చంద్ర‌బాబుకు ప‌క్క‌లో బ‌ల్లెం!?

0
508

విభ‌జ‌న చ‌ట్టం హామీల్ని ప‌ట్టించుకోక‌పోయినా, చేసింది అర‌కొరేఅయినా ఎంతో చేశామ‌ని ద‌బాయిస్తున్న కేంద్ర‌పెద్ద‌లు…ఏపీకి ఇచ్చామ‌ని చెప్పుకునేందుకు ఇంకో కోరుకోని వ‌రాన్ని ఇవ్వ‌బోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందునుంచీ ఉన్న న‌ర‌సింహ‌నే ఇప్ప‌టికీ తెలుగురాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్నారు. అడిగిన స‌మాచారాన్ని వెంట‌నే కేంద్ర పెద్ద‌ల‌కు చేర‌వేస్తూ…పిలిచిన‌ప్పుడ‌ల్లా ఢిల్లీలో వాలిపోయి వాళ్ల చెవులు కొరికేసి వ‌స్తున్నారు ఈ మాజీ ఐపీఎస్‌. ఆయ‌న‌మీద అసంతృప్తి ఉన్నా, ఏపీకి వేరే గ‌వ‌ర్న‌ర్‌ని ఇస్తే బావుంటుంద‌ని చంద్ర‌బాబుకున్నా ఇప్పుడున్న స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల్లో ఆ ప్ర‌స్తావ‌న మ‌రుగున‌ప‌డిపోయింది. కానీ కేంద్రం మాత్రం త‌న అవ‌స‌రాల‌కోసం త‌క్ష‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్‌ని నియ‌మించే ఆలోచ‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

న‌ర‌సింహ‌న్ రేంజ్ కాక‌పోయినా కాస్త కుడెడంగా అలాంటి నేప‌థ్య‌మే ఉన్న గ‌వ‌ర్న‌ర్‌ని ఏపీపై వ‌ద‌ల‌బోతోంద‌ట కేంద్ర‌ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఒక‌ప్ప‌టి ఫైర్‌బ్రాండ్ పోలీస్ ఆఫీస‌ర్ కిరణ్ బేడీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి పంపాల‌నే ఆలోచ‌న‌తో కేంద్రం ఉందంటున్నారు. ఏపీలో అన్ని స‌మ‌స్య‌లూ తీరిపోయిన‌ట్లు..మిగిలింది ఇక గ‌వ‌ర్న‌రే అన్న‌ట్లు ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్‌ని నియ‌మించాల‌ని ఏపీ బీజేపీ నేత‌లు ఇదివ‌రకే కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు గత జనవరిలోనే దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ రాజ్‌భ‌వ‌న్‌నుంచి ప‌నిచేస్తున్న గవర్నర్ నరసింహన్ ఏపీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని, ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ ఉంటే బాగుంటుందనేది అప్ప‌ట్లో ఆ లేఖ సారాంశం.
న‌ర‌సింహ‌న్ అయితేనే అనుకూలంగా ఉంటుంద‌నుకుందో…రాజ‌ధానితో పాటు రాజ్‌భ‌వ‌న్ కూడా లేని ఏపీకి అప్పుడే గ‌వ‌ర్న‌ర్ అవ‌స‌రం ఏముంద‌నుకుందో కానీ ఇప్ప‌టిదాకా కేంద్రం దీన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే నెల‌రోజులుగా చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఏపీపై గురిపెట్టిన కేంద్రం గ‌వ‌ర్న‌ర్‌గా కిర‌ణ్‌బేడీని రంగంలోకి దించాల‌నే ఆలోచ‌న‌కొచ్చింది. కేంద్ర కేబినెట్ నుంచి తెలుగుదేశం మంత్రుల రాజీనామా, ఎన్డీయేకి టీడీపీ గుడ్‌బై చెప్పడం, కేంద్రంతో ఏపీ ప్ర‌భుత్వం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ‌టంతో..గవర్నర్ల మార్పు అనివార్యం కావచ్చంటున్నారు. ఏపీకి కిరణ్ బేడీని గవర్నర్‌గా పంపడం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మ‌కు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందన్న ఆలోచ‌న‌తో కేంద్రం ఉందంటున్నారు.

ఏపీలో రాజ్‌భవన్ నిర్మాణం జరిగేంతవరకూ తాత్కాలిగంగా గవర్నర్‌కు సౌకర్యాలు కల్పించవచ్చని బీజేపీ నేతలు అధినాయ‌క‌త్వానికి చెచెప్పినట్టు సమాచారం. అయితే కిర‌ణ్‌బేడీతో పాటు మరో ముగ్గురి పేర్లను కూడా ఆర్ఎస్ఎస్‌ కేంద్రానికి సిఫార్సు చేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు తెలంగాణ గవర్నర్‌గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేషన్) సీవీఎస్‌కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉందని చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే తెలుగురాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కంపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌వ‌చ్చు. మ‌రి లాంగ్ స్టాండింగ్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఎటెళ‌తారో?