రోమాలు నిక్కబొడుచుకునే స్టోరీ. నిజంగానే జరిగితే పరిస్థితేంటన్న ఊపిరి బిగబట్టేంత సస్పెన్స్. వినేందుకేమో అచ్చం సిన్మా స్టోరీలాగే ఉంది.
కానీ వెండితెరపై వేషాల్లేక ప్రత్యేకహోదా పోరాటాన్ని భుజానేసుకున్న శివాజీ ఏమో రియల్ పిక్చర్ అంటున్నాడు. అధికారంకోసం, తన రాజకీయ ప్రయోజనాలకోసం ఏ గడ్డి కరవడానికైనా బీజేపీ కుట్ర గురించి కాబట్టి పూర్తిగా కల్పితమనో, ఊహాగానమనో కొట్టి పారేయలేని పరిస్థితి. నిజంగా శివాజీ చెప్పిన ఆపరేషన్లకు కమలనాథులు తెగబడితే ఏపీ ఏమైపోతుందో ఏమో?!

టార్గెట్ ఏపీగా బీజేపీ ఆపరేషన్ ఎలా ఉండబోతోందో బోర్డుమీద బడిపంతులులా దశలవారీగా రాస్తూ వివరించాడంటే కచ్చితంగా సిన్మా స్టోరీ అయితే కాదు. ఎంతో కొంత సమాచారం ఉంది. అందులో ఎన్డీఏ నుంచి తప్పుకుని అవిశ్వాస నోటీసులిచ్చి దేశవ్యాప్తంగా తమ పరువుని బజారుకీడ్చిందని టీడీపీపై , చంద్రబాబుపై బీజేపీ రగిలిపోతోంది. సో..అసాధ్యమనో, జరిగే పని కాదనో తేలిగ్గా తీసి పారేయలేమన్నమాట. మోడీషాల సహజ లక్షణాన్ని బట్టి ఏపీతో పాటు..దక్షిణాదిలో పాగావేసేందుకు, సాధ్యంకాకపోతే అస్థిరత సృష్టించయినా తమ ఒళ్లో కూర్చునే పార్టీని ప్రోత్సహించేందుకు అవకాశాలు లేకపోలేదు.

టార్గెట్ చంద్రబాబేనా? రాజకీయంగానా? వ‌్యక్తిగతంగానా?
సెప్టెంబరు 1. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓ జాతీయపార్టీ (కల్లుకొచ్చి ముంత దాచడమెందుకో..అది బీజేపీనే) కుట్ర పన్నిందనేది శివాజీ చెప్పిన బ్రేకింగ్ న్యూస్. బీహార్, ఒడిశా వ్యక్తులతో ఏపీలో అల్లర్లకు కుట్ర పన్నుతున్నారని, సోషల్‌మీడియాలో అధికార పార్టీపై దుష్ప్రచారం ఆపరేషన్‌లో భాగమేనంటున్నాడు శివాజీ . ఓ జాతీయపార్టీ నేతని ఏపీకి సీఎంని చేయాలనే ప్లాన్‌తో ఉన్నారనేది శివాజీకున్న సమాచారం. ఓ కీలక నాయకుడిపై భౌతికదాడి జరగొచ్చని, దీనికి సంబంధించిన రెక్కీ కూడా జరిగిపోయిందని మరో బిగ్ బ్రేకింగ్ చెబుతున్నాడు శివాజీ.
దక్షిణాదిలో పాగా వేసేందుకు చేపట్టిన కార్యక్రమానికి పెట్టుకున్న ముద్దు పేరు ఆపరేషన్ ద్రవిడ. అందులో ఆపరేషన్ గరుడ అంటే రెండు తెలుగురాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం. అలాగే కర్ణాటకలో ఆపరేషన్ కుమార, తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ. ఈ ఆపరేషన్‌కి టోటల్ బడ్జెట్ దగ్గరదగ్గర 5వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ మీద కసితో రగిలిపోతున్న బీజేపీ ఏపీనే మెయిన్ టార్గెట్‌గా ఎంచుకుంటుందన్నది శివాజీ డౌట్.

బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా చంద్రబాబు చాణక్యం ముందు నిలబడగలుగుతుందా అన్నదే ప్రశ్న. అయితే సీబీఐ, ఈడీ వంటి నిఘావిభాగాలతో ఇబ్బందులు పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. దుమ్ము కొట్టుకుపోయిన ఓటుకునోటు లాంటి కేసుల్ని బయటికి తీసే ఛాన్స్ ఉంది. బహుశా ఈ ఆపరేషన్ గురించి ముందే గ్రహించనందుకో ఏమో…కేంద్రం ఎంతకైనా తెగిస్తుందనీ, తనని ఇబ్బందులుపెట్టే అవకాశముందనీ చంద్రబాబు వారంరోజులుగా ముందే భుజాలు తడుముకుంటున్నారు. నిప్పని చెప్పుకుంటున్నారు. వాళ్ల చెయ్యే కాలుతుంది. డోంట్‌వర్రీ!

