అయిన‌నూ..చేసి తీర‌వ‌లె!

0
369

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ప‌డ్డ‌చోటే లేచి కూర్చోవాలి. చూసేవాళ్ల‌కి వైసీపీ వ్యూహం అలాగే క‌నిపిస్తోంది. కేంద్రాన్ని గుడ్డిగా న‌మ్ముకునో, కొన్ని విష‌యాల్లో అనివార్యంగా రాజీప‌డిపోయో టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేసింది. మ‌రి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వైసీపీ చేసిందేంటి? జ‌నంలో దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తుందనే భ‌యంతోనో, రేపు ఏ మొహం పెట్టుకుని జ‌నం ముందుకు వెళ్తామ‌నే క‌ల‌వ‌రంతోనో మొత్తానికి టీడీపీ ఎంపీలు ఉభ‌య స‌భ‌ల సాక్షిగా గ‌ట్టిగానే నోరిప్పారు. ఫ‌ర్లేదు..వీళ్ల‌కు కూడా నోరుందే అని ఏపీ ప్ర‌జ‌లు అనుకునేలా చేశారు. కానీ లోక్‌స‌భ‌లో, రాజ్య‌స‌భ‌లో వైసీపీ చేసిందేంటి? ఏపీ హ‌క్కుల గురించి మాట్లాడుంటే బావుండేది. కానీ టీడీపీ ప్ర‌భుత్వాన్ని తూర్పార‌బ‌డుతూ, టీడీపీ ఎంపీల పోరాటాన్ని డ్రామాగా కొట్టి పారేయ‌డానికి వాళ్ల పుణ్య‌కాలం గ‌డిచిపోయింది.

ఢిల్లీ పోరాటంలో వైసీపీ పాత్ర చ‌ర్చ‌నీయాంశం కావ‌టంతో ప్ర‌తిప‌క్ష‌పార్టీ డిఫెన్స్‌లో ప‌డింది. ఓ వైపు నాలుగేళ్లు మౌనంగా ఉన్నార‌నే డ్యామేజ్‌ని కాస్త ఆల‌స్య‌మైనా టీడీపీ క‌వ‌రింగ్ చేసుకుంటే త‌ప్ప‌ట‌డుగులేసి వ్యూహాత్మ‌కంగా త‌ప్పులు చేసింది వైసీపీ. కేంద్రంపై గ‌ట్టిగా పోరాడార‌ని టీడీపీ ఎంపీలు జ‌నంలో క్రేజ్ తెచ్చుకుంటే…వైసీపీ ఎంపీలేమో బీజేపీతో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కోసం రాజీప‌డ్డార‌న్న అప‌నింద‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. బీజేపీతో మిత్ర‌బంధాన్ని తెంచుకునేందుకు ఎన్డీఏ ప‌క్షాలు క్యూ క‌డుతుంటే మునిగేలా ఉన్న ఆ పార్టీ ప్రాప‌కం కోసం మ‌నం పాకులాడాల్సిన అవ‌స‌రం ఉందా అన్న చ‌ర్చ వైసీపీలోనే మొద‌లైంది. అందుకే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా రాజీనామాల అస్త్రాన్ని బ‌య‌టికి తీసింది వైసీపీ.

ఏప్రిల్ 5వ‌ర‌కు ఎదురుచూసి 6న పార్టీ ఎంపీలు రాజీనామా చేయాల‌నేది వైసీపీ తాజా వ్యూహం.

దాంతోపాటు ప్రత్యేక హోదా అంశంపై దూకుడు పెంచాలని జగన్‌ నిర్ణయించారు. అమరావతిలో దీక్ష చేస్తే ఎలా ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే అధినేత దీక్ష‌పై వైసీపీ వర్గాలు పెదవి విప్పడం లేదు. ఏప్రిల్‌ 5 దాకా హోదా కోసం పోరాటాలను ఉధృతం చేయాల‌నీ.. పార్లమెంటులో ఆందోళ‌న నిర్వ‌హించాల‌నీ వైసీపీ ఎంపీలు నిర్ణ‌యించారు. హోదా, రైల్వే జోన్‌, విభ‌జ‌న హామీలపై కేంద్రం సానుకూలంగా స్పందించ‌క‌పోతే 6న ఎంపీలతో రాజీనామాకైతే నిర్ణ‌యం తీసుకున్నారు. రెండ్నెల్ల‌దాకా ఎలాగూ రాజీనామాలు ఆమోదించ‌ర‌ని..ఆలోగా ఎలాగూ ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని వైసీపీ నిర్ణ‌యాన్ని రాజ‌కీయ డ్రామాగా టీడీపీ కొట్టిపారేస్తున్నా…ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే వైసీపీ రాజ‌కీయంగా న‌ష్ట‌పోక త‌ప్ప‌ద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.