మ‌రోసారి..స‌ర్కారు సారీ!

0
888

వెన‌కాముందూ ఆలోచించ‌కుండా నిర్ణ‌యం తీసుకోవ‌డం…త‌ర్వాత కోర్టుల జోక్యంతో నాలుక్క‌రుచుకోవ‌డం టీఆర్ఎస్ స‌ర్కారుకు అల‌వాటులో పొర‌పాటుగా మారిపోతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చీరాగానే ఒకేరోజు స‌మ‌గ్ర స‌ర్వే పేరుతో అంద‌రినీ హ‌డ‌లెత్తించింది కేసీఆర్ ప్ర‌భుత్వం. ఎక్క‌డెక్క‌డివారో ఉరుకులు ప‌రుగుల మీద స్వ‌స్థ‌లాల‌కు చేరుకుని పుట్టుమ‌చ్చ‌లు స‌హా మొత్తం వివ‌రాల్ని స‌మ‌ర్పించాల్సి వచ్చింది. అక్క‌డితో మొద‌లుపెట్టి మొన్న‌టి నేర‌స్తుల స‌మ‌గ్ర స‌ర్వేదాకా ఎన్నో తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌తో త‌ప్పులు స‌రిదిద్దుకుంటూనే ఉన్నారు సీఎం కేసీఆర్‌.
ఆ మ‌ధ్య నేర‌స్తుల స‌మ‌గ్ర స‌ర్వే అంటూ పోలీసు రికార్డుల్లో ఉన్న‌వారి ఇళ్ల త‌లుపులు త‌ట్టింది తెలంగాణ పోలీసుశాఖ‌. మిగిలిన ద‌ర్యాప్తులు, కేసుల్ని వ‌దిలి పాత నేర‌స్తుల లిస్ట్‌ల‌తో ఊరూవాడా క‌లియతిరిగారు పోలీసులు. అయితే ఈ స‌ర్వే ఔచిత్యంపై అప్ప‌ట్లోనే ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. కొంద‌రు పోలీసు అధికారుల‌కు కూడా ఈ స‌ర్వేలో హేతుబ‌ద్ధ‌త క‌నిపించ‌క‌పోయినా స‌ర్కారువారి ఆదేశాన్ని పాటించ‌క‌త‌ప్ప‌ద‌న్న‌ట్లు ఫాలో అయ్యారు. తీరా ఈస‌ర్వేను స‌వాలు చేస్తూ ఓ వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసేస‌రికి స‌ర్వేను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులెవ‌ర‌యినా ఒకే కేరాఫ్ అడ్ర‌స్‌లో ప‌దేళ్ల‌పాటు ఎందుకుంటార‌ని పోలీసుశాఖ త‌మ‌నుతాము ప్ర‌శ్నించుకుని ఉంటే ఈ ప్ర‌హ‌స‌న‌మంతా ఉండేదే కాదు. ఏవో చిన్నాచిత‌కా కేసుల్లో ఇరుక్కున్న‌వారు, అనుకోకుండా కేసుల్లో చిక్కుకున్న‌వారు ఆ చేదు అనుభ‌వాన్ని ఎప్పుడో మ‌రిచిపోయి త‌మ మానాన తాము బ‌తుకుతుంటే..ఖాకీడ్ర‌స్సులో పోలీసుల ఇళ్ల‌కొచ్చేస‌రికి వంద‌ల‌మంది ప‌రువుపోయింది. స్వేచ్ఛ‌గా, గౌర‌వంగా బ‌తికేందుకు ఉన్న హ‌క్కుని ఖాకీలే లాగేసుకున్న‌ట్ల‌య్యింది. లేడికి లేచిందే ప‌రుగ‌న్న‌ట్లు బుర్ర‌కు ఆలోచ‌న త‌ట్ట‌గానే అమ‌లులో పెట్టేయాల‌నుకుంటే ప‌ర్య‌వ‌సానాలు ఇలానే ఉంటాయి మ‌రి.