మంత్రి అచ్చెన్నాయుడు “రా” వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం… పరువు తక్కువ రాజకీయమా?

0
2

రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు..

ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏకవచన దాడి… వైసీపీలో భగ్గుమన్న ఆగ్రహం…

“మాటే మంత్రం… మాటే వేటు” – మంత్రి నోటి దురుసుపై సర్వత్రా విమర్శలు.

ఐదేళ్లు సీఎంగా పాలించిన నేతపై ఇలాంటి భాషేనా? ప్రజాస్వామ్య మర్యాదలు ఏమయ్యాయి?
పదవి ఉందని అహంకారమా? అధికారం శాశ్వతం కాదని మరిచారా?.




నవతరం, శ్రీకాకుళం: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఉద్దేశించి “రా” అంటూ ఏకవచనంలో సంబోధించడం ఇప్పుడు ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ విమర్శలకు కూడా ఒక భాష, ఒక హద్దు ఉంటుంది. ప్రత్యర్థిని విమర్శించేటప్పుడు విధానాలను విమర్శించాలి తప్ప వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, చులకన చేసేలా మాట్లాడకూడదనేది ప్రజాస్వామ్య సూత్రం. మంత్రి అచ్చెన్నాయుడు ఉపయోగించిన “రా” అనే పదం సాధారణ పదం కాదు, అది ఒక నాయకుడి స్థాయిని తక్కువ చేసి చూపించే ప్రయత్నమని, ఇది పదవుల అహంకారానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దివంగత మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్సార్ వారసుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు చారిత్రక సంక్షేమ పాలన అందించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో కారణాలేవైనా సీట్లు తగ్గినంత మాత్రాన ఆయన చరిత్ర తగ్గిపోతుందా? నేటికీ సింగిల్ పార్టీగా రాష్ట్రంలో అత్యధిక జనాదరణ కలిగిన నేత ఆయనే అనేది కాదనలేని వాస్తవం. అలాంటి వ్యక్తిపై ఇలాంటి భాష ఉపయోగించడం రాజకీయ పరిపక్వత అనిపించుకోదు.

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు జగన్‌ను అభిమానించే లక్షలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తల హృదయాల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కార్యకర్తలను ఆవేశాలకు లోనయ్యేలా చేసి, రాష్ట్రంలో ప్రశాంతతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ఒక మాటతో రాష్ట్ర ప్రశాంతతనే దెబ్బతీయవచ్చు, మాట తూటా కంటే ప్రమాదం అనే సామెతను మంత్రి మరిచినట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పశుసంవర్ధక, మత్స్యకారుల ఇబ్బందులు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మంత్రిగా తన శాఖలో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదని అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు. అసలు ఈ సృష్టిలో జీవితమే శాశ్వతం కాదు, ఇక పదవులు ఎంత? అధికారం ఉందని విర్రవీగడం, పదవుల అహంకారంతో నోరు జారడం ఎవరికీ మంచిది కాదు. వ్యక్తి యొక్క ప్రత్యేకత, గౌరవం పదవితో రావు, ప్రవర్తనతో వస్తాయి. విమర్శలు చేయాలి, తప్పకుండా చేయాలి. కానీ ఆ విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి తప్ప, ఎదుటి వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టేలా, వ్యక్తిగత కక్షలకు దారి తీసేలా ఉండకూడదు. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. మొత్తంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చిచ్చుకు ఆజ్యం పోశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here