బలమని భ్రమపడితే సరిపోదు, బలగాన్ని కూడగడితేనే భవిష్యత్తు – శ్రీకాకుళం వైసీపీకి ఇదే పరీక్షా?

0
67




సామాజిక వర్గాల విభేదాలతో పార్టీలో సవాల్ తప్పదా?…

మైనార్టీల విస్మరణతో క్యాడర్ లో అసంతృప్తి నిజమేనా?…

ఏడు నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయా?…

నవతరం, శ్రీకాకుళం: ఉభయకాయం చూసి బలవంతుడు అనుకోవద్దనే పాత సామెత నేటి శ్రీకాకుళం జిల్లా వైసీపీ పరిస్థితికి అక్షరాలా సరిపోతుందని జిల్లా రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. పైకి చూడడానికి పార్టీ చాలా బలంగా, పటిష్టంగా కనిపిస్తున్నా, లోపల అంతర్గతంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూపులు, రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య అంతర్గత విభేదాలు, బల ప్రదర్శనలు, మైనార్టీలను పరిగణలోకి తీసుకోకపోవడం, కీలక నేతలు తమ గ్రూపులను బలం చేకూర్చే విధంగా విభజించు పాలించు అనే సూక్తికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కలిసి పార్టీని లోలోపల ఇబ్బందులకు గురిచేస్తున్నాయని క్షేత్రస్థాయి క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు విస్తృతంగా చర్చించుకున్నారు.

అసలు జిల్లాలో ఏం జరుగుతోంది అంటే, గత వారంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు జిల్లాలోని వారికి ఒక బలమైన సామాజిక వర్గం సన్మాన సభకు అదే సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులను జిల్లాలోని కీలక నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు క్షేత్రస్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అది నిజమో కాదో దేవుడికే తెలియాలి అని కార్యకర్తలు చెబుతున్నా, ఈ ఒక్క సంఘటన చాలు పార్టీలో ఎంత లోతైన విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఒక సామాజిక వర్గం సభకు అదే సామాజిక వర్గ నేతలను రాకుండా అడ్డుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది ఆధిపత్య పోరుకు పరాకాష్ట అని విశ్లేషకులు అంటున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా బల ప్రదర్శనలు, సభల నిర్వహణ, ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నాలు పార్టీకి పెద్ద సవాల్ గా మారాయి. నేను ఉంటే నువ్వు ఉండకూడదు, నువ్వు ఎదిగితే నా పదవికి ముప్పు అనే భయం, అభద్రతా భావం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోనూ పూర్తిస్థాయిలో పార్టీ అంతర్గతంగా బలం చేకూర్చే విధంగా ప్రయత్నించాలంటే నేటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని చెప్పక తప్పదు. ఇచ్ఛాపురం నుంచి పాతపట్నం వరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ముగ్గురు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది, కానీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఆ బలం ఓట్లుగా మారడం లేదు. ఒక నేత కార్యక్రమం పెడితే మరో నేత వెళ్లడం లేదు, ఒక నేత సభ పెడితే మరో నేత అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక నలిగిపోతున్నారు. పార్టీ కార్యాలయానికి వెళ్లాలంటే కూడా ఏ గ్రూపు వారిది అని చూసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి కొంతవరకు ప్రజాదరణ కలిగి ప్రజలతో మమేకమైనటువంటి కొంతమంది సీనియర్ నాయకులకు, జనాభా ప్రాతిపదికన అధిక జనాభా కలిగిన సామాజిక వర్గంలోని వారికి చాలా కాలంగా దూరం పెట్టడం జరుగుతోంది. వారిని కావాలనే పక్కన పెట్టారు, వారికి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు లోనై చివరకు వారి ప్రయాణం ఎటువైపు సాగుతుందోనని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్లను గౌరవించకపోతే పార్టీకి నష్టం తప్ప లాభం లేదని, వారికి ఉన్న అనుభవం, ప్రజల్లో ఉన్న పట్టు పార్టీకి ఎంతో అవసరమని, కానీ కీలక నేతలు తమ స్వార్థం కోసం వారిని దూరం చేస్తున్నారని అంటున్నారు.

జిల్లాలోని కీలక నేతలు ఏకపక్ష నిర్ణయాలతో తన మాటకు, నిర్ణయాలకు తిరుగు ఉండకూడదనే ధోరణితో ఉన్నారని ప్రచారం బలంగానే ఉంది. నేను చెప్పిందే వేదం, నేను తీసుకున్న నిర్ణయమే ఫైనల్, ఎవరూ ప్రశ్నించకూడదు అనే ధోరణి పార్టీలో పెరిగిపోయింది. దీనివల్ల కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏదైనా చెబితే తమ పదవులు పోతాయో, తమను పక్కన పెడతారో అనే భయంతో చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు, ప్రజాస్వామ్య పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, అందరి మాట వినాలి అని సీనియర్లు అంటున్నారు.

మరో అత్యంత కీలకమైన అంశం మైనార్టీలను పూర్తిగా విస్మరించడం. శ్రీకాకుళం జిల్లాలో మైనార్టీ ఓట్లు చాలా కీలకం. పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస వంటి నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా మైనార్టీ నాయకులను, కార్యకర్తలను పార్టీ పూర్తిగా విస్మరిస్తోంది. వారిని కీలక సమావేశాలకు పిలవడం లేదు, వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. దీంతో మైనార్టీ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప మా అభివృద్ధిని, మా ప్రాతినిధ్యాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

ఇక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరుపై కూడా క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏనాడూ నాయకులు చెప్పిన మాటల ప్రకారమే నిర్ణయాలు కానీ, ఎన్ని వార్తలు వచ్చినా, ఎంతమంది శ్రేయోభిలాషులు పలువిధాలుగా తెలియజేసినా ఏనాడూ కూడా పార్టీ క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకొని అందుకు అనుకూలంగా నమ్మకమైన సమర్థుడైన వ్యక్తితో దర్యాప్తు జరిపించి నిజాలను తెలుసుకొని నేడున్న పరిణామాల పట్ల భవిష్యత్తు నిర్ణయాలను ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ లోపం జరుగుతుంది, దానిని ఏ విధంగా సరిచేయాలనే ఆలోచన అధినేతకు లేనే లేదని చెప్పక తప్పదని సీనియర్ నాయకులు అంటున్నారు.

సహజంగా సినిమా నటులకు అభిమానులు ఉంటారు, రాజకీయాల్లో కూడా చరిష్మా కలిగి అత్యధిక శాతం ప్రజలు అభిమానించే ప్రజా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారందరూ కూడా పార్టీకి విధేయులు, ఓట్లు వేసేవారు అని భ్రమపడడం సరైన విధానం కాదు. అభిమానం వేరు, ఓటు వేరు. అభిమానులు సినిమా చూస్తారు, కానీ ఓటు వేసేటప్పుడు స్థానిక నాయకుడిని, స్థానిక పరిస్థితులను, తమకు జరిగిన న్యాయాన్ని చూస్తారు. ఈ వాస్తవాన్ని అధినేత గుర్తించాలి.

ఏదేమైనా ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పార్టీ పైన బలంగానే ఉంది. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన పాలన ప్రజల మదిలో ఇప్పటికీ ఉన్నాయి. కానీ అంతర్గత లోపాలను దీర్ఘకాలంగా సరిచేయలేకపోవడం వల్లనే ఆ అభిమానం ఓట్లుగా మారడం లేదు. పార్టీకి పునాది అయిన కార్యకర్తలను, సీనియర్ నాయకులను, అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లకపోతే ఎంత చరిష్మా ఉన్నా ప్రయోజనం ఉండదు.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధిష్టానం, అధినేత గుర్తించి తక్షణమే నిబద్ధత కలిగిన సొంత వ్యక్తితో అంతర్గతంగా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయాలను నిర్మొహమాటంగా, నిబద్ధతగా తీసుకున్న నాడు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ విజయావకాశాలు బలంగానే ఉన్నవి అనుటకు ఎటువంటి సందేహం లేదు. ఆశిద్దాం ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేసేందుకు వర్గ విభేదాలకు తావులేని విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకొని పార్టీ శ్రేణులను నాయకులను ఒక తాటిపైకి తీసుకొని వచ్చేందుకు సమైక్యంగా సమరంలో పాల్గొనే విధంగా నిర్ణయాలు ఉంటాయని.

*వ్యాసకర్త * వరదరాజుశిరిగిరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here