తెల్లారితే చాలు తన జోలికొస్తే నెత్తిన బాంబేస్తానని బెదిరిస్తూ యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తించే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఏడేళ్ల తర్వాత మొదటిసారి దేశం దాటాడు. సోమవారం ఆకస్మికంగా చైనాలో ప్రత్యక్షమయ్యాడీ నియంత. 2011లో ఉత్తరకొరియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కిమ్ దేశం విడిచి వెళ్లడం ఇదే మొదటిసారి.
కిమ్ సీక్రెట్ టూర్‌పై చైనా, ఉత్తరకొరియా పెదవి విప్పటంలేదు. హై సెక్యూరిటీతో ఉత్తరకొరియా రైలు ఒకటి బీజింగ్‌కి చేరిందన్న విషయాన్ని జపాన్ మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోని కూడా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు మిత్రదేశమైన చైనాకి కిమ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో తన తండ్రి చైనాకి రైల్లోనే వెళ్లారు. ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉన్న రైలు బీజింగ్‌కి చేరుకునే సమయంలో స్టేషన్‌లో పెద్దసంఖ్యలో చైనా సైనికులు మోహరించారు.
మొన్నటిదాకా ఎవరైనా తనతో కాళ్లబేరానికి రావాల్సిందేనని మొండికేసిన కిమ్ తన బద్ధశత్రువు దక్షిణ కొరియాతోనూ సంప్రదింపులకు సిద్ధమయ్యాడు. దక్షిణకొరియా అధ్యక్షుడితో వచ్చేనెల కిమ్ సమావేశమయ్యే అవకాశముంది.
మే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోనూ ఆయన సంప్రదింపులు జరుపుతారు. మరో ప్రపంచయుద్ధం తప్పదన్నట్లు యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న కిమ్ తగ్గుదామనుకుంటున్నాడా? ఇంకేమన్నా కొత్త ఐడియాలేస్తున్నాడా?

