
కృష్ణ మృతదేహం..
నవతరం, కాకినాడ: గ్రామీణం వాకలపూడి పంచాయతీ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషన్‌లోని మస్టీఫ్ గుత్తేదారు సంస్థలో నాలుగేళ్లుగా ఒప్పంద హౌస్‌కీపింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కడింపల్లి కృష్ణ(41) ఆదివారం విధి నిర్వహణలో ఉండగా కుప్పకూలి పడిపోయాడు.
వెంటనే సిబ్బంది కంపెనీ అబులెన్సులో నాగమల్లితోట కూడలిలోని ఇనోదయా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. ప్రత్తిపాడు మండలం చింతలూరుకు చెందిన కృష్ణకు భార్య నాగమణి, ఇంటర్ చదువుతున్న కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. అతని మృతి ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని, తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేయడంతో సర్పవరం సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బదోబస్తు ఏర్పాటు చేశారు. గుత్తేదారు సంస్థ ప్రతినిధులు వారితో చర్చించి, కృష్ణ భార్యకు బీమా ద్వారా రూ.5.5లక్షలు, గుత్తేదారు సంస్థ నుంచి రూ.6.5లక్షలు, సర్వీస్ కాలానికి (మరణించిన కార్మికుడి జీతంలో) 90శాతంతోపాటు, మట్టి ఖర్చులు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సర్పవరం సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మృతుని బావమరిది చినబాబు తన బావ కృష్ణ కంపెనీలో ఫ్లోర్ శుభ్రంచేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడని, ఆసుపత్రికి తరలించగా చనిపోయనట్లు డ్యూటీ డాక్టరు తెలిపారని.. తగిన చర్యలు కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామన్నారు.

