
అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం పిలుపు..
నవతరం, తిరుపతి : అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ తిరుచానూరులో “ఆదర్శ ఉమ్మడి గాండ్ల కుటుంబం” పేరిట ఒక వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వంజవాకం గురుదశరథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గాండ్ల తెలికుల ఆత్మీయ సంగమం పేరిట జరగనున్న ఈ విశేష కార్యక్రమంలో గాండ్ల తెలికుల ఉమ్మడి కుటుంబాలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించే విధంగా” ఆదర్శ ఉమ్మడి గాండ్ల కుటుంబం “అనే బిరుదుతో సత్కరించడం జరుగుతోందని ఆయన తెలిపారు. అదేవిధంగా గాండ్ల సామాజిక వర్గంలో ఈ ఏడాది ఐఐటి, మెడిసిన్, మాస్టర్స్ నందు ఉద్యోగ రంగాలలో అత్యున్నత స్థానాలు పొందిన వారిని సత్కరించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి ముఖ్యమైన అంశాలను గౌరవ అతిథులు మార్గ నిర్దేశం చేస్తారని గురు దశరథన్ స్పష్టం చేశారు. తిరుచానూరులో స్థానిక పద్మావతి కన్వెన్షన్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, విశిష్ట అతిథులుగా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆర్. పన్నీర్ సెల్వం, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి(డాలర్), టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్, బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు హాజరు కానున్నారని తెలిపారు. రెండవ పూట సమావేశంలో అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు గ్రోసుల సుబ్బారావు నేతృత్వంలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించబడుతుందన్నారు. ఈ సమావేశంలో గాండ్ల తెలికుల సామాజిక వర్గ ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాలలో వెనుకబాటు తన నుంచి విముక్తి పొంది, ఇతర సామాజిక వర్గాలతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన స్వాతంత్ర్య ఫలాలు జనాభా దామాషా పద్ధతిలో సాధించుకోవడానికి తగ్గ కార్యాచరణపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా గాండ్ల తెలికుల సామాజిక వర్గ రాష్ట్ర కార్పొరేషన్ సాధన, రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదిక పై వివిధ పదవుల్లో భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ సమావేశాల్లో దశ దిశ నిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులైన కార్యనిర్వాహక అధ్యక్షులు నరవ అనంతం, ప్రధాన కార్యదర్శి బొర్రా మధుసూదన్, కోశాధికారి గార్లదిన్నె నాగరాజు, గౌరవ ముఖ్య సలహాదారు గిద్దలూరు ప్రభాకర్ రావు, నాగేంద్ర ప్రసాద్, ఇంజరాపు విశ్వనాథ్, కెల్లా శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బచ్చల పుల్లయ్య, తిరుపతి హరి గోపాల్, అంబటి గురుమూర్తి, డాక్టర్ కల్లేపల్లి కూర్మనాద్, కొమనాపల్లి లక్ష్మణ ప్రసాద్, ఎస్. చౌడప్ప, చిట్టెం శెట్టి వెంకట కృష్ణారావు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు సాకం ప్రభాకర్, గాండ్ల చంద్రశేఖర్, బాసెట్టి గంగప్ప తదితరులతో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, జోనల్ కార్యనిర్వాహక అధ్యక్షులు, లీగల్ సెల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

