నీ దేశం మార‌లేదు మ‌లాలా..

0
759

దాదాపు ఆరేళ్ల‌క్రితం స్కూలుకు వెళ్తున్న బాలిక‌పై ఉగ్ర‌వాదులు తూటాల‌వ‌ర్షం కురిపించారు. ప్రాణాలు తీయాల‌న్న ప‌గ‌తో ఆ చిన్నారి త‌ల‌ను గురిచూసి కాల్చారు. ఓ ప‌క్క తాము స్కూళ్ల‌న్ని నేల‌కూలుస్తుంటే ఆడ‌పిల్ల‌ల్ని చ‌దువుకోమ‌ని ప్రోత్స‌హిస్తుందా? అమ్మాయిలు గ‌డ‌ప‌దాట‌కూడ‌ద‌ని తాము తాలిబాన్ సామ్రాజ్య విస్త‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తుంటే..స‌మాజంలో అంతా స‌మాన‌మేనంటుందా? అందుకే ప‌ద్నాలుగేళ్ల ఆ బాలిక‌పై ఉగ్ర‌మూక‌కు అంత ప‌గా ప్ర‌తీకారం. ర‌క్త‌పుమ‌డుగులోకి ఒరిగిపోయిన ఆ లేత దేహంలో ఊపిరి ఇంకా ఆగిపోలేద‌నీ, ర‌క్త‌పు మ‌డుగులోంచి ఓ తేజోవంత‌మైన చైత‌న్య‌కెర‌టం ఎగ‌సిప‌డుతుంద‌ని ముష్క‌రులు ఏమాత్రం ఊహించినా, అనుమానించినా..మ‌రికొన్ని తూటాలు ఆ రోజే త‌ల్లో దిగుండేవేమో?

మృత్యువుతో పోరాడి…దాన్ని జ‌యించి ఊపిరి నిల‌బెట్టుకున్న ఆబాలిక ఈ ప్ర‌పంచానికే పెద్ద పాఠ‌మైంది. త‌న ధైర్యంతో ల‌క్ష‌ల‌మంది ఆడ‌పిల్ల‌ల‌కు ఆద‌ర్శ‌ప్రాయ‌మైంది. ఆమె గొంతుక బాలిక‌ల విద్య‌కు కొండంత బ‌లాన్నిచ్చింది. 2012లో ఉగ్ర‌వాదుల దాడిలో ఇక ప్రాణాల‌తో మిగ‌ల‌డం క‌ష్ట‌మేన‌నుకున్న మలాలా యూసఫ్ జాయ్ చైత‌న్య కెర‌టంలా ఈ ప్ర‌పంచాన్ని క‌మ్మేసింది. లండ‌న్‌లో చికిత్స త‌ర్వాత కోలుకున్న మ‌లాలా కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతోంది. బాలిక‌ల విద్య‌కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బ‌హుమ‌తిని కూడా అందుకున్న మ‌లాలా దాదాపు ఆరేళ్ల త‌ర్వాత సొంత‌గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. పాక్‌లో అడుగుపెట్టిన క్ష‌ణాన ఆ అమ్మాయి భావోద్వేగంతో నిలువెల్లా క‌దిలిపోయింది. కంట‌త‌డిపెట్టింది.

పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన కాసేపటికే ప్ర‌ధాని షాహిద్ ఖాన్ అబ్బాసీని కలుసుకుంది మ‌లాలా. లండన్‌ వీధుల్లో తిరిగిన‌ప్పుడు కూడా ఇస్లామాబాద్, కరాచీ గురించే ఆలోచించేదాన్నని ..పాకిస్తాన్‌లో కూడా ఇంగ్లండ్, న్యూయార్క్‌లో మాదిరిగా బాలికలు, మహిళలు స్వేచ్చగా తిరిగే రోజు రావాలని కోరుకున్నాన‌ని త‌న నెర‌వేర‌ని క‌ల‌ను త‌లుచుకుని బాధ‌ప‌డింది మ‌లాలా. ఉగ్ర‌వాద దాడి నుంచి కోలుకున్నాక‌..మలాలా ఫౌండేషన్ ఏర్పాటు చేసి…నిధులు సేకరిస్తోందీ ధీర‌బాలిక‌. పాకిస్తాన్, నైజీరియా, జోర్డాన్, సిరియా , కెన్యాలో బాలికల విద్య కోసం ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది.

గతంలో దాడికి తెగ‌బ‌డ్డ తాలిబన్లు పాక్‌కి తిరిగొస్తే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించడంతో మ‌లాలాకు భారీ భద్రత కల్పించింది పాక్ ప్ర‌భుత్వం. ఆమె ర‌క్ష‌ణ బాధ్య‌త‌ను తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు పాక్ ప్ర‌ధాని. ప్ర‌పంచ‌మంతా మారిపోవాల‌నే త‌ప‌న‌తో త‌న వంతు సేవ‌లందిస్తున్న మ‌లాలాని ఇప్ప‌టికీ బాధిస్తున్నదొక్క‌టే. మిగిలిన ప్ర‌పంచంలో ఎన్ని మార్పులొచ్చినా పాకిస్తాన్ మాత్రం మార‌లేదు. మారుతుంద‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. ఎందుకంటే విచ‌క్ష‌ణ‌లేని ఉగ్ర‌వాదానికి ర‌క్త‌దాహం త‌ప్ప ఎలాంటి భావోద్వేగాలుండ‌వు.