తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారా…

0
382

తెలుగు రాష్ట్రాల్లో నిన్నే ఉపఎన్నికలు ముగిశాయి. ఏపీలోని బద్వేల్ బైపోల్, తెలంగాణలోని హుజురాబాద్ ఎమ్మెల్యే స్థానాల బైపోల్ జరిగింది. అంతలోనే మరో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడులయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇక తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండడంతో.. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో.. మెజారిటీ స్థానాలను ఆయా పార్టీలే గెలుచుకునే అవకాశముంది.

కాగా, శనివారం ఏపీలో బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం.. ఎన్నికల అధికారులు ఈవీఎంలను బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. వర్షం వల్లే పోలింగ్ తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. దొంగ ఓట్లు భారీగా వేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. వైసీపీపై బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు.
కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా ఉన్న తెలంగాణలోని హుజురాబాద్ నియోజకర్గానికి కూడా శనివారం పోలింగ్ జరిగింది. పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.33శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయింది. పెరిగిన ఓటింగ్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది తెలియాల్సి ఉంది. నవంబరు 2న బద్వేల్, హుజురాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా హుజురాబాద్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.