మీడియా ఓవ‌రాక్ష‌న్‌..

0
796

నాలుగు ద‌శాబ్దాల‌పాటు వెండితెర‌నేలిన అందాల‌న‌టి శ్రీదేవి అర్ధంత‌రంగా నిష్క్ర‌మించింది. త‌న భ‌ర్త మేన‌ల్లుడి పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అనూహ్య ప‌రిస్థితుల్లో మృత్యువాత‌ప‌డ‌టం, ఆమె భౌతిక‌కాయం ఎప్పుడు వ‌స్తుందో తెలీక ఆత్మీయులు, బంధుమిత్రులు, అభిమానులు మూడ్రోజుల పాటు త‌ల్ల‌డిల్ల‌టం అత్యంత విషాద‌క‌రం. దుబాయ్ ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సు చేసుకుని శ్రీదేవి భౌతిక‌కాయాన్ని వెంట‌నే స్వ‌దేశానికి పంపించాల‌ని కోరుకోని మ‌నిషి లేడు…బ్రేకింగ్‌కు మొహంవాచి ఉన్న మీడియా త‌ప్ప‌.

బ్లేజ‌ర్‌తో బాత్‌రూంలో ఏంట‌మ్మా..ట‌వ‌ల్ చుట్టుకోవాల్సింది..

శ్రీదేవికి, బోనిక‌పూర్‌కి మ‌ధ్య స‌వాల‌క్ష ఉండొచ్చు. వారిద్ద‌రూ అగ్నిసాక్షిగా దాంప‌త్య‌బంధాన్ని పెన‌వేసుకున్న భార్యాభ‌ర్త‌లు. ఆ మాట‌కొస్తే ఈ దేశంలో పొర‌పొచ్చాలు లేని దంప‌తులున్నారంటే మొహాలు చూసుకోవాల్సిందే. పెళ్లి వేడుక‌లో శ్రీదేవి ఎందుకు మ‌నో వ్య‌థ‌కు గురైందో, భ‌ర్త‌తో పాటు వెంట‌నే ఇండియాకి ఎందుకు తిరిగొచ్చేయ‌లేదో అది పూర్తిగా ఆమె ప‌ర్స‌న‌ల్‌. మ‌రీ బాత్‌ట‌బ్‌లో మునిగి చ‌నిపోవ‌డ‌మేంటంటో కోరి వ‌చ్చిన మృత్యువుకి అది బాత్‌రూం అయినా, బెడ్‌రూం అయినా ఒక్క‌టే. ఓ ప‌క్క శ్రీదేవికి మ‌ద్యం అల‌వాటు లేద‌ని ఆమెను బాగా ఎరిగిన‌వారు చెబుతుంటే…క్వార్ట‌రా? హాఫా? లేక‌పోతే ఫుల్లా? అంటూ మీడియా ఊహాగానాలు. అంచ‌నాలు. అస‌లామెని చంపేందుకే బోనీక‌పూర్ మ‌ళ్లీ దుబాయ్ వెళ్లి ఉంటాడ‌న్న అనుమానాలు రేకెత్తించే బ్రేకింగ్‌లు. ఓ ద‌శ‌లో హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అంటూ ప‌నికిమాలిన చ‌ర్చొక‌టి.

ముక్కు మూసుకుని ట‌బ్‌లో మునగాల్సింది

54 ఏళ్ల మ‌హిళ‌కు అనారోగ్యాలు ఉండ‌కూడ‌ద‌న్న రూలేమ‌న్నా ఉందా? సెల‌బ్రిటీలు శారీర‌క రుగ్మీత‌ల‌కు అతీతులా? ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించాల్సిన మీడియా రేటింగ్ మీటర్ లేపితే ఈవారం టార్గెట్ పూర్త‌యిన‌ట్లేన‌ని నిస్సిగ్గుగా తెగ‌బ‌డ‌టంపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు పెల్లుబికాయి. ఇక బీజీల్లోనైతే ఒక్కో ఛాన‌ల్ క్రియేటివిటీ హాలీవుడ్‌ని మించిపోయింది. ఒక యాంక‌ర్ బాత్‌ట‌బ్‌లో నిల‌బ‌డి ప్ర‌జంటేష‌న్ ఇస్తే చూసేవాళ్ల‌కు క‌డుపు మండిపోయింది. ఒంటికో ట‌వ‌ల్ చుట్టుకుని, స‌బ్బు నుర‌గా పులుముకుని చెప్పుంటే అదిరిపోయేదంటూ సోష‌ల్‌మీడియాలో సెటైర్లు పేలాయి.


పందుల్లా బ‌తుకుతున్న మ‌నుషుల‌కేం తెలుసు నీ ఆత్మ‌సౌంద‌ర్య ప‌రిమ‌ళం?

అనుమానాలకు తెర‌దించుతూ చివ‌రికి అది దుర్ఘ‌ట‌నేన‌ని తేలిపోయి…శ్రీదేవి భౌతిక‌కాయం ముంబై చేరుకున్నాక‌యినా మీడియా అతి త‌గ్గిందా అంటే అదీ లేదు.ఆమె నిర్జీవ దేహాన్ని, నిశ్చ‌ల‌మోముని చూపేందుకు పోటీలు…దొరికిన విజువ‌ల్ ఎక్స్‌క్లూజివ్ అంటూ బ్రేకింగ్‌లు. త‌మ‌ను ప్ర‌శాంతంగా బాధ‌ప‌డ‌నివ్వ‌మంటూ శ్రీదేవి కుటుంబ‌స‌భ్యులు బ‌తిమాలుకునే ప‌రిస్థితికి కార‌ణ‌మైంది మ‌న ద‌గుల్బాజీ మీడియా. ఇప్ప‌టికే మీడియా అంటే కాండ్రించి మొహాన ఉమ్ముతున్నారు. క‌న‌బ‌డితే బ‌డిత‌పూజ చేసే ప‌రిస్థితి తెచ్చుకుంటారేమో చివ‌రికి!

మాన‌వ‌త్వం ఎప్పుడో చ‌చ్చిపోయింది..నీలాంటి మంచివాళ్ల‌కిక్కడ చోటులేదు..