నిద్ర‌చాల‌క‌పోతే హార్ట్ ట్ర‌బుల్‌

0
651

ఏ మ‌నిషికైనా క‌నీసం ఆరేడుగంట‌ల నిద్ర అవ‌స‌రం. అది కూడా డీప్ స్లీప్ అయితేనే ఉద‌యాన్నే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే అవ‌కాశం ఉంటుంది. రాత్రివేళ కంటి నిండా కునుకు లేకుంటే మర్నాడంతా అలసట, నిరుత్సాహం ఆవహించడం సహజం. నిద్రలేమి తీవ్ర అనారోగ్య సమస్యల‌కు దారితీస్తుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిళ్లు ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే హృద్రోగాల ముప్పు ఉన్న‌ట్లే లెక్క‌. ఇక నిద్ర మధ్యలో లేవడం..ముందుగానే మేలుకోవడం హార్ట్‌ అటాక్‌ ముప్పుని రెండింతలు చేస్తుందని చెబుతున్నారు. దాదాపు 13వేల మందిలో నిద్ర అలవాట్లను పర్యవేక్షించిన జపనీస్ సంస్థ నిద్ర ఎంత ముఖ్య‌మో నొక్కిచెప్పింది.

నిద్రలేమి కార్డియోవాస్కు‍లర్‌ వ్యాధికి దారితీస్తుందని హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకుల ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంది. బార్సిలోనా యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ కాంగ్రెస్‌లో దీనిపై చ‌ర్చ జ‌రిగింది. అర్ధ‌రాత్రి దాకా టీవీలు చూస్తూనో, మొబైల్ చాటింగుల్లోనో గ‌డిపేస్తూ టైంకి నిద్ర‌పోక‌పోతే మ‌న గుండెకి మ‌న‌మే ముప్పు కొనితెచ్చుకున్న‌ట్లే. జీవనశైలి మార్చుకుని, స‌మ‌తులిత ఆహారం తీసుకుంటూ ఆల్కహాల్‌కు దూరంగా ఉంటూ ఒత్తిడిని తగ్గించుకుంటే రాత్రి న‌డుంవాల్చ‌గానే నిద్ర‌ప‌డుతుందంటు న్నారు నిపుణులు.