ఆ మధ్య ఓ బాలిక రేప్ అండ్ మర్డర్ పాకిస్తాన్‌ని కుదిపేసింది. ఏడేళ్లబాలికను మాయమాటలతో తీసుకెళ్లి అత్యాచారం చేసి పైశాచికంగా హింసించి హతమార్చాడో నరరూపరాక్షసుడు. పాకిస్తాన్‌లో అరాచకాలు, దారుణాలు కొత్తకాకున్నా ఆ సంఘటన మాత్రం యావత్ దేశాన్ని కుదిపేసింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు మొత్తానికి నేరస్తుడి పట్టుకోగలిగారు. ఏళ్లతరబడి విచారణలతో సాగదీయకుండా ఆ కిరాతకుడికి మరణశిక్ష విధించింది కోర్టు. ఒకసారి కాదు…నాలుగుసార్లు మరణదండన.

ఏడేళ్ల బాలికని దారుణాతిదారుణంగా లైంగికంగా హింసించి హతమార్చాడు ఇమ్రాన్ అలీ అనే నరరూప రాక్షసుడు. ఏడేళ్ల జైనాబ్ అమీన్‌ని మాటలతో మభ్యపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి తెగబడ్డాడు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసి ఆ బాలిక దేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు. లాహోర్ సెంట్రల్ జైల్లో కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడు ఇమ్రాన్అలీకి నాలుగు మరణశిక్షలతో పాటు జీవిత ఖైదు, రూ. 32 లక్షల జరిమానా విధించారు.

బాలిక హత్యతో దొరికిపోయిన ఇమ్రాన్‌కి అనేక నేరాలతో పాటు టెర్రరిస్టులతోనూ సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఏడేళ్ల జైనాబ్ అమీన్‌ను జనవరి 4న కిడ్నాప్ చేశాడు ఇమ్రాన్ అలీ. అనంతరం బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటనతో పాకిస్తాన్‌లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని పోలీసు వ్యవస్థ ఎందుకని ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను వేగంగా ముగించింది.

