ఆ లోటొక్క‌టే మిగిలిపోయింది..

0
503

అందాల‌తార శ్రీదేవి తన కూతుళ్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఝాన్వీ, ఖుషీల విష‌యంలో ఓ త‌ల్లిగానే కాదు వారి భ‌విష్య‌త్తుకోసం ఎంత‌గానో త‌పించారు. పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం గురించి కూడా ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. హీరోయిన్‌గా దశాబ్దాల‌పాటు సినీ పరిశ్రమలో కొనసాగిన శ్రీదేవి తన కూతురి తెరంగేట్రం గురించి ఎంతో సంఘ‌ర్ష‌ణ‌ప‌డ్డారు. భావోద్వేగానికి గుర‌య్యారు.

త‌న స్థాయికి కూతురిని సిన్మాల్లోకి తీసుకురావ‌డం శ్రీదేవికికానీ, నిర్మాత‌గా బాలీవుడ్‌లో ప‌లుకుబ‌డి ఉన్న బోనీక‌పూర్‌కి గానీ పెద్ద ప‌నేంకాదు. కానీ సిన్మాల్లోకొస్తే కూతురు కూడా త‌న‌లా చెర‌గ‌ని ముద్ర వేయాల‌న్న‌దే శ్రీదేవి టార్గెట్‌. కూతురి సినీ ప్ర‌వేశం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘ ఝాన్వీ సినీ రంగాన్ని ఈ వృత్తిగా ఎంచుకుంది. నేను ఎంతోకాలంగా ఈ పరిశ్రమలో ఉన్నాను. తను నన్ను చూస్తూ పెరిగింది. సినీ రంగంలోకి రావడమంటే ఏమిటో తనకు తెలుసు. ఏ వృత్తిలోనైనా ఏది అనుకున్నంత సులువు కాదు. తను చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అని శ్రీదేవి వ్యాఖ్యానించింది.

కూతురి సినీరంగ ప్ర‌వేశంపై ప్ర‌తీ అడుగు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న శ్రీదేవి .. కొద్ది నెలల్లో ఝూన్వీ వెండితెరపై కనిపించ‌బోతున్న స‌మ‌యంలో త‌ను క‌న్నుమూయ‌డం ఊహించ‌ని విషాదం. ఇషాన్‌ కట్టర్‌ సరసన ‘ధడక్‌’ సినిమాతో ఝాన్వీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది జూన్ త‌ర్వాత సినిమా విడుదల కానుంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బిడ్డ తొలి సినిమాలో ఎలా నటించిందీ. ప్రేక్ష‌కులు ఆమెని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో చూడ‌క‌ముందే తిరిగిరాని లోకాల‌కు చేరిపోయింది శ్రీదేవి. త‌ల్లినే గురువుగా చూసుకున్న ఝూన్వీకి ఇది నిజంగా తీర‌నిలోటే.