ఐదేళ్ల జైలు..కొవ్వు క‌రిగిపోద్ది!

0
712

కొంత‌మంది బ‌తుకంతే. చీకూచింతా లేకుండా సాగిపోయే జీవితంలోకి కోరి క‌ష్టాల్ని కొనితెచ్చుకుంటారు. ఒళ్లు తెలీకుండా త‌ప్పులుచేస్తారు. బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ అదే టైపు. ఎప్పుడో ఉర‌క‌లేసే వ‌య‌సులో ఉన్న‌ప్పుడు స‌ర‌దాగా జింక‌ని చిరుత‌లా వేటాడాడు. ఇర‌వై ఏళ్ల త‌ర్వాత ఆ కేసు మెడ‌కు చుట్టుకుంటుంద‌నీ..జైలు ఊచ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌స్తుంద‌నీ ఊహించ‌నైనా ఊహించ‌లేదు సిక్స్‌ప్యాక్ సోగ్గాడు. త‌ప్ప‌తాగి కారు న‌డిపిన కేసులు సాక్ష్యాలు అటూఇట‌యినా కృష్ణ‌జింక‌ల వేట విష‌యంలో మాత్రం త‌ప్పించుకోలేక‌పోయాడు. ఐదేళ్ళ జైలు శిక్ష ప‌డ్డ సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ జైల్లోప‌డ్డాడు. సార్ ఇప్పుడ‌క్క‌డ ఖైదీనెంబ‌ర్ 106.

బిష్ణోయ్‌ గ్రామానికి చెందిన 28 మంది సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తాము తుపాకీ శబ్దం విని గుడిసెల్లోంచి పరిగెత్తుకుంటూ సంఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు. తాము బైక్‌లపై జిప్సీ వాహనాన్ని వెంబడించామని, కానీ అప్పటికే సల్మాన్‌ ఖాన్‌ పారిపోయాడని, అక్కడ కృష్ణ జింక మృతదేహం ఉందని వారు చెప్పారు.

1998లో హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సిన్మా షూటింగ్‌ సమయంలో కృష్ణ జింకలను వేటాడాడని స‌ల్మాన్‌ఖాన్‌మీద కేసు న‌మోదైంది. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్‌తో ఉన్న సైఫ్అలీఖాన్‌, సోనాలిబింద్రే, ట‌బు, నీలం కొఠారి ఉన్నా వారు న‌లుగురూ నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ రోజు జిప్సీలో స‌ర‌దా కోసం చేసిన జింక‌ల‌వేట ఇంత దూరం తీసుకొస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. స‌ల్మాన్ దుర‌దృష్ట‌మ‌ల్లా జంతువుల‌ను సొంత బిడ్డ‌ల్లా ప్రేమించే బిష్ణోయ్ తెగ ఉండే గ్రామ స‌మీపంలో జింక‌ల్ని వేటాడ‌ట‌మే. స‌ల్మాన్ ఆ రోజు రెండు కృష్ణ‌జింక‌ల్ని వేటాడి చంపిన‌ట్లు ప్రాసిక్యూష‌న్ వాదించ‌డ‌మే కాదు అందుకు బ‌ల‌మైన సాక్ష్యాలు చూప‌టంతో స‌ల్మాన్ త‌ప్పించుకోలేక‌పోయాడు.

ముంబాయిలోని బాంద్రా సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారి పైకి సల్మాన్‌ ఖాన్‌ కారు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. కొంద‌రు తీవ్ర‌గాయాల పాల‌య్యారు. ఆ సమయంలో సల్మాన్‌ మద్యం తాగి ఉన్నాడు. కారు నడిపింది సల్మాన్‌ ఖాన్‌నేని ఆధారాలు దొర‌క్క‌పోవ‌టంతో సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు.

తీర్పు వెలువడే సమయంలో సల్మాన్‌ ఖాన్‌ తనకు ఇష్టమైన నల్లటి చొక్కాలో కోర్టుకు వచ్చాడు. స‌ల్మాన్ శిక్ష‌ను త‌గ్గించేందుకు అత‌ని లాయ‌ర్లు ఎంత వాదించినా లాభం లేక‌పోయింది. తీర్పు ఇచ్చే సమయంలో జోధ్‌పూర్‌ న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘సల్మాన్‌ ఓ నటుడు. ప్రజలు ఆయన్ను చూస్తూ ఉంటారు. అంతేకాదు.. అనుకరిస్తారు. అలాంటి ప్ర‌ముఖుడు ఓ అమాయక జింకను వేటాడి చంపడం ఎంతమాత్రం సమంజసం కాదు’ అని శిక్ష ఖరారు చేశారు. తీర్పు విన‌గానే స‌ల్మాన్‌ఖాన్ భావోద్వేగానికి లోన‌య్యాడు.