మామూలు బ్యాక్‌గ్రౌండా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!. ఓ టర్మ్ ఎన్నికైతేనే తిమ్మినిబమ్మిని చేసే తెలివితేటలు అబ్బుతాయి. అలాంటిది నలభైఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్ని ఎత్తుపల్లాలు చూసుండరు. కిందపడ్డా తనదే పైచేయి అని నిరూపించగలరు. లేటుగా ఎత్తుకున్నా లేటెస్టుగా చరిత్రలో కనీవినీ ఎరుగని సాహసాన్ని తానే చేస్తున్నట్లు చెప్పుకోగలరు.
హస్తిన సాక్షిగా జరుగుతున్న షోలో ముందునుంచీ ఎగురుతున్న వైసీపీ సైడైపోతే…పొలిటికల్ స్క్రీన్‌మీద సెవెంటీ ఎంఎంలో ప్రొజెక్ట్ అవుతున్నారు ఏపీ సీఎం.
వైసీపీ అవిశ్వాసతీర్మానం ప్రతిపాదన ప్రస్తావించినప్పుడు దాన్ని ఈకముక్కలా తీసిపారేసింది చంద్రబాబే. విపక్షపార్టీ అవిశ్వాసం వల్ల ఒరిగేదేమీ ఉండదనీ…మోడీతో జగన్ తెరవెనుక కుమ్మక్కై డ్రామాలాడుతున్నారనీ ఆడిపోసుకుంది. ఎప్పుడైతే పవన్‌కళ్యాణ్ నిలబెట్టి కడిగేశాడో టీడీపీ స్టాండ్ మారిపోయింది. వైసీపీ అవిశ్వాసతీర్మానానికి మద్దతిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు. రాష్ట్రంకోసం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
పోనీలే..కాస్త ఆలస్యంగానైనా బాబుగారికి జ్ఙానోదయం అయ్యిందనుకుంటే..తెల్లారేసరికి నాలుక మడతెట్టేశారు. అవిశ్వాసం పెట్టాల్సిందే. కాకపోతే ఆ ఘనకార్యం మన చేతులమీదుగా జరగాలిగానీ…వైసీపీ పెడితే దానికి మద్దతిచ్చి మనం చేతులెత్తేదేంటనేది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తాజా నిర్ణయం. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అవిశ్వాసం పెట్టడం నైతికత కాదనే కారణం చూపి…ఎన్డీఏకి రాంరాం చెబుతున్నట్లు గంభీర ప్రకటన. వైసీపీమీద నమ్మకంలేదనీ…అందుకే తానే అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించి మొత్తం చర్చనంతా తనవైపు తిప్పుకోవడంలో, నేషనల్‌మీడియా నోట్లో నానటంలో విజయవంతంగా నెగ్గుకొచ్చారు ది గ్రేట్ చంద్రబాబు.
టీడీపీ అవిశ్వాసతీర్మానం ఇవ్వడమే ఆలస్యం…ఎన్డీఏతో ఆయన అనుబంధంమీద, వాజ్‌పేయి సర్కారుకీ ఆయనెంత వెన్నుదన్నుగా ఉన్నారన్న చరిత్రమీద నేషనల్‌మీడియాలో కథనాలు. దేశంలో విపక్షాలన్నిటినీ ఏకంచేసే సత్తా చంద్రబాబుకే ఉందన్నంత హడావుడి. ఎన్డీఏమీద టీడీపీ విశ్వాసం కోల్పోయిందంటూ బ్రేకింగ్ న్యూస్‌లు. ఇంతాచేసి ఎప్పట్నించో అవిశ్వాసంకోసం నెత్తీనోరు బాదుకుంటున్న వైసీపీ నోటీసిచ్చినా ఈ ప్రచార రేసులో వెనుకబడిపోయింది. చంద్రబాబు మంచి మీడియా మేనేజర్ అనే విషయం ఈ ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. ఎనీడౌట్స్?


