తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలకు వెటరన్ జర్నలిస్టుల సమస్యలు పట్టవా?..

0
193

తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలకు వెటరన్ జర్నలిస్టుల సమస్యలు పట్టవా? – దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని కలం సైనికుల కన్నీటి గాథ…

పాలక ప్రభుత్వ పక్షాలు మారుతూనే ఉన్నా వీరి బతుకులు మారని వైనం – 60 ఏళ్లు నిండిన పిదప ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు – కనీస పెన్షన్, ఆరోగ్య భద్రత, శాశ్వత గృహ వసతి కల్పించకుండా కాలయాపన – ప్రజాస్వామ్య నాలుగో స్తంభానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై సర్వత్రా ఆవేదన.

నవతరం, శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలకు వెటరన్ జర్నలిస్టుల సమస్యలు పట్టవా అనే ప్రశ్న నేడు జర్నలిస్టు లోకంలోనే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిలో తీవ్రంగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక హామీలు గుప్పిస్తూ, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలక ప్రభుత్వ పక్షాలు మారుతూనే ఉన్నా, ముఖ్యమంత్రులు మారుతూనే ఉన్నా దశాబ్దాలుగా కలం పట్టి ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా నిస్వార్థంగా, నిరంతరం పనిచేసిన కలం సైనికుల సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది.

దశాబ్దాల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం, అవినీతి అక్రమాలను ఎండగట్టడం కోసం, అణగారిన వర్గాల గోసను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసం అహర్నిశలు శ్రమించి, తమ జీవితాలను సైతం త్యాగం చేసిన సీనియర్ జర్నలిస్టులు నేడు 60 ఏళ్లు నిండిన తర్వాత అత్యంత దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. ఒకవైపు వయసు పైబడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆదాయం లేకపోవడం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కళ్ళద్దాలు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, చేతిలో డబ్బు లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి. ఎందరో సీనియర్ జర్నలిస్టులు సరైన వైద్యం అందక, ఆర్థికంగా ఆదుకునే వారు లేక కఠినమైన పరిస్థితులలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు, కానీ వారి కుటుంబీకులు పడుతున్న వేదన మాత్రం వర్ణనాతీతం, అంతులేనిది.

సామాన్య పౌరులకు, రైతులకు, వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న కనీస పెన్షన్, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యశ్రీ, శాశ్వత గృహ వసతి, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలను కూడా దశాబ్దాలుగా మీడియా రంగంలో శ్రమించిన వెటరన్ జర్నలిస్టులకు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా కాలయాపన చేయడం దురదృష్టకరం, శోచనీయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా రంగంలో దశాబ్దాలు శ్రమించి ఆరు పదులు నిండిన తర్వాత కూడా వారికి కనీస సంక్షేమాన్ని కల్పించలేని పరిస్థితులలో ప్రజాస్వామ్య పాలకుల తీరు తీవ్ర ఆవేదనను మిగులుస్తోంది.

ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, రూ.10 వేల పెన్షన్, ఉచిత వైద్యం, ప్రమాద బీమా అంటూ హామీలు మాత్రమే ఇస్తూ, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్న తీరుతో అధిక శాతం మంది సీనియర్ జర్నలిస్టులు ఆశలతోనే కాలాన్ని లెక్కించుకుంటూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. అక్రిడిటేషన్ ఉన్నవారికే సంక్షేమం అంటూ నిబంధనలు పెట్టి గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులను పక్కన పెట్టేస్తున్నారు. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా 20 ఏళ్లు పైబడి వృత్తిలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు 60 ఏళ్ల తర్వాత కనీస నెలకు రూ.15 వేల గౌరవ పెన్షన్, కుటుంబం మొత్తానికి ఉచిత హెల్త్ కార్డులు, జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెటరన్ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

ఆశిద్దాం, ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలకు వీరి కష్టాలు కనువిప్పు కలిగి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించి తక్షణమే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారని, కలం సైనికుల జీవితాల్లో వెలుగులు నింపుతారని జర్నలిస్టు లోకం ఎదురుచూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here