- వారి వ్యాపారం ముడుపువ్వులు… ఆరుకాయలు
- అక్కడ అన్నీ దొరుకుతాయి
- ఇడ్లీ నుండి, క్వార్టర్ సీసా వరకు
- బావా ఓ సారి ఇటు రా.. టిఫిన్ చేసి పో, కావాలనే మందు పోస్తా..
- ఇటువైపు మామలు వచ్చినా ఏం చేయరు
- వింతపోకడలకు పోతున్న సిరి టిఫిన్ సెంటర్
- అర్ధరాత్రిళ్ళు తెరిచివుంటున్న ‘సిరి టిఫిన్ సెంటర్’
- అటువైపు కన్నెత్తి చూడని స్థానిక పోలీసులు
- రోజుకింత, వారానికింత అంటూ వసూళ్లకు పాల్పడుతున్న మామలు
- ఎన్ని గొడవలు జరిగినా ఏం కాదంటున్న హోటల్ యాజమాన్యం
- మొదటి హాల్ లో టిఫిన్, వంట రూమ్ లో మద్యం
- రోజుకు లక్ష దాటుతున్న కౌంటర్
- పన్నెండు మంది పనోళ్ళు
- రాత్రి అల్లుడు, పగలు మామ కౌంటర్ చూసుకుంటారు
- దసరా సెలవుల్లో మాత్రం కొత్త కథ
- ఫిర్యాదు చేయటానికి జంకుతున్న కాలనీవాసులు
- ఇకనైనా చర్యలు తీసుకుంటారా.. లేదా..
- లేదంటే ఫిర్యాదు చేస్తామంటున్న సామాజిక కార్యకర్తలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీకి ఆనుకుని వున్న అడ్డగుట్టలో అడ్డగోలు అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ లక్షలు దండుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. స్థానిక అర్జున్ థియేటర్ కి ఎదురుగా వున్న ఓ టిఫిన్ కేంటర్ లో ఇడ్లీ, సాంబార్ మొదలు కొని అక్రమ మద్యం ఎరులై పారుతుంది. రోజులో ఇరవై నాలుగు గంటలు ఏ హోటలైనా తెరిచి వుంటుందా అంటే.. అవుననే చెప్పాలి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వున్న ‘సిరి టిఫిన్ సెంటర్’ అర్ధరాత్రిళ్ళు తెరిచి వుంచి, స్థానిక పోలీసులకు సవాలుగా మారుతూ, రోజుకో పంచాయతీ పెడుతుంది. ప్రతిరోజూ అర్ధరాత్రిళ్ళు పహారా కాసే పోలీసు జవాన్లను సైతం ముప్పు తిప్పలు పెడుతూ ఈ హోటల్ యాజమాన్యం లక్షలు దండుకుంటుంది. సాధారణంగా రాత్రి పదకొండు, పన్నెండు గంటలు దాటిందంటే పెట్టీ కేసులు నమోదు చేసే కింది స్థాయి పోలీసులు సైతం వీరితో కలిసిపోయి అందినకాడికి దండుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీసీపీలు చొరవ చూపుతుంటే కేపీహెచ్బీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ఇలా అర్ధరాత్రిళ్ళు హోటళ్లు నడుపుతూ, క్రైం రేటు పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. ఎవరు బాధ్యులు అనే విషయాలతో ‘నవతరం’ ప్రత్యేక కథనం..
కూకట్పల్లి / హైదరాబాద్, అక్టోబర్ 17 (నవతరం): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి లో ఎవరూ ఊహించని, ఎవరికీ అర్ధం కాని విషయమొకటుంది. అదేమిటంటే హైదరాబాద్ మొత్తంలో రాత్రిపూట ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వుండాలనే ఉద్దేశ్యంతో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఎలాంటి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అయినా రాత్రి పదకొండు, పన్నెండు గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు పోలీసు బాసులు. దీంతో చాలా వరకు వీరి ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు, ప్రజల శాంతి భద్రతలకు సహకరిస్తున్నారు వీటి యజమానులు. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్బీ లో మాత్రం ఇందుకు విరుద్దంగా కొన్ని హోటల్ యజమానులు వ్యవహరిస్తూ స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. ‘లా అండ్ ఆర్డర్’ కంట్రోల్ చేయాల్సిన స్థానిక పోలీసులు ఒక హోటల్ విషయంలో మాత్రం పక్షపాత ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారా అంటూ ఇక్కడి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో వున్న ‘సిరి టిఫిన్ సెంటర్’ రోజులో ఇరవై నాలుగు గంటలు తెరిచి వుంచుతూ, ప్రతిరోజూ ఏదో ఒక రకమైన గోడవకు కారణమౌతూ, స్థానిక పోలీసులకు, కాలనీ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు హోటల్ యాజమాన్యం. చుట్టూ బాయ్స్, గర్ల్స్ హోటల్స్ ఉన్న కారణంగా వారిని ఆకర్షిస్తూ, అర్ధ రాత్రిళ్ళు తెరిచి వుంచుతూ ప్రతి రోజూ ‘లక్షకు తగ్గకుండా’ కౌంటర్ నింపుకుంటూ.. ఇడ్లీ నుండి అక్రమ మద్యం వరకు సరఫరా చేస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు హోటల్ నిర్వాహకులు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా రాత్రి భోజనం (ఇడ్లీ, ఉప్మా, దోష, టొమాటో రైస్, లెమన్ రైస్, సాంబార్ ఇడ్లీ, ఎగ్ నూడుల్స్, చికెన్ నూడుల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, కూల్ డ్రింక్స్, అవసరమైతే క్వార్టర్ మద్యం), అన్ని రకాల సిగరెట్లు సరఫరా చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ హోటల్ యజమానులు. వైన్స్, బార్లు మూసివేశాక.. అక్కడ మద్యం సేవించిన మందు బాబులు ఇక్కడి ఫుడ్ కి అలవాటుపడి అర్ధరాత్రిళ్ళు ఇక్కడికి చేసరుకుని, చాలా సందర్భాలలో కాలనీలో నానా హంగామా చేశారు. బయట మద్యం సేవించి ఇక్కడి ఆహారం కోసం వచ్చేవారు కొందరైతే.. బయట మద్యం సరిపోక ఇక్కడి హోటల్ లోని డార్క్ రూమ్(వంటశాల) లో సీక్రెట్ గా మద్యం సేవించేవారు మరికొందరు దాపురించారు. ఈ సిరి హోటల్ లో పగటి పూట గర్ల్స్ హాస్టల్ ల నుండి వచ్చి కొందరు వీరి భోజనాలను ఆరగిస్తుండగా.. రాత్రిపూట బాయ్స్ హాస్టల్ ల నుండి వచ్చే చాలా మంది వీరి రుచులకు బానిసలుగా మారారు. ఇదే చొరవగా తీసుకున్న హోటల్ యాజమాన్యం స్థానిక పోలీసులను (కిందిస్థాయి సిబ్బంది) మేనేజ్ చేసుకుంటూ అర్ధరాత్రిళ్ళు తమ హోటల్ ను ఫైవ్ స్టార్ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ యొక్క రాత్రి పూట గల్లా లక్షకు తగ్గకుండా ఉంటుందంటూ ఇక్కడి కస్టమర్లు చెప్పటం పలు అనుమానాలాకు తావిస్తోంది. కేవలం ఆహారమేనా లేక ఇక్కడ మద్యం కూడా లభిస్తుందా అంటే అవుననే చెబుతున్నారు వీరి రెగ్యులర్ కస్టమర్లు. పేరుకేమో టిఫిన్ సెంటర్ కానీ మద్యం కూడా దొరుకుతుందా అంటూ మరింతగా కస్టమర్ల ఫ్లో పెరుగుతూనే వుంది. ఈ హోటల్ వద్ద మందుబాబుల హల్చల్ ఒకటైతే, బయట ఫుడ్ కు అలవాటు పడిన కొందరు తమతమ ఇండ్లలో తినడమే మానేసి, అర్ధరాత్రిళ్ళు మెలకువ ఉండి ఇంట్లోవారితో గొడవలు పడుతూ తమ కుటుంబాలను విచ్చిన్నం చేసుకున్న అమాయకులెందరో అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. హైదరాబాద్ నగరంలోనే అత్యంత పేరుగాంచిన కేపీహెచ్బీ పక్కనే వున్న అడ్డగుట్టలో ఎందరో విద్యావంతులున్నారు. అయినా కూడా ఎవరూ వీరి ఆగడాలను ప్రశ్నించడానికి ముందుకు రారు. ఎందుకంటే, ఈ హోటల్ యాజమాన్యం రోజులో ఇరవై నాలుగు గంటలు తెరిచి వుంటుందంటే ఎంతమందిని మేనేజ్ చేసుకుని వుంటుంది, వీరికి ఎంతమంది తోడుగా వుండి వుంటారు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ఆద్యాపకులు, టెకీలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు నివాసముండే ఆసియా ఖండంలోనే మొదటి కాలనీ గా పేరున్న కేపీహెచ్బీ పక్కనే వున్న అడ్డగుట్టలో ఇలాంటి ఒక హోటల్ వుందంటే ఇటు సామాన్య ప్రజలు, అటు విద్యావంతులు సైతం మౌనంగా వుండటం సమాజానికే చేటంటున్నారు నిపుణులు. రాత్రి తర్వాత ఒక చిన్న పాన్ షాప్, ఒక టీ స్టాల్ తెలిచివున్నా వాటి ఫోటోలు తీసి పెట్టీ కేసులు నమోదు చేసే సైబరాబాద్ ‘లా అండ్ ఆర్డర్’ పోలీసులు అనునిత్యం రాత్రి పగలు అని తేడా లేకుండా తెలిచి వుంచుతూ పలు ఆసాంఘీక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సదరు ‘సిరి టిఫిన్ సెంటర్’ పై ఎన్ని పెట్టీ కేసులు నమోదు చేశారు…? ఈ కాలనీ ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ మండి పడుతున్నారు స్థానిక ప్రజలు.
అడ్డదారి పడుతున్న యువత
సమయానికి ఇంటికి రాక, అమ్మానాన్నలతో గొడవలకు దిగుతూ, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ హోటల్ ఫుడ్ అండ్ మద్యం మోజులో పడి విచ్చలవిడిగా బయట తిరుగుతూ.. తమ ఇంట్లో గొడవలు పడుతూ కన్న తల్లి దండ్రులపైనే దాడులకు దిగుతున్నారు కొందరు ఆవారాగాళ్లు. దీనికి ప్రధాన కారణం ఇలాంటి సమయం సందర్భం లేని హోటళ్లు, బెల్టు షాపులేనంటున్నారు స్థానిక ప్రజలు. రోజూ మద్యం సేవించడం. అర్ధరాత్రిళ్ళు టిఫిన్, సిగరెట్ ల పేర్లతో బయట షికార్లు కొట్టడం అలవాటుగా మార్చుకున్న కొందరు పుత్ర రత్నాలు, మద్యం మత్తులో ఏదో ఒక గోడవలో ఇరకటం.. జైలు పాలు కావటం చాలా మంది తల్లిదండ్రులు జీర్ణించుకొని విషయంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ‘సమయం కాని సమయంలో.. సమయం కాని పనులు’ చేయటమేనంటున్నారు విశ్లేషకులు. యువత అడ్డదారి పడుతూ ఎన్నో నష్టాలు, కష్టాలు కొనితెచ్చుకుంటుందని, ఇలాంటి అర్ధరాత్రిళ్ళు తెరిచివుంచుతున్న టిఫిన్ సెంటర్లు, బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అ.. ఆ.. ఆ.. ఆ.. అల్లుడు శీను, ఎవరేమీ చేయరు నిన్నూ..
ఆయన పేరు అల్లుడు శీను, అవును నిజమే.. ఆయను చూస్తే ఎవరికైనా అలానే పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే మామలు అలానే పిలుస్తారు. రోజుకింత, వారానికింత అంటూ వసూళ్లు తీసుకునే మామలు గతంలో చిన్న ఇడ్లీ కొట్టుగా ఉన్న ఈ ‘సిరి టిఫిన్ సెంటర్’ ను ఓ ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చడంలో స్థానిక మామలే తగినంత సహాయ సహాకారాలందించి వుంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అర్ధరాత్రిళ్ళు ఏ టిఫిన్ సెంటర్, బెల్ట్ షాపుకు అనుమతివ్వని మామలు ఈ ఒక్క టిఫిన్ సెంటర్ కు మాత్రమే ఎందుకంత సడలింపు ఇచ్చారనేది అర్థం కాని ప్రశ్ననే అంటున్నారు ఇక్కడి జనం. ఈ మామలు.. ఆ అల్లుడు శీనుపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారనేది పైస్థాయి అధికారులు నిఘా పట్టాల్సిన విషయం. మేమున్నాం.. మీరు మీ వ్యాపారం చల్లగా చేసుకోండంటూ పరోక్షంగా సహకారమందిస్తున్న వారిపై, ఈ హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేస్తామంటున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు.

ఒక సాంబార్ ఇడ్లీ, ఒక లెమన్ రైస్ కలిపి రూ.110/- 
అర్ధరాత్రి హోటల్ బిల్ పేమెంట్ 
రాత్రి సమయంలో తెరిచి వుంచిన హోటల్ 


హోటల్లో వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 

రాత్రి సమయంలో తెరిచిన సిరిహోటల్ 

వందల మంది కస్టమర్లతో రాత్రి సమయంలో పోలీసులకు సవాలుగా మారిన సిరి హోటల్

