కన్ను గన్నులా ఉండటమేంటన్న ప్రశ్నకు ఈ పిల్ల కొన్ని సెకన్లలో జవాబు చెప్పేస్తోంది. సోషల్‌మీడియాలో వైరల్ అయిపోయింది జున్ను ముక్కలాంటి ఈ మళయాళీ ముద్దుగుమ్మ. కేవలం 25 సెకన్లున్న వీడియో క్షణాల్లో కోట్లమంది హృదయాల్ని కొల్లగొట్టేసింది. చచ్చేముందు చివరికోరిక ఏంటని అడిగితే ఓసారి ఈ పిల్ల మాకేసి ఇలా చూస్తే చాలనేంత క్యూట్‌గా కన్ను గీటింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క స్టిల్‌తో ఈ కేరళకుట్టి గురించి టాలీవుడ్ టూ బాలీవుడ్…ఆ మాటకొస్తే ఆల్ ఉడ్స్ ఆరా తీస్తున్నాయి.
బస్సులో మనసుపడ్డ కుర్రాడు ఓరచూపులు చూస్తుంటే కొన్ని సెకన్లపాటు ఏంటన్నట్లు కనుబొమ్మల పైకెత్తి ప్రశ్నించి…తర్వాత మనసారా నవ్వుతూ కన్నుకొట్టిన అరనిమిషం కూడా లేని వీడియో సోషల్‌మీడియాలో నెటిజన్లంతా ఫిదా అయిపోయేలా చేసింది. ఒక్క చిన్న వీడియోతో దేశమంతా పాపులర్ అయిపోయింది 18 ఏళ్ల ప్రియా. మొన్నటిదాకా ఎవరికీ తెలీదు ఈ అమ్మాయెవరో. త్రిసూర్‌లోని విమలా కాలేజీలో బీకాం చదువుతోందీ పిల్ల. హీరోయిన్ కావాలన్నది టార్గెట్. ఈలోపు మోడలింగ్ చేస్తూ మోహినీఆట్టం నేర్చుకుంటోంది.

మొత్తానికి హీరోయిన్ కావాలనే కల ఓ సిన్మాతో నెరవేరింది. ఓరు అడార్ లవ్ అనే సిన్మాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు జనమంతా పోటీలు పడి సెర్చ్ చూస్తున్న వీడియో క్లిప్ ఆ సిన్మాలోదే. ఇంకా ఒక్క సిన్మా కూడా చేయనేలేదు. తన క్యూట్ లుక్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ని పడేసింఇ ప్రియా ప్రకాష్ వారియర్. లెక్కలేనన్ని క్లిక్కులతో అప్పుడే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ఈ అప్‌కమింగ్ హీరోయిన్‌కి. ఈ ఊపులో ఎన్ని సిన్మాల్లో ఛాన్స్ కొట్టేస్తుందో ఏంటో! లక్కంటే ఇదే మరి.

