అబ్బ ఎంత అందంగా ఉందీ అనిపించుకోవాలంటే…చర్మసౌందర్యం తర్వాతే ఎంతటి రూపురేఖలైనా. కొనదేలిన ముక్కు, ఆల్చిప్పలాంటి కళ్లు, దొండపండులాంటి పెదాలు, ఆకట్టుకునే కేశసౌందర్యం ఎన్నున్నా…చర్మం కాంతులీనుతేనే అందం ద్విగుణీకృతమవుతుంది.
అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. నునుపుగా, తేమతో, కాంతులీనే చర్మం కోసం బ్యూటీక్లినిక్‌లు, డాక్టర్ల చుట్టూ తిరిగే కంటే మన డైట్ విషయంలో జాగ్రత్తపడితే సహజసౌందర్యం మీ సొంతమవుతుంది.
బాదం భేష్.. విటమిన్-ఇ ఉండే బాదం పప్పులోని యాంటీఆక్సిడెంట్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలకు రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తినాలి.
క్యారెట్ కరెక్ట్.. ఆరెంజ్ రంగు కాయగూర చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యారెట్ చర్మపు బాహ్య పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తుంది. క్రమంతప్పకుండా క్యారట్ తింటే చర్మం నునుపుగా ఉంటుంది.
గ్రీన్ టీ గ్రేట్…గ్రీన్ టీ ఆకులు మరిగేటప్పుడు విడుదలయ్యే కోటాచిన్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మపు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించటంతోపాటు చర్మానికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. సో..రోజుకో రెండో మూడో గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిదేన్నమాట.
టమోటాతో వృద్ధాప్యానికి టాటా.. ప్రతీ ఒంటింటి కూరల్లో క్రమం తప్పకుండా కనిపించే టమోటాల ప్రయోజనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. లైకోపిన్, ఫొటోకెమికల్స్ చర్మానికి వృద్ధాప్య లక్షణాలను తెచ్చిపెట్టే అతినీలలోహిత కిరణాల్లోని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి చర్మానికి టమోటాలు రక్షణ కల్పిస్తాయి.

