క‌ట్ట‌బెట్టింది ఆ రాష్ట్ర‌మే. కానీ ఓ పెద్ద రాష్ట్రం యూపీలా, జానాబెత్తెడు త్రిపుర‌లా మోడీషా వ్యూహం క‌ర్ణాట‌క‌లోనూ ఫ‌లిస్తుంద‌న్న న‌మ్మ‌కం మాత్రం లేదు. అందుకే ఏం చేస‌యినా…ఎంత‌కు తెగించైనా క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి రావ‌డ‌మే దేశంలో త‌న భ‌విష్య‌త్తుకు ముఖ్య‌మ‌నుకుంటోంది బీజేపీ.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీకున్న బ‌లం కంటే ముఖ్య‌మంత్రిగా సిద్ధ‌రామ‌య్య బాగా బ‌ల‌ప‌డ్డారు. సిద్ధ‌రామ‌య్య‌కు పార్టీనే బ‌లం కాదు. కాంగ్రెస్‌కే సిద్ధ‌రామ‌య్య కొండంత బ‌లం అన్న‌ట్లుంది వాతావ‌ర‌ణం. వ్యూహ‌ర‌చ‌న‌లో బీజేపీకంటే నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివాడు సిద్ధ‌రామ‌య్య‌. అందుకే క‌మ‌ల‌నాధుల‌కు కొరుకుడుప‌డ‌ని అస్త్రాల్ని బ‌య‌టికి తీస్తున్నారు. లింగాయ‌త్‌ల‌ని ప్ర‌త్యేక మ‌తంగా గుర్తిస్తూ సిద్ధ‌రామ‌య్య సంధించిన బాణం బీజేపీ గుండెల్లో గుచ్చుకుంది. త‌మ‌కే పేటెంట్ అనుకున్న మ‌తం కార్డుని సిద్ధ‌రామ‌య్య ప్ర‌యోగించ‌డాన్ని బీజేసీ అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతోంది.

తెర‌వెనుక మంత్రాంగం?

సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలోనూ క‌న్న‌డ‌నాట సిద్ధ‌రామ‌య్య ముద్ర ఉండ‌నే ఉంది. ఒక‌ప్ప‌టి బీజేపీ సీఎం య‌డ్యూర‌ప్ప‌లా అవినీతి ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోవ‌టంతో ఏంచేయాలో బీజేపీకి పాలుపోవ‌డంలేదు. యెడ్డీని ప‌క్క‌న పెట్టుకుని బీజేపీ పెద్ద‌లు వ‌ల్లించే నీతిబోధ‌న‌లు వినేందుకు క‌న్న‌డిగులు కూడా సిద్ధంగా లేరు. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ స్ట్రాట‌జీ మార్చి మ‌ఠాలు, గుళ్లుగోపురాల చుట్టూ తిరుగుతూ బీజేపీ ఆశ‌ల‌కు మ‌రింత గండి కొడుతున్నారు.

గెలుపు గ్యారంటీ అన్న న‌మ్మ‌కం బీజేపీకి ఏ కోశానా లేదు. అయినా గెలిచి తీరాలి. అది ఒంట‌రిగానా…త‌ర్వాత జేడీఎస్‌లాంటి పార్టీల్ని క‌లుపుకునా అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. క‌ర్ణాట‌క‌లో కాషాయ‌జెండా మ‌ళ్లీ రెప‌రెప‌లాడాల్సిందేన‌ని పంతంప‌ట్టిన బీజేపీ నెల‌న్న‌ర‌లో ఏదైనా చేయొచ్చన్న‌ది రాజ‌కీయ నిపుణుల అంచ‌నా. ఎన్నిక‌ల షెడ్యూల్ విష‌యంలోనూ బీజేపీ జోక్యం క‌నిపిస్తోంది. మొత్తం 224 స్థానాలకూ మే 12న ఒకే విడతలో ఎన్నికలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 15. అయితే ఎన్నిక‌ల‌క‌మిష‌న్ కంటే ముందే బీజేపీ ఐటి విభాగం చీఫ్ అమిత్ మాల‌వీయ ఎన్నిక‌ల షెడ్యూల్‌ని లీక్ చేసేశారు. బీజేపీ నేత‌ల‌కు ముందే ఎలా తెలిసింద‌ని ఈసీని ప్ర‌శ్నిస్తే. విచారణ జరుపుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మాలవీయేమో టీవీలో చూసిందే ట్వీట్ చేశానంటున్నాడు.

బీజేపీ ఆశ‌లు స‌రే..యెడ్యూర‌ప్ప బ్యాక్‌గ్రౌండే క‌మలానికి మైన‌స్సా?
సిద్ధ‌రామ‌య్య బ్ర‌హ్మాస్త్రం..లింగాయ‌త్‌లు

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌కు స‌రిగ్గా ఒక్క‌రోజు ముందు తమిళనాడుతో పాటు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కేంద్ర ఇంట‌లిజెన్స్‌ విభాగాల నుంచి 500 మంది అధికారులను కేంద్రం మూకుమ్మడిగా కర్ణాటకకు బదిలీ చేసింది. దీన్ని డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి త‌ప్పుబ‌ట్టారు.తమిళనాడులో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కన్నడ భాష తెలియని వీరంతా కర్ణాటకలో ఏ విధంగా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. వీరందరినీ ఇంట‌లిజెన్స్‌ విభాగం పనుల కోసమే బదిలీ చేశారా అన్న అనుమానాలొస్తున్నాయి.

మీరు నేర్పిన విద్య‌యే మోడీషా..

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కున్న అప‌శ‌కునం ఒక్క‌టే. ఒకే పార్టీ వెంట‌వెంట‌నే అధికారంలోకి వ‌చ్చిన చ‌రిత్ర క‌ర్ణాట‌క‌కు మూడు ద‌శాబ్ధాల్లో లేదు. మరి ఆ ఆన‌వాయితీని సిద్ధరామయ్య మార్చ‌గ‌ల‌రా అన్న‌దే ఆసక్తికరం. మ‌రోవైపు బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఇప్పటికే నియోజకవర్గానికి ఆరుగురు నేతలను బాధ్యులుగా పెట్టారు. ఎలాగైనా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెర‌వెనుక చేయాల్సిందంతా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ గెల‌వాలి. లేదంటే హంగ్ అసెంబ్లీకి అవ‌కాశ‌మొస్తే ఆ ఛాన్స్‌ని బీజేపీ వ‌దులుకోదు. అదే జ‌రిగితే జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుంది. ఆ పార్టీ బీజేపీ వైపు మొగ్గే అవకాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి